ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ చేరిన అర్జెంటీనా

 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ చేరిన అర్జెంటీనా

ఫిఫా ప్రపంచ కప్‌ 2022లో అర్జెంటీనా అదుర్స్ అనిపిస్తోంది. సెమీస్లో క్రొయేషియాపై 3–0తో విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. 2014 తర్వాత మరోసారి ఫైనల్ చేరి ట్రోఫికి అడుగు దూరంలో నిలిచింది. ఇవాళ మొరాకో ఫ్రాన్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్లో గెలిచిన జట్టుతో అర్జెంటీనా ఫైనల్ ఆడనుంది. 

తిరుగులేని అర్జెంటీనా...

మ్యాచ్ మొదలైనప్పటి నుంచే అర్జెంటీనా దూకుడును ప్రదర్శించింది. అర్జెంటీనాకు దీటుగా క్రొయేషియా సమాధానమిచ్చింది. అయితే 34వ నిమిషంలో అర్జెంటీనాకు పెనాల్టీ కిక్ లభించింది. అల్వారెజ్ బాల్ను తీసుకుని క్రొయేషియా గోల్ పోస్ట్  వైపునకు దూసుకెళ్లాడు. ఈ సమయంలో అతన్ని ఆపేందుకు క్రొయేషియా గోల్ కీపర్ లివకోవిచ్  కావాలనే అల్వారెజ్ను కాలితో ట్యాకిల్ చేశాడు. దీంతో రిఫరీ అర్జెంటీనాకు పెనాల్టీని ఇచ్చాడు. ఈ పెనాల్టీని మెస్సీ గోల్గా మలిచాడు. దీంతో  అర్జెంటీనా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 39వ నిమిషంలో అల్వారెజ్ గోల్ చేయడంతో ఫస్టాఫ్ ముగిసే సమయానికి అర్జెంటీనా 2–0తో స్పష్టమైన ఆధిపత్యంతో నిలిచింది. 

అదరగొట్టిన అల్వారెజ్

సెకండాఫ్లో  అర్జెంటీనా ఆధిక్యాన్ని తగ్గించేందుకు అర్జెంటీనా పలు ప్రయత్నాలు చేసింది.  69వ నిమిషంలో మెస్సీ మెస్మరైజ్ చేశాడు. బాల్ను అందుకుని ముగ్గురిని తప్పిస్తూ గోల్ లైన్ నుంచి  అల్వారెజ్కు అద్భుతమైన పాస్ ఇచ్చాడు. మెస్సీ నుంచి బంతిని అందుకున్న అల్వారెజ్...సూపర్ ఫ్లిక్తో గోల్ పోస్ట్లోకి పంపి అర్జెంటీనాకు మూడో గోల్ను అందించాడు. ఆ తర్వాత క్రొయేషియా ఒక్క గోల్ కూడా చేయలేకపోవడంతో..అర్జెంటీనా 3–0తో మ్యాచ్ను సొంతం చేసుకుని ఫైనల్కు చేరుకుంది.