మున్సిపల్​ చైర్ ​పర్సన్​పై అసమ్మతి లేదు: ఆర్మూర్ బీఆర్ఎస్  కౌన్సిలర్లు

మున్సిపల్​ చైర్ ​పర్సన్​పై అసమ్మతి లేదు: ఆర్మూర్ బీఆర్ఎస్  కౌన్సిలర్లు

 

  • ప్రెస్​మీట్​లో ఆర్మూర్ బీఆర్ఎస్  కౌన్సిలర్లు
  • ప్రత్యర్థులే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపాటు
  • ‘హైకమాండ్​ ఆదేశాల మేరకే కౌన్సిలర్ల ప్రకటనలంటూ చర్చ

నిజామాబాద్​/ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్​ కౌన్సిలర్లు రెండు గ్రూప్​లుగా విడిపోయారన్న వార్తలు జిల్లాలో హాట్​ టాఫిక్​గా మారిన నేపథ్యంలో శనివారం కౌన్సిలర్లు ఆర్మూర్​లో ప్రెస్​మీట్​పెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..అభివృద్ధి నిధుల కోసమే ఎమ్మెల్యేను కలిశామని,తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని ప్రకటించారు. బీఆర్ఎస్​ను దెబ్బతీసేందుకు ప్రత్యర్థులు కుట్ర చేశారని, ఈ కుట్రలను పట్టించుకోకుండా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు చైర్​పర్సన్​పై తిరుగుబాటు చేశారని, అసమ్మతితో ఉన్నారని వచ్చిన వార్తలు అబద్ధమని ఖండించారు. చైర్​ పర్సన్ పై తమకు ఎలాంటి కోపం లేదని, అవిశ్వాస తీర్మానం పెడుతున్నామనడం నిజం కాదన్నారు. ఆర్మూర్ అభివృద్ధికి ఎమ్మెల్యే రూ.200 కోట్లతో ప్రణాళికలు రూపొందిస్తున్నారని, అభివృద్ధి పనుల కోసమే తాము ఎమ్మెల్యేను కలిశామన్నారు. వైస్  చైర్మన్ షేక్​ మున్ను, కౌన్సిలర్లు గంగా మోహన్ చక్రు, ఆకుల రాము, సీనియర్​ నాయకులు ఖాందేశ్​ శ్రీనివాస్, సుంకరి రంగన్న, రవి గౌడ్ , రెహ్మాన్  తదితరులు పాల్గొన్నారు. 

హైకమాండ్​ ఆదేశాల మేరకే..!

చైర్​పర్సన్​పై అసమ్మతి గళం వినిపించిన 26 మంది కౌన్సిలర్లు సడెన్​గా ఐక్యతా రాగం అందుకోవడం హైకమాండ్​ఆదేశాలేనన్న చర్చ సాగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో  పార్టీలో గ్రూపులకు బీజం పడితే  ఇతర ప్రాంతాల్లోనూ వర్గపోరు తెరపైకి వస్తుందని ఎమ్మెల్యే సర్ది చెప్పారని తెలుస్తోంది. అయితే చైర్​పర్సన్  పండిత్​వినీత షాడోలుగా భర్త, బావలు తయారయ్యారని, మున్సిపాలిటీలో  వెంచర్లకు అక్రమ అనుమతులు, అడ్డగోలు వసూళ్లు, ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లను కేటాయించడం, వివాదాస్పద స్థలాల్లో నిర్మాణాలు లాంటి అక్రమాలకు పాల్పడుతూ భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని కౌన్సిలర్లు హైదరాబాద్​కు వెళ్లి ఎమ్మెల్యేకు ఆధారాలతో సహా వివరించారని తెలిసింది. చైర్​పర్సన్​ను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఈ  నేపథ్యంలో ఎమ్మెల్యే వచ్చే వారంలో జిల్లాకు వచ్చి చైర్​పర్సన్​ కుటుంబ సభ్యులతో మీటింగ్​ ఏర్పాటు చేస్తానని  సర్ధిచెపినట్టు తెలుస్తోంది.