ఆదిలాబాద్ జిల్లాలో ఆర్మీ జవాన్‌ కిడ్నాప్‌

ఆదిలాబాద్ జిల్లాలో ఆర్మీ జవాన్‌ కిడ్నాప్‌

గుడిహత్నూర్, వెలుగు: ఆదిలాబాద్​జిల్లా గుడిహత్నూర్‌ మండలం మన్నూర్‌ కు చెందిన ఆర్మీ జవాన్‌ను కిడ్నాప్‌ చేసి చిత్రహింసలు పెట్టిన ఘటన కలకలంరేపింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలానికి చెందిన శివప్రసాద్‌ ఆర్మీలో జవాన్‌. మంగళవారం సాయంత్రం మన్నూర్‌లోని తన సోదరి ఇంటికి వెళ్లాడు. 

కాగా.. ఇచ్చోడ మండలం నర్సాపూర్‌ కు చెందిన ఆరుగురు వ్యక్తులు షిఫ్ట్ డిజైర్, బొలెరో వాహనాల్లో అదే రోజు రాత్రి మన్నూర్ వెళ్లి.. అతడిని కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వెళ్లి గాలింపు చేపట్టారు. 

అర్ధ రాత్రి 1 గంట సమయంలో రెండువాహనాలతో పాటు  ఆరుగురు వ్యక్తులును అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. నర్సాపూర్‌ కు చెందిన ఓ కుటుంబం పరువు తీస్తున్నాడనే కారణంతోనే శివప్రసాద్‌ను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేసినట్లు తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపారు.