బార్డర్​లో ఉన్న జవాన్ ​కోసం హెలికాప్టర్​ పంపిన ఆర్మీ

బార్డర్​లో ఉన్న జవాన్ ​కోసం హెలికాప్టర్​ పంపిన ఆర్మీ
  • బార్డర్​లో ఉన్న జవాన్ ​కోసం హెలికాప్టర్​ పంపిన ఆర్మీ
  • కాబోయే పెండ్లి కొడుకు కోసం అధికారుల నిర్ణయం

శ్రీనగర్ : అది ఏడాదంతా దట్టమైన మంచుతో కప్పి ఉండే ప్రదేశం. లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్ఓసీ)కి సమీపంలో ఉండే ఆ ఆర్మీ పోస్టులో జవాన్లు నిరంతరం పహారా కాస్తుంటారు. ఒకసారి అక్కడ డ్యూటీ పడితే ఏ జవాన్ అయినా నెలల తరబడి ఉండిపోవాల్సిందే. సాధారణంగా సైనికులకు సెలవులు దొరకడమే చాలా కష్టం. ఇక ఎల్ఓసీ దగ్గర పని చేసే వాళ్లకు లీవ్స్ కాదు కదా.. కనీసం ఇంట్లో వాళ్లతో మాట్లాడే సౌకర్యం కూడా ఉండదు. అలాంటి ప్లేస్​లో పనిచేస్తున్న ఒక జవాన్ కోసం ఇండియన్ ఆర్మీ ఏకంగా హెలికాప్టర్ పంపించింది. త్వరలో పెండ్లి చేసుకోబోతున్న ఆ జవాను సకాలంలో ఇంటికి చేరడానికి ఆర్మీ అధికారులు చేసిన ఏర్పాట్లను అందరూ మెచ్చుకుంటున్నరు. ఒడిషాకు చెందిన నారాయణ బెహెరా(30)కు పెండ్లి కుదిరింది. మే 2న జరగాల్సిన పెండ్లి కోసం ఇంటి వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. పెండ్లి టైం దగ్గరపడుతున్నా.. నారాయణ వస్తాడో రాడో అనే ఆందోళన మొదలైంది. దీంతో అతని తల్లిదండ్రులు యూనిట్ కమాండర్​కు ఫోన్ చేశారు. తమ కుమారుడి పెండ్లి ఉందని ఇంటికి పంపాలని రిక్వెస్ట్ చేశారు. అయితే నారాయణ డ్యూటీ చేస్తున్న మచిల్ సెక్టార్ నుంచి శ్రీనగర్​కు ఉండే లింక్ రోడ్ ప్రస్తుతం అందుబాటులో లేదు. దట్టమైన మంచు పడుతుండటంతో అతడిని తీసుకొని రావడం ఇబ్బందిగా మారింది. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు బీఎస్ఎఫ్ ఇన్ స్పెక్టర్ జనరల్ రాజా బాబు సింగ్ కు చేరవేశారు. ఆయన వెంటనే ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్​ను పంపి నారాయణ బెహరాను తీసుకొని రావాలని ఆదేశించారు. రంగంలోకి దిగిన ఆర్మీ.. గురువారం ఆ మంచు కొండల్లో ఉన్న ఆర్మీ పోస్టు నుంచి నారాయణను బెహెరాను శ్రీనగర్​కు ఎయిర్ లిఫ్ట్ చేశారు. అక్కడి నుంచి ఒడిషాలోని ధంకనల్ జిల్లా ఆదిపూర్​కు ప్రయాణం అయ్యాడు. జవాన్ల సంక్షేమం తమకు మొదటి, ముఖ్యమైన అంశమని, అందుకే 
ఎయిర్ లిఫ్ట్ కు ఆదేశించానని ఐజీ చెప్పారు.