ఆ 20 కోట్ల డబ్బు పార్థాదేనని ఒప్పుకున్న అర్పితా ముఖర్జీ

ఆ  20 కోట్ల డబ్బు పార్థాదేనని ఒప్పుకున్న అర్పితా ముఖర్జీ

కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో టీచర్ల నియామకాల స్కామ్ ( స్కూల్ సర్వీస్ కమిషన్ స్కాం) కేసులో ఆ రాష్ట్ర  మంత్రి పార్థా చటర్జీని ఆగస్టు 3 వరకు కస్టడీలోకి తీసుకుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ). అర్పితా ముఖర్జీ ఇంట్లో దొరికిన 20 కోట్ల డబ్బు పార్థా చటర్జీదేనని ఆమె ఒప్పుకున్నారు. టీచర్ల నియామకాలకు సంబంధించిన లావాదేవీల కోసం వారు 12 నకిలీ సంస్థలను నడుపుతున్నట్లు తెలిపారు ఈడీ అధికారులు. అర్పిత, పార్థా ఉమ్మడిగా ఒక ఆస్తిని కొనుగోలుచేయగా, సంబంధిత డాక్యుమెంట్ ను ఈడీ స్వాధీనంచేసుకుంది.
బెంగాల్ రాష్ట్రంలో గ్రూప్ సీ, గ్రూప్ డీ ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన అడ్మిట్  కార్డులు, ఫైనల్ రిజల్ట్స్, అపాయిమెంట్  లెటర్లు అర్పిత ఫ్లాట్ లో దొరికాయి. వెస్ట్ మేదినీపూర్ ఓ స్కూల్  పేరిట మంత్రి భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపిస్తోంది ఈడీ. ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రిగా ఉన్న పార్థా ఛటర్జీ గురించి ఆధారాలు సేకరించిన తర్వాతనే పకడ్బందీగా దాడులు నిర్వహించి భారీ స్థాయిలో దాచి ఉంచిన అవినీతి సొమ్ము 20 కోట్ల నగదును సీజ్ చేశామని గుర్తు చేస్తున్నారు.

పార్ధాఛటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద ఓఎస్డీగా పనిచేసిన పి.కె.బందోపాధ్యాయ్, వ్యక్తిగత కార్యదర్శి సుకాంతా ఆచార్జీ తదితరుల ఇళ్లలో సోదాలు చేసి సన్నిహితురాలైన అర్పిత ఇంట్లో 20 కోట్ల నగదును దాచి ఉంచినట్లు తేలిందన్నారు. 
పక్కా సాక్షాధారాలతో అరెస్టు చేస్తే.. అనారోగ్యమంటూ ఆస్పత్రిలో చేరారని.. ప్రస్తుతం మంత్రి పరిస్థితి బాగానే ఉందని... వైద్యుల సిఫారసు, సలహాల కోసం రెఫర్ చేశామన్నారు. 
తాజాగా పార్థా ఛటర్జీకి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం హాస్పిటల్ చికిత్స అనవసరమని భువనేశ్వర్  ఎయిమ్స్  ప్రకటించింది. దీంతో ఇద్దరు నిందితులను ఆగస్టు 3 వరకు ఈడీ కస్టడీలోకి తీసుకుంటూ ఆదేశాలిచ్చింది ఈడీ కోర్టు. అయితే ప్రతి 48 గంటలకొకసారి పార్థా, అర్పితలకు మెడికల్ టెస్టులు చేయాలని సూచించింది కలకత్తా హైకోర్టు.