కొమురవెల్లి మల్లన్న లగ్గానికి ఏర్పాట్లు

కొమురవెల్లి మల్లన్న లగ్గానికి ఏర్పాట్లు

సిద్దిపేట/కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లన్న లగ్గానికి మరో 13 రోజులు మాత్రమే ఉంది. కానీ ఏర్పాట్లు మాత్రం ఆశించినంతగా జరగడం లేదు. ఈనెల 18న మల్లికార్జునస్వామి కల్యాణోత్సంతో ప్రారంభమయ్యే జాతర మూడు నెలలపాటు కొనసాగనుంది. దాదాపు పదిలక్షల మంది హాజరయ్యే  అతిపెద్ద జాతరకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి.  ఆలయం వద్ద మొక్కుబడిగా ఏర్పాటు చేసిన కుళాయి తప్ప పరిసరాల్లో తాగునీటి వసతి లేదు. స్వామివారి దర్శనం కోసం గంటల కొద్దీ భక్తులు నిరీక్షించే పరిస్థితి ఉన్నా పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కొత్త క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించినా ఇంత వరకు పనులను ప్రారంభించలేదు. రూ.42 లక్షలతో చేపట్టిన సులభ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతూనే వున్నాయి. ప్రసాద విక్రయాలను ఒకే చోట నుంచి నిర్వహించాలని రూ.50 లక్షలతో నిర్మిస్తున్న భవనం పనులు ఇంకా కంప్లీట్​కాలేదు. 

అధ్వానంగా రోడ్డు 

రాజీవ్ రహదారిలోని కొండపాక గేటు నుంచి కొమురవెల్లి ఆలయం వరకు ఐదు కిలోమీటర్లు వెళ్లే రోడ్డు గుంతలతో అధ్వానంగా మారింది. డబుల్ రోడ్డు నిర్మాణం కోసం రూ.20 కోట్ల నిధులు మంజూరైనా ఇంకా టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఎలాగో డబుల్ రోడ్డు నిర్మించాల్సి ఉండటంతో అధికారులు ఇప్పుడు తాత్కాలిక రిపేర్లు కూడా చేయడం లేదు. తిమ్మారెడ్డిపల్లి నుంచి కొమురవెల్లికి వెళ్లే దారిని రైల్వే అండర్ పాస్ కోసం మూసివేయడంతో హైదరాబాద్ వైపు నుంచి వచ్చే భక్తులు కొండపాక గేటు నుంచే రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడికొచ్చే భక్తుల్లో దాదాపు సగానికి పైగా హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచే వస్తారు. మరి రోడ్డు పరిస్థితి ఈ విధంగా ఉంటే ఎలా అని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

నత్తనడకన ముఖ మండప విస్తరణ పనులు

ఆలయంలోని ముఖ మండప విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రద్దీ ఎక్కువగా ఉండటంతో పట్నాల కోసం భక్తులు గంటల తరడబడి ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ క్రమంలో ముఖ మండపాన్ని రూ.2.25 కోట్లతో దాదాపు  నాలుగు వేల  చదరపు అడుగుల మేర విస్తరించాలని పనులు ప్రారంభించారు. ఏడాది కావస్తున్నా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే భక్తుల రద్దీకి అనుగుణంగా బండ గుట్టపై రెండేండ్లుగా కడుతున్న 50 గదుల కాటేజీ పనులు ఇంకా కంప్లీట్​ కాలేదు. దాచారం గుట్టపై గెస్ట్ హౌజ్ పనులపై ఏమాత్రం ప్రగతి లేదు. నిత్యాన్నదాన సత్రం ఎదురుగా రూ.50 లక్షల వ్యయంతో అద్దె గదుల నిర్మాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫలితంగా భక్తులు ప్రైవేటు గదులను ఆశ్రయించడం, అవి దొరకనివారు రోడ్ల పక్కనే గుడారాలు వేసుకొని ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. 

పనిచేయని సీసీ కెమెరాలు.. పార్కింగ్​ కష్టాలు 

భక్తుల భద్రత కోసం ఏర్పాటు చేసిన 35 సీసీ కెమెరాల్లో ఐదు పనిచేయడం లేదు. మిగతావాటిలోనూ చాలా వరకు నెట్ ప్రాబ్లమ్ తో పనిచేయడం లేదు. ఇదిలా ఉండగా గతంలోని పార్కింగ్ స్థలాన్ని కొత్తగా క్యూకాంప్లెక్స్ నిర్మాణానికి  ఇండ్లను ఇచ్చిన నిర్వాసితులకు కేటాయించారు. దీంతో ఆలయానికి మూడు కిలో మీటర్ల దూరంలో వాహనాలను నిలిపి నడిచివెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. 

ఇన్​టైంలో ఏర్పాట్లు పూర్తి చేస్తాం 

మల్లన్న జాతర పనులు ప్రారంభించే విషయంలో కొంత జాప్యం జరిగినా ఇన్​టైంలో ఏర్పాట్లు పూర్తి చేస్తాం. మూడునెలలపాటు కొనసాగే ఈ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా చూసుకుంటాం. ఇప్పటికే అన్ని శాఖలకు దిశానిర్దేశం చేశాం. 
బాలాజీ, ఆలయ ఈవో

ధర్మగుండం తెరిచేదెప్పుడో?

భక్తులు ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించడం ఆనవాయితీ. కానీ కరోనా నేపథ్యంలో రెండేండ్ల కింద గుండాన్ని మూసివేశారు. బండారి చల్లుకుంటూ పుణ్య స్నానం చేసే అవకాశం లేకపోవడంతో తోటభావితో పాటు సమీపంలోని వ్యవసాయ బోరుబావుల వద్ద భక్తులు స్నానాలు చేస్తున్నారు. కాగా ఈసారి గుండాన్ని తెరిచే దిశగా అధికారులు ఇంకా ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు.