యాక్సిడెంట్ చేశావంటూ గొడవ.. డబ్బు లాక్కుని జంప్

యాక్సిడెంట్ చేశావంటూ గొడవ.. డబ్బు లాక్కుని జంప్
  • వనస్థలిపురం పీఎస్ పరిధిలో అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు
  • నిందితుడిపై ఇప్పటి వరకు 13 కేసులు నమోదు

హైదరాబాద్: డబ్బులతో వెళ్తున్న వారిని టార్గెట్ చేసి... వెంటాడి.. అదను చూసి అడ్డగించి గొడవ పెట్టుకుని వారి దగ్గర డబ్బులు తీసుకుని ఉడాయిస్తున్న నిందితుడిని రాచకొండ పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల తరచూ ఇదే తరహా నేరాలు చేస్తుండడంతో నిఘా పెట్టిన పోలీసులు నిందితుడు పారిపోతుండగా.. సినీ ఫక్కీలో వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. 
రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ నిందితుడి అరెస్టును ధృవీకరించారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రాబరి చేసిన వ్యక్తి ని అరెస్ట్ చేశామని వెల్లడించారు. గత నెల 25 వ తేదీన ఒక డీసీఎం వాహన డ్రైవర్ ఎల్బీనగర్ పండ్ల మార్కెట్లో టమాట విక్రయించి వచ్చిన డబ్బులు తీసుకుని వెళ్తున్నాడు. డ్రైవర్ దగ్గర లక్ష రూపాయలు చూసి కన్నువేసిన నిందితుడు అజాం బేగ్ అలవాటు ప్రకారం వెంబడించాడు. అదను చూసి అడ్డగించి చింతకుంట పోలీసు స్టేషన్ పరిధిలో యాక్సిడెంట్ చేశావంటూ కేకలు వేస్తూ కొట్టేందుకు వచ్చినట్లు భయపెట్టాడు. ఇతని గురించి తెలియని డీసీఎం డ్రైవర్ తనను పొరపాటున అడ్డగించాడేమోనని అయోమయంలో వివరించే ప్రయత్నం చేస్తుండగా.. నిందితుడు అజాం బేగ్.. 1 లక్ష రూపాయల బ్యాగు తీసుకుని ఉడాయించాడు.
బాధితుడు వెంటనే పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయమని వేడుకున్నాడు. పోలీసులు ఫిర్యాదు తీసుకుని నిందితుని ఆనవాళ్లు తెలుసుకుని సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలించగా.. చాంద్రాయణగుట్టకు చెందిన మీర్జా అజాం బేగ్ గా గుర్తించారు. ఇతనిపై 2011 నుండి ఇప్పటి వరకు 13 కేసులు నమోదయ్యాయి. అరెస్టయి బెయిల్ పై వచ్చిన తర్వాత కూడా పాత పద్ధతిలోనే చోరీలు చేస్తున్నట్లు గుర్తించారు. తాజాగా చేసిన చోరీ సొత్తు లక్ష రూపాయల్లో 30 వేలు ఖర్చు చేయగా.. అతని వద్ద మిగిలిన రూ.70వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.