ఇక్కడ దొంగ..అక్కడ స్టార్ హోటల్ ఓనర్

ఇక్కడ దొంగ..అక్కడ స్టార్ హోటల్ ఓనర్

కష్టపడి పని చేసి.. పైసా పైసా కూడబెట్టి ఇళ్లు కట్టాలంటే ఈ రోజుల్లో ఎంత కష్టమో అందరికీ తెలుసు. అలాంటిది ఓ దొంగ చిన్న చిన్న చోరీలు చేస్తూ ఏకంగా మలేషియాలో స్టార్ హోటల్ కట్టాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. అతని భాగోతం తెలిసిన పోలీసులే అవాక్కయారు. తమిళనాడులో ఈ ఘటన  జరిగింది.

తమిళనాడులోని  చెన్నై నుంచి సేలం వెళుతున్న రైలులో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. దీంతో ఓ స్పెషల్ టీంను ఏర్పాటు చేశారు పోలీసులు. అందులో ఒక మహిళా పోలీసు దంపతుల మాదిరిగా, మిగిలిన టీం సభ్యులు సేలం వెళుతున్న రైలులో  ప్రయాణించారు. కొద్ది దూరం వెళ్లగానే ఓ ప్రయాణికుడి నుంచి గుర్తు తెలియని వ్యక్తి  బ్యాగ్ తీసుకొని పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు.

నిందితుడు కేరళకు చెందిన  సాహుల్ అమీద్ గా గుర్తించారు పోలీసులు. అతడు మలేషియాలో ఉంటున్నాడని.. అక్కడ నుంచి ఫ్లైట్ లో చెన్నై వచ్చి  దొంగతనాలు చేస్తున్నాడని చెప్పారు. ఇలా 2016 నుంచి దొంగతనాలు చేస్తూ ఆ వస్తువులను ముంబైలో అమ్మి.. వచ్చిన డబ్బుతో మలేషియాలో ఓ స్టార్ హోటల్ కట్టాడని తెలిపారు.అమీద్ కు ఇద్దరు భార్యలని.. గతంలో మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో అతడిపై రేప్ కేసులు నమోదయినట్లు తెలిపారు. అమీద్ పై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు పోలీసులు.