వ్యవసాయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

వ్యవసాయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి వ్యవసాయ రంగం వృద్ధి చాలా కీలకం. యాంత్రీకరణ, సాంకేతిక పరిజ్ఞానం ఈ రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తెరపైకి వచ్చింది. వ్యవసాయ రంగంపై దాని ప్రభావం ఎలా ఉండబోతున్నదనే చర్చకు వస్తున్నది.  రైతులకు ఎలాంటి మేలు జరుగుతుంది? వ్యవసాయ రంగానికి అంతిమంగా లాభమా, నష్టమా? అనే విశ్లేషణలు నడుస్తున్నాయి. 

మన దేశ స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయం దాని అనుబంధ రంగాల వాటా ఇప్పటికీ పెద్దదే. కోట్లాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న రంగం ఇదే. అయితే రుతుపవనాలు ఆగమనం అటు ఇటుగా ఉండటం, మార్కెట్ పరిస్థితులు మెరుగుపడకపోవడం, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు లభించకపోవడం వంటి అనేక కారణాలతో వ్యవసాయం ఇప్పటికీ ఆశల జూదంగానే మిగిలిపోయింది. ప్రభుత్వాలు కొన్ని పథకాలు పెట్టి అమలు చేస్తున్నప్పటికీ.. వ్యవసాయం లాభసాటిగా ఉండటం లేదు. 

అత్యాధునిక టెక్నాలజీ..

వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు సాంకేతికత మార్గం చూపే ఆస్కారం ఉన్నది. కూలీల కొరత, పెట్టుబడిని తగ్గించేందుకు యాంత్రీకరణను మరింత ప్రోత్సహించడం, డ్రోన్ల వాడకం, మెషీన్ లెర్నింగ్ వంటి ఆధునిక టెక్నాలజీల వినియోగంతో సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది. గత ఏడాది విడుదలైన ‘చాట్ జీపీటీ’ఈ ప్రస్థానాన్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్లిందని చెప్పాలి. మైక్రోసాఫ్ట్ కు  చెందిన అజ్యూర్ ఓపెన్ ఏఐ సర్వీస్ ద్వారా చాట్ జీపీటీ ఆధారంగా తయారైన ‘జుగల్ బందీ’ చాట్ బోట్ వీటిలో ఒకటి. రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వేర్వేరు సంక్షేమ, సహాయ పథకాల వివరాలను అందిస్తుందీ సాఫ్ట్ వేర్. వాట్సాప్ ద్వారా కూడా అందుకోగల ఈ చాట్ బోట్ ఇంగ్లీషులో ఉన్న ప్రభుత్వ సమాచారాన్ని పది భాషల్లోకి అనువదించి మరీ రైతులకు అందిస్తుండటం విశేషం. చాట్ జీపీటీ వంటి కృత్రిమ మేధా సాఫ్ట్ వేర్ లకు వ్యవసాయంతో ఏం పని? అని చాలామంది అనుకోవచ్చు. కానీ, దీని చేరికతో సాగు విధానం మెరుగవుతుందన్నది నిపుణుల అంచనా. సమాచారం ఎంత ఎక్కువగా ఉన్నా సెకన్లలో దాన్ని విశ్లేషించి రైతులకు ఉపయోగపడేలా  అందించగలగడం దీంతో సాధ్యం. నీళ్లు, ఎరువులు, కీటకనాశనుల వంటి వనరులను అవసరమైనంత మాత్రమే వాడేలా చేయడం, పంట దిగుబడులు పెంచడం కోసం తోడ్పడగలదు. అంచనా, విశ్లేషణ వందేళ్ల వాతావరణ సమాచారం, మట్టి స్వభావం, పంటకు ఆశించే చీడపీడలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని సాంకేతికత.. పంట ఎంత బాగా పండుతుందనే విషయంలో కచ్చితమైన అంచనా వేయగలదు. ఒకవేళ నష్టం జరిగే ప్రమాదం ఉంటే దాన్ని వీలైనంత తగ్గించుకునే వెసులుబాటు ఉంటుంది. పరిస్థితులు, అవసరాలకు తగ్గట్టుగా సూచించగలదు. వేర్వేరు మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరించి విశ్లేషించడం, సొంతంగా పంటల తాలూకు సిమ్యులేషన్లు తయారు చేసుకుని అత్యున్నత సాగు పద్ధతులు, పంటలను అంచనా వేయడం సాధ్యమవుతుంది. దీని ద్వారా పంట దిగుబడులు, వ్యవసాయరంగ ఉత్పాదకత గణనీయంగా పెరిగే అవకాశం ఏర్పడుతుంది. జనరేటివ్ ఏఐ ద్వారా వ్యవసాయంలో వ్యర్థాలను గణనీయంగా తగ్గించగల ప్రిసిషన్ వ్యవసాయం సాధ్యమవుతుంది. ఉదాహరణకు పంట పొలం మొత్తం తిరిగే డ్రోన్లు కలుపును గుర్తిస్తే అతితక్కువ కలుపునాశనులతో వాటిని తొలగించే ప్లాన్ ను ఏఐ అందివ్వగలదన్న మాట. అలాగే ఏ మొక్కలకు నీరు,  ఎండ అవసరం అనే  వివరాలను కూడా 
ప్రిసిషన్ అగ్రికల్చర్ ద్వారా గుర్తించవచ్చు. 

కొత్త వంగడాల సృష్టి

వాతావరణ మార్పుల నేపథ్యంలో కరువు కాటకాలు, వరదల వంటివి పెరిగాయి. ఈ ప్రతికూల పరిస్థితులను తట్టుకొని మనగలిగిన కొత్త వంగడాల అవసరం పెరిగింది. సంప్రదాయ పద్ధతుల్లో జరిగే పరిశోధనల ద్వారా ఈ వంగడాల సృష్టికి చాలా కాలం పడుతుంది. కానీ జనరేటివ్ ఏఐను ఉపయోగిస్తే అధిక దిగుబడులిచ్చే, వాతావరణ మార్పులను తట్టుకోగల వంగడాలను వేగంగా సృష్టించడం సాధ్యమని నిపుణులు చెబుతున్నారు. జన్యు సమాచారాన్ని విశ్లేషించి ఏ రకమైన జన్యువులను తొలగిస్తే, చేరిస్తే లాభదాయకమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా గుర్తించగలదు. ఇప్పటికే బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ సిద్ధం చేసిన ‘కిసాన్ జీపీటీ’ పది భారతీయ భాషల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు సంబంధిత కార్యక్రమాలు, పథకాల వివరాలను అందిస్తోంది. దీంతోపాటే దిగుబడులు, ఆదాయాన్ని పెంచుకునేందుకు అవసరమైన సలహా, సూచనలు ఇస్తోంది.

ప్రతినెలా కనీసం 40 వేల మంది రైతులు కిసాన్ ఏఐ సేవలను వినియోగించుకుంటున్నారు. మరో అంతర్జాతీయ సంస్థ గూయీ ఏఐతో జట్టుకట్టి వాతావరణ మార్పులపై రైతులకు తోడ్పాటునందిస్తుండగా, ఒడిశా వ్యవసాయ శాఖ ‘అమాకృష్ ఏఐ’ ద్వారా పంటల నిర్వహణలో రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తోంది. ప్రభుత్వ పథకాల వివరాలు, నలభైకిపైగా వాణిజ్య, సహకార బ్యాంకులు రైతులకు అందించే రుణ పథకాల వివరాలను ఈ చాట్ బోట్ ద్వారా అందిస్తోంది. మిర్చి, పసుపు పంటల్లో నాణ్యతను తేల్చేందుకు ఏఐ ఆధారిత పరికరాలను ఇప్పటికే వాడుతున్నారు. 

- ఎన్. సీతారామయ్య, సోషల్ ​ఎనలిస్ట్