
- జూనియర్ కాలేజీ బిల్డింగ్ నిర్మించాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నేతలు డిమాండ్
నార్కట్‌పల్లి, వెలుగు: నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీకి భూమి కేటాయించి బిల్డింగ్ నిర్మించాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లగొర్ల మోదీ రాందేవ్ యాదవ్ డిమాండ్ చేశారు. గురువారం విద్యార్థులతో కలిసి నార్కట్‌పల్లి తహసీల్దార్ ఆఫీసును ముట్టడించి తాళం వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్షిప్స్రూ.7,500 కోట్ల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్చేశారు.
నార్కట్‌పల్లిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయాలని, ప్రతి విద్యార్థికి రూ.20 వేల స్కాలర్షిప్ అందించాలని కోరారు. కాలేజీ ఫీజులను కూడా ప్రభుత్వమే భరించాలని స్పష్టంచేశారు. పోటీ పరీక్షల కోసం జిల్లాకు మూడు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలిపారు. బీసీ యువజన సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఎడ్ల మహలింగం, కావట్టి సత్యనారాయణ, మల్లేశ్, శిరీష, రమాదేవి, వైష్ణవి, సుకుమార్, వారాహి, మనీషా, మానస తదితరులు పాల్గొన్నారు.