పాలమూరు బరిలో కాంగ్రెస్​ను ఢీకొట్టేదెవరు?

పాలమూరు బరిలో కాంగ్రెస్​ను ఢీకొట్టేదెవరు?
  •     కాంగ్రెస్​ అభ్యర్థిగా వంశీచంద్​రెడ్డి?
  •     ఈసారి ఎలాగైనా గెలిచి తీరుతామంటున్న బీజేపీ
  •     టికెట్ ​రేసులో అరుణ, జితేందర్​రెడ్డి, శాంతికుమార్
  •     ఓటమి నుంచి ఇంకా తేరుకోని బీఆర్ఎస్​

మహబూబ్​నగర్, వెలుగు : గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి మహబూబ్​నగర్​పార్లమెంట్​స్థానంలో కాంగ్రెస్ కు స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తున్నది. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లనూ  క్లీన్​స్వీప్​ చేసిన ఆ పార్టీ, ఈసారి మహబూబ్​నగర్​తనదే అనే ధీమాలో ఉన్నది. కాంగ్రెస్​అభ్యర్థిగా వంశీచంద్​రెడ్డి పేరును సీఎం రేవంత్​దాదాపు ఖరారు చేయడంతో ఆయన ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపని బీజేపీ, పార్లమెంట్​ఎన్నికల్లో మాత్రం ప్రతిసారీ గట్టి పోటీ ఇస్తోంది. జాతీయ అంశాలు, మోడీ ఇమేజ్​ఇందుకు కారణమని భావిస్తున్నారు. 1999 ఎన్నికల్లోనే ఈ స్థానాన్ని తన ఖాతాలో వేసుకున్న బీజేపీ, 2019 ఎన్నికల్లో 3లక్షలకు పైచిలుకు ఓట్లతో రెండోస్థానంలో నిలిచింది. ఈసారి మోడీ ఇమేజ్​కు తోడు అయోధ్యలో రామాలయ నిర్మాణం తమకు కలిసివస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవని బీఆర్ఎస్​ఓటమి నుంచి ఇంకా తేరుకోలేదు. ఆ పార్టీ సిటింగ్​ ఎంపీ మన్నె శ్రీనివాస్​రెడ్డి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండడంతో క్యాడర్​అయోమయంలో పడింది. 

ఏడు సార్లు కాంగ్రెస్​ కైవసం

ఇప్పటివరకు మహబూబ్​నగర్​పార్లమెంట్​స్థానానికి 17 సార్లు ఎన్నికలు జరగ్గా, అందులో ఏడు సార్లు కాంగ్రెస్​గెలుపొందింది. నాలుగు సార్లు మల్లికార్జున్​గౌడ్​విజయం సాధించారు. చివరి సారిగా 2004లో కాంగ్రెస్​ జెండా ఎగురవేసింది. మళ్లీ 20 ఏండ్ల తర్వాత తిరిగి పాలమూరు పార్లమెంట్​ను కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ స్థానానికి సీఎం రేవంత్​రెడ్డి ఇన్​చార్జిగా ఉండడంతో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత బుధవారం కోస్గిలో జరిగిన బహిరంగ సభలో అభ్యర్థిగా సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్​రెడ్డిని ప్రకటించారు. కాంగ్రెస్​ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వంశీచంద రెడ్డి రోజూ పార్లమెంట్​పరిధిలో ఎమ్మెల్యేలతో కలిసి పర్యటిస్తున్నారు.

ఇటీవల పార్టీ నియోజకవర్గాల వారీగా నిర్వహించిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలకు కూడా ఎమ్మెల్యేలతో కలిసి హాజరయ్యారు. గత నెల 31వ తేదీన మక్తల్​నియోజకవర్గం నుంచి ‘పాలమూరు న్యాయ్​ యాత్ర’ ప్రారంభించారు. మక్తల్​తో పాటు నారాయణపేట, జడ్చర్ల, షాద్​నగర్, దేవరకద్ర​ నియోజకవర్గాల్లో యాత్ర పూర్తి చేశారు. త్వరలో మహబూబ్​నగర్​అసెంబ్లీలో యాత్రను నిర్వహించి ముగింపు కార్యక్రమానికి సీఎం రేవంత్​ను రప్పించేలా ప్లాన్​ చేస్తున్నారు. 

బీజేపీలో టికెట్​ కోసం పోటీ

పార్లమెంట్​ ​ఎలక్షన్స్​లో బీజేపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి. 1999లో జరిగిన పార్లమెంట్​ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేసిన ఏపీ జితేందర్​రెడ్డి గెలుపొందారు. తర్వాత ఎప్పుడూ కాషాయ పార్టీ విజయం సాధించలేదు. 2019 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన డీకే అరుణ 3,33,573 లక్షల ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ పార్టీకి మక్తల్​నియోజకవర్గం మినహా ఎక్కడా డిపాజిట్లు రాలేదు. కానీ, గత అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్​శాతంతో పోలిస్తే ఈసారి మహబూబ్​నగర్​, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్​నియోజకవర్గాల్లో ఓట్ల శాతం పెరిగింది. ఒక్క మక్తల్​నియోజకవర్గంలోనే 24.6% ఓట్లు పోలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఆ పార్టీ హైకమాండ్​ మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల అధ్యక్షులను తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వడంతో కేడర్​లో నూతనోత్సాహం కనిపిస్తోంది. దీనికితోడు పార్లమెంట్​ఎన్నికలు కూడా  కావడంతో మోదీ ఛరిష్మా పనిచేసే అవకాశం ఉంది. అలాగే రామ మందిర నిర్మాణం కూడా పార్టీకి కలిసొచ్చే అంశమే.

అయితే, పార్టీలో లీడర్ల మధ్య టికెట్ వార్​నడుస్తోంది. ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడ ఏపీ జితేందర్​రెడ్డి, స్టేట్​ట్రెజరర్​శాంతికుమార్​టికెట్​కోసం పోటీ పడుతున్నారు. శాంతికుమార్​బీసీ కోటా కింద తనకే టికెట్​వస్తుందనే నమ్మకంతో నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టికెట్​ కోసం చివరి వరకు ఫైట్​చేస్తానని ఇటీవల జరిగిన ఓ సమావేశంలో జితేందర్​రెడ్డి ప్రకటన చేశారు. డీకే అరుణ కూడా టికెట్​తనకే అని కాన్ఫిడెంట్​గా ఉన్నారు. ఈ ముగ్గురి తీరుతో కేడర్​చీలిపోవడంతో పాటు అయోమయంలో పడింది. నాలుగు రోజుల కింద మక్తల్​నియోజకవర్గం నుంచి ఆ పార్టీ ‘విజయ్​సంకల్ప్​యాత్ర’ ప్రారంభించింది. ఈ యాత్రలో కొందరు లీడర్లు అయిష్టంగానే పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. రెండు రోజుల కింద జరిగిన ప్రోగ్రామ్​లో ఓ లీడర్​వర్గానికి చెందిన కేడర్​ పాల్గొనలేదు. అయితే టికెట్​కోసం పోటీ పడుతున్న ముగ్గురిలో ఒకరికి టికెట్ ఇవ్వని పక్షంలో ఓ రాష్ర్ట్ం నుంచి గవర్నర్​పదవిని కట్టబెట్టాలని హైకమాండ్​ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.

స్తబ్దుగా బీఆర్ఎస్​

2009, 2014, 2019లో జరిగిన పార్లమెంట్​ఎన్నికల్లో బీఆర్ఎస్​ హ్యాట్రిక్​ విజయాలు నమోదు చేసింది. ఈ పార్లమెంట్​ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అన్ని చోట్లా పార్టీ సిట్టింగ్​ ఎమ్మెల్యేలు రెండో స్థానానికే పరిమితమయ్యారు. ఆ పార్టీ లీడర్ల అహంకార ధోరణి, నిర్లక్ష్యం, ల్యాండ్, ఇసుక, మైన్స్, వైన్స్​, భూ దందాలు, కబ్జాల వల్లే ఓడినట్లు చర్చ జరిగింది. ఇటీవల జరిగిన నియోజకవర్గాల సమీక్షల్లోనూ ఆ పార్టీ కార్యకర్తలు లీడర్లను బహిరంగంగానే విమర్శించారు. బీఆర్​ఎస్​ సిట్టింగ్​ ఎంపీ మన్నే శ్రీనివాస్​రెడ్డి ఆ పార్టీ నేతల తీరుపై అసంతృప్తితో ఉన్నారు. గత ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనకు ప్రియారిటీ ఇవ్వకుండా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించేవారనే విమర్శలున్నాయి. హైకమాండ్ ​కూడా పట్టించుకోకపోవడంతో ఈసారి పోటీకి దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

దీనికి తోడు ఆయన అన్న కొడుకు, మాజీ టీటీడీ బోర్డ్​మెంబర్ ​మన్నే జీవన్​రెడ్డి సీఎం రేవంత్​రెడ్డితో కలిసి ఇటీవల కాంగ్రెస్ ​జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్​ ఖర్గే తతసమక్షంలో పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో లోక్​సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ​నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపైనే క్లారిటీ లేదు. మాజీ మంత్రులు నిరంజన్​రెడ్డి, శ్రీనివాస్​గౌడ్​, మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్​ రెడ్డి, మర్రి జనార్దన్​రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఓడిపోయిన తర్వాత వీరెవరూ యాక్టివ్​గా లేరు. హైకమాండ్ ​వీరిలో ఒకరికి టికెట్ ​ఇస్తుందా లేక కొత్త వ్యక్తిని సెలెక్ట్​ చేస్తుందా అన్న విషయం తేలాల్సి ఉంది.