ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా.. మధ్యప్రదేశ్‌‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆప్ చీఫ్

ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా.. మధ్యప్రదేశ్‌‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆప్ చీఫ్
  • నోటీసులను వెనక్కి తీసుకోవాలంటూ ఈడీకి లేఖ
  • విచారణకు పిలవడానికి కారణాలను చెప్పలేదని విమర్శ
  • బీజేపీ ఆదేశాలతోనే వాటిని పంపారని కేజ్రీవాల్​ ఆరోపణ

లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ గైర్హాజరయ్యారు. తనకు ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలంటూ రివర్స్‌‌లో ఈడీకి లేఖ రాశారు.

న్యూఢిల్లీ/సింగ్రౌలి:  లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ గైర్హాజరయ్యారు. తనకు ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలంటూ రివర్స్‌‌లో ఈడీకి లేఖ రాశారు. తనకు వచ్చిన నోటీసులు రాజకీయ ప్రేరేపితమని ఆరోపించారు. తర్వాత మధ్యప్రదేశ్‌‌కు వెళ్లిన ఆయన.. అక్కడ రోడ్‌‌ షో నిర్వహించారు. ఎన్నికల ఫలితాల లోపు తనను అరెస్టు చేసే అవకాశం ఉందని, జైళ్లకు తాను భయపడబోనని స్పష్టం చేశారు. కేజ్రీవాల్ గైర్హాజరు నేపథ్యంలో ఆయనకు మరోమారు నోటీసులు ఇవ్వాలని ఈడీ భావిస్తున్నట్లు సమాచారం.

నోటీసుల్లో స్పష్టత లేదు..

లిక్కర్ స్కామ్‌‌ కేసులో విచారణకు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ కింద స్టేట్‌‌మెంట్ రికార్డు చేసేందుకు ఢిల్లీలోని తమ ఆఫీసులో గురువారం ఉదయం 11 గంటలకు హాజరవ్వాలంటూ ఈడీ నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈడీకి తిరిగి రెండు పేజీల లెటర్ రాసిన కేజ్రీవాల్.. నోటీసులను వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈడీ నోటీసులు అక్రమమని, రాజకీయ ప్రేరేపితమని, బీజేపీ ఆదేశాలతోనే పంపారని పేర్కొన్నారు. ‘‘ఓ వ్యక్తిగా నాకు నోటీసులిచ్చారా? లేక ఢిల్లీ సీఎంగానా? లేక ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్‌‌‌‌గానా? లేక సాక్షిగా పిలుస్తున్నారా? లేదా అనుమానితుడిగానా? దీనిపై నోటీసుల్లో స్పష్టత లేదు. విచారణకు పిలవడానికి గల కారణాలను వెల్లడించలేదు” అని చెప్పారు. ‘‘నేను ఢిల్లీ సీఎంను, ఆప్ నేషనల్ కన్వీనర్‌‌‌‌ను. మా పార్టీ స్టార్ క్యాంపెయినర్‌‌‌‌గా మిజోరం, మధ్యప్రదేశ్, చత్తీస్‌‌గఢ్, రాజస్థాన్, తెలంగాణల్లో పర్యటించాల్సి ఉంది. కొన్ని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. అందుకే ఈడీ ఈ నోటీసులను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నా’’ అని పేర్కొన్నారు. కాగా, లిక్కర్ స్కామ్‌‌ కేసులోనే గత ఏప్రిల్‌‌లో నోటీసులు ఇచ్చిన సీబీఐ.. దాదాపు 9 గంటలపాటు కేజ్రీవాల్‌‌ను ప్రశ్నించింది.

నా ఆలోచనలను ఎట్ల అరెస్టు చేస్తరు?

మధ్యప్రదేశ్ ఆప్ అధ్యక్షురాలు, సింగ్రౌలీ అభ్యర్థి తరఫున నిర్వహించిన రోడ్‌‌ షోలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌‌తో కలిసి కేజ్రీవాల్ పాల్గొన్నారు. తర్వాత నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే నాటికి తనను అరెస్టు చేయొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఆమ్‌‌ ఆద్మీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ‘‘కేజ్రీవాల్‌‌ను అరెస్టు చేస్తారని ప్రతిరోజు బెదిరిస్తున్నారు. అరెస్టు చేసినా పర్లేదు.. జైలుకు వెళ్లేందుకు కేజ్రీవాల్‌‌కు భయం లేదు. శరీరాన్ని మీరు అరెస్టు చేయగలరు.. కానీ కేజ్రీవాల్‌‌ ఆలోచనలను ఎలా అరెస్టు చేస్తారు? ఒక కేజ్రీవాల్‌‌ను అరెస్టు చేయగలరు.. వేలు, లక్షలు, కోట్లాది మంది కేజ్రీవాల్స్‌‌ను ఎలా అరెస్టు చేయగలరు?” అని ప్రశ్నించారు. ‘‘నాకు నోటీసులు ఇస్తారని, అరెస్టు చేస్తారని అక్టోబర్ 30న బీజేపీ నేతలు ప్రకటనలు చేశారు. అదే రోజు సాయంత్రం నాకు నోటీసులు వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే నోటీసుల గురించి ముందుగానే బీజేపీ నేతలకు లీక్ చేశారు. మా ఇమేజ్‌‌ను, ప్రతిష్టను దెబ్బతీసేందుకు, బీజేపీ ఆదేశాల ప్రకారమే ఈ నోటీసులు ఇచ్చారు’’ అని మండిపడ్డారు.‘‘నాడు మేం ఎన్నికల్లో పోటీకి నిలబడ్డప్పుడు.. ఆప్ అభ్యర్థులు సెక్యూరిటీ డిపాజిట్లు కూడా కోల్పోతారని అందరూ అన్నారు. కానీ 70 సీట్లు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో 67 సీట్లను గెలుచుకున్నాం. తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ గెలిచాం. మేం అవినీతి చేయలే.. ఎవ్వరినీ చేయనీయలే. ఆ నిధులతోనే రోడ్లు, స్కూళ్లు, హాస్పిటళ్లు నిర్మించాం’’ అని అన్నారు. కాగా, ప్రభుత్వ టీచర్ల రిక్రూట్‌‌మెంట్‌‌కు సంబంధించిన ఎగ్జామ్ పేపర్ల లీకేజీ కేసులో.. రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ డొతాస్ర కొడుకులు అభిలాష్, అవినాశ్‌‌లకు ఈడీ నోటీసులు జారీ చేసింది.

మళ్లీ నోటీసులు?

కేజ్రీవాల్‌‌ రాసిన లేఖకు రిప్లై ఇచ్చే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఫలానా డేట్‌‌కు విచారణకు రావాలంటూ మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పాయి.

ఆప్ మంత్రి నివాసాల్లో..

ఢిల్లీ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్‌‌కు చెందిన నివాసాల్లో ఈడీ అధికారులు రెయిడ్స్‌‌ చేశారు. ఆయనకు చెందిన మొత్తం 9 ప్రాంతాల్లో సోదాలు జరిపారు. ఇంటర్నేషనల్ హవాలా లావాదేవీలు జరిపారని, దిగుమతులకు సంబంధించి తప్పుడు డిక్లరేషన్‌‌ ఇచ్చారని, రూ.7 కోట్లకు పైగా కస్టమ్స్‌‌ డ్యూటీని ఎగ్గొట్టారని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఫైల్ చేసిన చార్జ్‌‌షీట్ ఆధారంగా ఈ దాడులు సాగాయి.