కేజ్రీవాల్పై కుట్ర.. నోటీసులకు భయపడం : సంజయ్ సింగ్

కేజ్రీవాల్పై కుట్ర..  నోటీసులకు భయపడం : సంజయ్ సింగ్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ  సమన్లు పంపడం పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు.  సీబీఐ సమన్లుతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పోరాటం ఆగదని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు.  గౌతమ్ అదానీతో ఉన్న సంబంధాలపై ప్రధాని మోడీని ప్రశ్నించినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రిని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని  సంజయ్ సింగ్ అన్నారు. ఇలాంటి వ్యూహాలకు కేజ్రీవాల్ భయపడబోరని, అవినీతి, నల్లధనం అంశాన్ని లేవనెత్తుతూనే ఉంటారని ఆయన అన్నారు. 

 కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏజెన్సీలు పనిచేస్తున్నాయని  సంజయ్ సింగ్  ఆరోపించారు. మీరు, మీ ప్రభుత్వం తల నుండి కాలి వరకు అవినీతిలో మునిగిపోయాయని ఫైరయ్యారు.  ఏప్రిల్ 16న అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసి, జైలుకు పంపి, అతనిపై చర్యలు తీసుకోవాలని మీరు పన్నిన కుట్ర అని సంజయ్ సింగ్ ఆరోపించారు.  కేజ్రీవాల్ గొంతును అణచివేయలేరని చెప్పారు.   ఏప్రిల్ 16న సీబీఐ  విచారణకు కేజ్రీవాల్ వెళ్తారని  సంజయ్ సింగ్ తెలిపారు.  

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఏప్రిల్ 16న విచారణకు హాజరుకావాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ  సమన్లు పంపింది. ఆదివారం ఉదయం 11 గంటలకు  కేజ్రీవాల్ ను సీబీఐ విచారించనుంది. ఇప్పటికే ఈ కేసులో పలుమార్లు ప్రశ్నించి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ  ఫిబ్రవరి 26న అరెస్టు చేసింది. ఇక   బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవను  ఈడీ పలుమార్లు  విచారించింది. తాజాగా కేజ్రీవాల్ కు నోటీసులు ఇవ్వడంతో ఉత్కంఠ నెలకొంది.