32 అడుగుల ఎత్తైన పుష్పక విమానాలు, 28 లక్షల దీపాలు.. దీపావళికి అయోధ్య ముస్తాబు

32 అడుగుల ఎత్తైన పుష్పక విమానాలు, 28 లక్షల దీపాలు.. దీపావళికి అయోధ్య ముస్తాబు
  • సరయూ నది ఒడ్డున ఏర్పాట్లు 
  • అలంకరణలో 33 వేల మంది వాలంటీర్లు

లక్నో: దీపావళి పర్వదినానికి అయోధ్య టెంపుల్  సిటీ ముస్తాబవుతోంది. సరయూ నది ఒడ్డున 56 ఘాట్లలో 28 లక్షల దివ్వెలు, 32 అడుగుల ఎత్తైన పుష్పక విమానాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి స్థానికులతో పాటు టూరిస్టులు కూడా భారీగా తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్టూడెంట్లు, టీచర్లు, స్థానికులు సహా మొత్తం 33 వేల మంది వాలంటీర్లు.. సరయూ నది ఒడ్డున ఘాట్లను అలంకరిస్తున్నారు.  రామ్ కీ పైడి వద్ద ఏర్పాటు చేయనున్న 32 అడుగుల ఎత్తైన పుష్పకవిమానాలు ఈసారి స్పెషల్  అట్రాక్షన్ గా నిలవనున్నాయి. అంతేకాకుండా ఈ పుష్పకవిమానాలపపై రామాయణానికి సంబంధించిన సీన్లను స్క్రీనింగ్  చేస్తారు. ఈ నేపథ్యంలో భద్రతను ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేశారు.

వాలంటీర్లకు ఐడీ కార్డులు, స్పెషల్  టీషర్టులు అందజేశారు. గుర్తింపు కార్డు ఉన్నవారికే ఘాట్ల వద్ద అనుమతిస్తున్నారు. అలాగే ఫుడ్  సేఫ్టీ బృందాలు కూడా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నాయి. ఏర్పాట్లపై దివాకరాచార్య జీ మహరాజ్  స్వామీజీ స్పందించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ దీపావళి మనకు ప్రత్యేక పండుగ అని, ప్రజలందరూ స్వదేశీ ఉత్పత్తులను వాడాలని సూచించారు. ‘‘దీపావళికి స్థానిక కుమ్మర్ల నుంచే మట్టిదివ్వెలు కొనుగోలు చేశాం. వాటితోనే దీపాలు వెలిగిస్తున్నాం. అందరూ మట్టిదివ్వెలనే వెలిగిస్తే బాగుంటుంది. దీంతో స్థానిక కుమ్మర్లకు పని దొరికి ఆదాయం వస్తుంది. అప్పుడే నిజమైన దీపావళి జరుపుకున్నట్లు” అని దివాకరాచార్య స్వామీజీ పేర్కొన్నారు.