సొంత పైసలతోనైనా పనులు చేస్తం .. ప్రజలకు ఎమ్మెల్యేలు హామీలు

సొంత పైసలతోనైనా పనులు చేస్తం .. ప్రజలకు  ఎమ్మెల్యేలు హామీలు
  • ఎలక్షన్ల ముంగట జనం ముందుకొస్తున్న ఎమ్మెల్యేలు
  • సొంత పైసలతోనైనా పనులు చేస్తమని హామీలు
  • వర్గాలు, కులాలవారీగా మీటింగ్​లు
  • రోడ్లు, డ్రైనేజీలు, వాటర్​ ప్లాంట్లు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి శ్రీకారాలు
  • వెంటవెంటనే ప్రభుత్వం నుంచి 
  • నిధులు తెప్పించుకునే ప్రయత్నాలు
  • అనుకూల, ప్రతికూల ఓట్ల లెక్కలు వేసుకొని పనులు, ప్రత్యేక విందులు
  • ఇదే మోకాగా భావిస్తున్న జనం.. పెండింగ్​ పనుల చిట్టాను ముందటపెడ్తున్నరు

హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడ్తుండటంతో జనానికి చేరువయ్యేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. లీడర్లను, అనుచరులను వెంటేసుకొని ఊర్లలో తిరుగుతున్నారు. కులాలు, వర్గాల వారీగా మీటింగ్​లు పెడ్తున్నారు. గుంపులు గుంపులుగా జనాన్ని క్యాంపు ఆఫీసులకు పిలిపించుకొని మాట్లాడుతున్నారు. ఊర్లలో ఏ సమస్య ఉన్నా చెప్పాలని, చేసిపెడ్తామని హామీలు ఇస్తున్నారు. తాము వీక్​గా ఉన్న గ్రామాల్లో సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టేందుకు కొందరు ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. రోడ్లు, డ్రైనేజీలు, నాలా పనులు, కమ్యూనిటీ హాల్స్​, గుడులు, మసీదులు, చర్చిల నిర్మాణాలతోపాటు ప్రముఖుల విగ్రహాల ఏర్పాటు, బోర్లు వేయించడం, వాటర్​ ప్లాంట్లు పెట్టించడం, డ్రైవింగ్​ లైసెన్స్​లు ఇప్పించడం వంటివన్నీ చేస్తామని.. ప్రపోజల్స్​ ఇవ్వాలని అడుగుతున్నారు. సర్కార్​లో గట్టి పట్టున్నోళ్లయితే వెంటది వెంటనే ఫండ్స్​ ఉత్తర్వులు ఇప్పించుకుంటున్నారు. కొందరు ఎమ్మెల్యేలు నియోజకవర్గ ప్రజలను తీర్థయాత్రలకు తీస్కపోతున్నారు. ప్రత్యేక విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. సరిగ్గా ఎన్నికల ప్రచారం టైంలో ఊర్లలోకి వెళ్తే ఓటర్ల నుంచి ఇబ్బందులు తప్పవని భావించి ఇట్ల ముందస్తు కార్యక్రమాలతో ముందుకుపోతున్నారు. ఇన్నాళ్లూ తమ దిక్కు చూడని లీడర్లు ఇప్పుడు గడప ముందుకే వస్తుండటంతో జనం ఆశ్చర్యపోతున్నారు. ఎలక్షన్​ సీజన్​ కావడంతో పెండింగ్​ పనులు చేయించుకోవడానికి ఇదే మోకా అని భావిస్తున్నారు.

సాధారణంగా మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఏదైనా డెవలప్​మెంట్​ కార్యక్రమం చేపట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులకు అనుమతులు తెచ్చుకుని మొదలుపెడుతారు. అయితే ఇప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకు సొంత పైసలు ఖర్చు పెట్టేందుకూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు వెనుకాడటం లేదు. ఎంతో కొంత ఇచ్చి ముందైతే పనులు మొదలుకానివ్వాలని, ఎలక్షన్ల దాకా నడిపిస్తే చాలని అనుకుంటున్నారు. ఇలా తమ నియోజకవర్గంలో ఎక్కడ ఏది అవసరం ఉంటే దానికి ఎంత ఖర్చు అవుతుందో లెక్కలు అడిగి అడ్వాన్సులు ఇచ్చి పనులు స్టార్ట్​ చేయిస్తున్నారు. కొన్నిచోట్ల రోడ్లకు రిజర్వ్​ ఫండ్​ కింద ప్రభుత్వానికి ప్రపోజల్స్​ పంపి వెంటనే ఓకే చేయించుకుంటున్నారు. 

సొంత పైసలు ఖర్చు చేయాల్సి వస్తే మాత్రం.. ఆ గ్రామంలో ఓట్ల సంఖ్య, పార్టీ ప్రభావం వంటివన్నీ లెక్కలేసుకొని ముందుకు వెళ్తున్నారు. మేజర్ గ్రామ పంచాయతీ అయితే రూ. 40 లక్షల దాకా.. సాధారణమైతే రూ. 30 లక్షల దాకా కమిట్​మెంట్​ ఇస్తున్నారు. ఇందుకోసం కులాలు, వర్గాలవారీగా బేరీజు వేసుకుంటున్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో యావరేజ్​గా 5 నుంచి 6 మండలాలు ఉన్నాయి. గ్రామాల వారీగా చూసినా 70 నుంచి 80 గ్రామాలు ఆపైనే ఉన్నాయి.  అపొజిషన్  స్ట్రాంగ్​ అనుకున్న గ్రామాల్లో ఎక్కువ పనులు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు మంత్రులు, ఇంకొందరు ఎమ్మెల్యేలైతే తమ ప్రాంతాల్లోని వ్యాపార వేత్తల నుంచి సీఎస్​ఆర్​ ఫండ్స్​తెప్పిస్తూ తామే సొంత పైసలతో అభివృద్ధి చేయిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. పలానా ఊర్లో పలానా పని చేయాల్సిందేనంటూ పారిశ్రామికవేత్తలపై కొందరు ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తున్నది. 

మేడ్చల్​ జిల్లా శామీర్​ పేట మండలంలోని అలియాబాద్​లో మంత్రి మల్లారెడ్డి సొంత నిధులతో రోడ్లు నిర్మిస్తున్నారు. గ్రామంలో డ్రైనేజీల నిర్మాణాలు సొంత నిధులతోనే చేపిస్తున్నారు. నియోజకవర్గంలో ఎక్కడ రోడ్డు అవసరం ఉందని తెలిసినా.. ఆప్రాంతంలో మరుసటి రోజే రోడ్లు వేసే పని మొదలుపెట్టిస్తున్నారు.   పలు గ్రామాల్లో ఆలయాలను తన సొంత డబ్బులతో మల్లారెడ్డి నిర్మిస్తున్నారు.

మంత్రి గంగుల కమలాకర్​ తన నియోజకవర్గంలో రోడ్ల కోసం రూ.25 కోట్లు రిజర్వ్​ ఫండ్​ ఉందని.. ఎక్కడ అవసరముందని చెప్తే అక్కడ వేస్తామని ప్రకటించారు. ఇవి కాకుండా గుడుల నిర్మాణానికి, కమ్యూనిటీ హాల్స్​కు గంగుల తన సొంత పైసలను ఇస్తున్నారు. 

ఆర్మూర్​ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్​ రెడ్డి అయితే నిత్య దైవ దర్శనాలకు తెరతీశారు. నియోజకవర్గంలోని ఒక్కో గ్రామం నుంచి ప్రత్యేక బస్సుల్లో ‘నిత్య యాదాద్రి దైవ దర్శన యాత్ర’ పేరుతోమ నియోజకవర్గ ప్రజలను యాదగిరిగుట్టకు తరలించి లక్ష్మీనృసింహస్వామి దర్శనం చేయిస్తున్నారు. ఉదయం ఆర్మూర్​లోని శ్రీనవనాథ సిద్ధుల గుట్ట ఆలయంలో దర్శనం  అనంతరం యాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం యాదగిరిగుట్టకు చేరుకొని అక్కడ దర్శనం తర్వాత భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. తిరిగి సాయంత్రానికి ప్రజలను వారివారి గ్రామాలకు తీసుకెళ్తున్నారు.  కొన్ని గ్రామాల్లో డ్రైనేజీల పనులకు ఎమ్మెల్యే సొంత పైసలు ఖర్చు చేస్తున్నారు.

భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి సొంత పైసలతో బోర్లు వేయించి.. పలు గ్రామాల్లో వాటర్​ ప్లాంట్లను నిర్మిస్తున్నారు. కులాలవారీగా ఇప్పటికే ఐదారు కమ్యూనిటీ హాల్స్​ నిర్మాణానికి ఓకే చెప్పి పనులు ప్రారంభించేందుకు కొంత నిధులు ఇచ్చారు. 

అన్నుకున్న చోట నిధులిచ్చేస్తున్న సర్కారు పెద్దలు

ఒకవైపు కొందరు ఎమ్మెల్యేలు  సొంత పైసలు ఖర్చు చేస్తుంటే.. ఇంకోవైపు అనుకున్న చోట ప్రభుత్వం కూడా నిధులకు ఓకే చెప్తున్నది. స్పెషల్​ డెవలప్​మెంట్​ ఫండ్​ కింద సీఎం దగ్గర దాదాపు రూ.10,348 కోట్లు ఉండేలా ఈసారి బడ్జెట్​లో  కేటాయించారు. సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​, హరీశ్​రావు, ఎమ్మెల్సీ కవిత  ఎక్కడ పర్యటించినా నిధుల ప్రకటనలు చేస్తున్నారు. వీళ్లకు దగ్గరున్న ఎమ్మెల్యేలు కూడా వెళ్లి రిక్వెస్ట్​ పెట్టుకోగానే నిధుల విడుదల జీవోలు వస్తున్నాయి. ఈ నెల రోజుల వ్యవధిలో ప్రభుత్వం ఇలా మంత్రులు, ఎమ్మెల్యేలు పెట్టిన రిక్వెస్ట్​లకు దాదాపు రూ. 2 వేల కోట్ల దాకా బీఆర్వోలు ఇచ్చింది. సోమవారం కామారెడ్డి పర్యటనలో ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.45 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రక‌‌టించారు. ఇక రోడ్లకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నిధులు ఇస్తున్నారు. మున్సిపాలిటీల్లో నాలా పనులు, ఫ్లడ్​ లైట్లు, బ్యూటిఫికేషన్ వంటి వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఇప్పుడైతేనే పనులు చేస్తరనీ..!

గ్రామాల్లో జనాలు కూడా ఎలక్షన్ల టైంలోనే తమ డిమాండ్లకు, సమస్యలకు పరిష్కారం ఉంటుందని గుర్తించి పనులు చేయించుకుంటున్నారు. కొందరు వారి కులాలకు కమ్యూనిటీ హాల్​ నిర్మించాలని అడుగుతున్నారు. ఇంకొందరు వారి కుల ప్రముఖుల విగ్రహాల ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. 

డ్రైవింగ్​ లైసెన్సులు,బస్​పాస్​లూ ఇప్పిస్తున్నరు

ఓటర్లను ఆకట్టుకునేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, లీడర్లు కొత్త తరహా ప్రయత్నాలు చేస్తున్నారు. 18 ఏండ్లు నిండిన యువతకు డ్రైవింగ్​ లైసెన్సులు  ఇప్పించేందుకు ప్రత్యేక మేళాలు ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి మెదక్​, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఈ మేళా లు నడుస్తున్నాయి. డ్రైవింగ్​ లైసెన్స్​కు అవస రమైన ఫీజులు ఎమ్మెల్యేలే చెల్లిస్తున్నారు. కొందరైతే.. స్టూడెంట్స్​కు డబ్బులు చెల్లించి బస్​ పాస్​లు కూడా ఇప్పిస్తున్నారు. గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలోని ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్​ లీడర్లు స్టూడెంట్​ బస్​ పాస్​ లు పెద్ద ఎత్తున ఇప్పించారు.

32 మంది ఎమ్మెల్యేలు..  ఐదుగురు మంత్రులు యాక్టివ్​

రాష్ట్రంలో వివిధ పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్న కొందరు ఇప్పటికే ఊర్లలో పలు కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఐదుగురు మంత్రులు,  32 మంది ఎమ్మెల్యేలు అటు సొంత పైసలతో పాటు ఇటు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంలో నిమగ్నమయ్యారు. వీరందరూ మళ్లీ టికెట్​ కన్ఫర్మ్​ అయినోళ్లేనని తెలుస్తున్నది. సర్వేల ఆధారంగా ఏ ఏరియాల్లో తమకు వ్యతిరేకత ఉందో అక్కడ ఎలక్షన్​ షెడ్యూల్​ లోపు పనులు పూర్తి చేయాలని వారు భావిస్తున్నారు. ఇక, సొంత పార్టీ నుంచి సీటు కన్ఫర్మ్​  కాకపోతే ఇండిపెండెంట్​గానైనా, ఇతర పార్టీ నుంచి అయినా పోటీకి రెడీ అవుతున్న కొందరు ఎమ్మెల్యేలు కూడా సొంత నిధులు ఖర్చు చేసేందుకూ వెనుకాడటం లేదు.