డ్రైనేజీని చెరువులో కలపొద్దు : పసుమాముల గ్రామస్తులు

డ్రైనేజీని చెరువులో కలపొద్దు : పసుమాముల గ్రామస్తులు

డ్రైనేజీని చెరువులో కలపొద్దు
రంగారెడ్డి జిల్లా పసుమాముల గ్రామసభలో గ్రామస్తుల తీర్మానం

ఎల్​బీనగర్, వెలుగు: జీహెచ్ఎంసీ నుంచి వచ్చే డ్రైనేజీ గ్రామంలోని చెరువులో కలుస్తుండటంతో ఆ సమస్యను పరిష్కరించుకునేందుకు గ్రామస్తులంతా ఏకమయ్యారు. రంగారెడ్డి జిల్లా పసుమాముల గ్రామ నాయకులు, జనం సోమవారం పార్టీలకతీకంగా సభ ఏర్పాటు చేసుకొని తీర్మానించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ...  ఏడేండ్లుగా జీహెచ్ఎంసీ పరిధిలోని ఎల్​బీనగర్, హయత్ నగర్, వనస్థలిపురం, బీఎన్ రెడ్డి నగర్, హస్తినాపురంతో పాటు చంపాపేట ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున డ్రైనేజీ వచ్చి 110 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్థానిక చెరువులో కలుస్తోందన్నారు. దీంతో  డెంగీ, మలేరియా, వైరల్ ఫీవర్ల బారిన పడుతున్నామన్నారు.

ఇక్కడ పండే పంటలు, కూరగాయలను కూడా ఎవరూ కొనడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యంతో చేపలు బ్రతకడం లేదని, తాము ఉపాధి కోల్పోతున్నామని మత్స్యకారులు వాపోయారు. కాగా ఈ సమస్యలపై గ్రామ సభలో చర్చించామన్నారు. స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డితో పాటు ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు. ఈ పైప్​లైన్ ​మార్గాన్ని పెంచి.. డ్రైనేజీని మూసీ నదిలోకి విడుదల చేస్తామని గతంలో మంత్రి కేటీఆర్​ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదని గ్రామస్తులు పేర్కొన్నారు. అనంతరం చెరువు వద్దకు వెళ్లి సందర్శించారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ జైపాల్ రెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.