ప్రధాన పార్టీలన్నీ..  బీసీలపైనే ఫోకస్.. ప్రసన్నం చేసుకునేందుకు పార్టీల ప్లాన్లు

ప్రధాన పార్టీలన్నీ..  బీసీలపైనే ఫోకస్.. ప్రసన్నం చేసుకునేందుకు పార్టీల ప్లాన్లు

ప్రధాన పార్టీలన్నీ..  బీసీలపైనే ఫోకస్
రాష్ట్రంలో సగానికి పైగా ఓటర్లు బీసీలే
ప్రసన్నం చేసుకునేందుకు పార్టీల ప్లాన్లు
మచ్చిక చేసుకునేందుకు పక్కా ప్లాన్​తో వెళ్తున్న పార్టీలు
ఇప్పటికే బీసీ డిక్లరేషన్ ప్రకటించిన బీజేపీ
బీసీలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ సన్నాహాలు
రుణాల పేరిట తమవైపు లాక్కుంటున్న బీఆర్ఎస్
రూ.2వేల కోట్లు కేటాయిస్తూ కేబినెట్​లో తీర్మానం

హైదరాబాద్, వెలుగు : ఆరు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరుగనుండడంతో ఇక్కడి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అత్యధిక ఓటర్లున్న బీసీలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. సగానికి పైగా ఓటర్లు బీసీలే ఉన్నారు. దీంతో వారిని మచ్చిక చేసుకొని అధికారంలోకి వచ్చేందుకు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు బీసీ నినాదాన్ని ఎత్తుకున్నాయి. ఇటీవల కర్నాటకలో జరిగిన ఎన్నికల్లోనూ బలమైన సామాజికవర్గాల ఓట్లే అధికారంలోకి రావడానికి కీలకంగా మారాయి. ఈ ప్రభావం మన రాష్ట్ర రాజకీయాలపై పడింది. అందుకే ప్రధాన పార్టీల న్నీ బీసీ నినా దంతో జనంలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాయి. రాష్ట్రంలో సుమారు 2.99 కోట్ల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. వీరిలో 1.61 కోట్ల పైచిలుకు ఓటర్లు బీసీలే ఉన్నారు. అంటే 54శాతం వరకు ఉన్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలవాలన్న బీసీల ఓట్లే కీలకం కానున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే బీసీలను ఆకర్షించే ప్రోగ్రామ్స్ ప్రారంభించాయి.

బీసీలకు పెద్దపీట వేస్తామని బీజేపీ ప్రకటన

అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ.. ఏకంగా బీసీ డిక్లరేషన్ ను ప్రకటించింది. కొన్ని రోజుల కింద హైదరాబాద్ శివారులోని చంపాపేట్ లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ ప్రకటన చేసింది. అధికారంలోకి వస్తే ఏం అమలు చేస్తామో వెల్లడించింది. రాష్ట్రంలో బీసీ కమిషన్​కు రాజ్యాంగ హోదా కల్పిస్తామని, బీసీ జనాభా ఆధారంగా బడ్జెట్ లో కేటాయింపులు చేస్తామని ప్రకటించింది. విదేశాల్లో చదువుకునే స్టూడెంట్స్ అందరికీ పరిమితి లేకుండా ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపింది. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు పెద్దపీట వేస్తామని, ఎన్నికల్లో పోటీ పడలేని, గెలవలేని బీసీల్లోని చిన్న కులాలకు ప్రాధాన్యత ఇస్తామని డిక్లరేషన్ లో బీజేపీ పేర్కొంది.

బీసీలను కూడగట్టే పనిలో కాంగ్రెస్

కాంగ్రెస్ కూడా బీసీ రాగం ఎత్తుకున్నది. దాదాపు దశాబ్ద కాలం పాటు అధికారానికి దూరంగా ఉన్నామనే బాధలో ఉన్న ఇక్కడి నేతలు.. ఈసారి ఎలాగైనా పవర్​లోకి రావడమే లక్ష్యంగా బీసీ ఓట్లపై కన్నేశారు. వారి మద్దతు కూడగట్టేందుకు పక్కా ప్లాన్ ప్రకారం వెళ్తున్నది. వచ్చే నెల నల్లగొండలో బీసీల సదస్సు ఏర్పాటు చేస్తామని, పార్టీ సీనియర్ లీడర్ ప్రియాంక గాంధీ చేతుల మీదుగా బీసీ డిక్లరేషన్​ ప్రకటిస్తామని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. బీసీలను కూడగట్టే పనిలో కాంగ్రెస్ లీడర్లు బిజీగా ఉన్నారు. సదస్సు సక్సెస్ కోసం భారీ స్థాయిలో కసరత్తు చేస్తున్నది. బీసీ డిక్లరేషన్​తో రాష్ట్రంలోని బీసీలను తమవైపు మళ్లించేందుకు ఆ పార్టీ స్టేట్ లీడర్లు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. 

హ్యాట్రిక్ కొట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు

ఇక బీఆర్ఎస్ సర్కార్ కూడా ఈ రెండు పార్టీలకు కౌంటర్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నది. బీసీల కోసం భారీగా నిధులు కేటాయిస్తూ ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ మీటింగ్​లో తీర్మానం చేసింది. హ్యాట్రిక్​ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నది. బీసీల ఓట్లను గంపగుత్తగా తమ వైపు మళ్లించుకునేందుకు బీసీ పాలసీని ప్రభుత్వం ప్రకటించింది. బీసీ కులాలకు చెందిన 11 ఫెడరేషన్లతో పాటు ఎంబీసీలోని 30 కులాలకు చెందిన ఒక్కొక్కరికి సబ్సిడీపై లక్ష రూపాయల రుణం ఇవ్వాలని కేబినెట్ తీర్మానించింది. దీని కోసం రూ.2వేల కోట్లు కేటాయించినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటి దాకా ప్రభుత్వం తరఫున ఎలాంటి లబ్ధి పొందని బీసీలకు ఈ రుణాలు పొందే అవకాశం ఉంది. పైగా లక్ష రూపాయలు తిరిగి చెల్లించాల్సిన అవసరం కూడా లేదని ప్రభుత్వం ప్రకటించింది. బీసీల మద్దతు తిరిగి పొందేందుకు, తమ సర్కార్ బీసీల సంక్షేమాన్ని కోరుకుంటున్నదని చెప్పుకునేందుకు ఈ ప్రకటన చేసినట్లు స్పష్టమవుతున్నది. ఇలా మూడు ప్రధాన పార్టీలు బీసీల ఓట్ల కోసం జపం చేస్తున్నాయి.