కాంగ్రెస్​లో టికెట్ల పైరవీలు!..హైకమాండ్​కు సీనియర్ లీడర్ల సిఫార్సులు

కాంగ్రెస్​లో టికెట్ల పైరవీలు!..హైకమాండ్​కు సీనియర్ లీడర్ల సిఫార్సులు
  • కాంగ్రెస్​లో టికెట్ల పైరవీలు! 
  • హైకమాండ్​కు సీనియర్ లీడర్ల సిఫార్సులు 
  • 20 మందితో కూడిన లిస్టులు పంపిస్తున్న నేతలు 
  • ఉత్తమ్ దగ్గరికి క్యూ కడ్తున్న ఆశావహులు

హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరడంతో ఆశావహుల్లో టెన్షన్​ నెల కొంది. టికెట్ వస్తుందా? రాదా? అన్న ఆందోళన మొదలైంది. ఇప్పటికే చాలా మంది నేతలు గాంధీభవన్​లోనే బల ప్రదర్శన చేశారు. మరికొందరు పైరవీలూ మొదలుపెట్టేశారు. టికెట్​ ఇప్పించాలంటూ స్టేట్​ లీడర్లతో మొరపెట్టుకుంటున్నారు. అంతా పద్ధతి ప్రకారమే జరుగుతోందని, టికెట్ల నిర్ణయం హైకమాండ్​చేతుల్లోనే ఉందని వాళ్లకు సర్దిచెబుతున్నారు. ఇప్పటికే 30 సెగ్మెంట్లలో అభ్యర్థులను ఖరారు చేశారన్న చర్చ జరుగుతున్నది. 

పెద్ద లీడర్లు పోటీ చేసే స్థానాలకు అభ్యర్థులు ఫైనల్​ చేశారని చెబుతున్నారు. ఆ జాబితాను ఢిల్లీకి పంపించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, కొందరు సీనియర్ లీడర్లు హైకమాండ్ వద్ద సొంతంగా పైరవీలు చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తమ చేతుల్లో ఏమీ లేద ని చెప్తూనే.. హైకమాండ్​కు లిస్ట్​ పంపిస్తున్నారన్న చర్చ జరుగుతున్నది. తమకు కావాల్సిన వాళ్లు, దగ్గరగా ఉన్నోళ్లు, అనుచరులకు టికెట్లు ఇప్పించుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారని అంటున్నారు. ఒక్కో సీనియర్​ నేత.. కనీసం 20 మంది అభ్యర్థుల పేర్లను హైకమాండ్​కు సిఫార్సు చేస్తున్నట్టు తెలిసింది. 

పేర్లున్నయో లేవోనని నేతల్లో టెన్షన్.. 

పార్టీ పెద్దలు హైకమాండ్​కు సిఫార్సు చేసిన పేర్లలో తమవి ఉన్నాయో లేవోనని పలువురు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఎంతైనా ఖర్చు పెట్టుకు నేందుకు సిద్ధమని కొందరు సిఫార్సు లేఖలతో వెళ్తుం టే.. క్యాస్ట్ ఈక్వేషన్స్, పార్టీకి విధేయతతో మరికొందరు నేతలు సిఫార్సులు చేస్తున్నారు. సెంట్రల్​ ఎలక్షన్​ కమి టీలో చోటు దక్కించుకున్న ఉత్తమ్ వద్దకు రోజూ అభ్యర్థులు క్యూ కడ్తున్నారు. 

అభ్యర్థుల ఎంపికకు అత్యంత కీలకమైన ఆ కమిటీలో ఉత్తమ్​ ఉండడంతో.. ఆయనకు నేరుగా మొర పెట్టుకుంటే పని అవుతుందన్న భావనలో ఆశావహులు ఉన్నారు. కాగా, మూడు దశలుగా అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్​ కమిటీ పని చేసింది. ఈ నెల 4 నుంచి 6వ తేదీ దాకా స్క్రీనింగ్​ కమిటీ.. అభ్యర్థుల వడపోత కార్యక్రమాన్ని నిర్వహించింది. 

తొలి రోజు ప్రదేశ్ ఎన్నికల కమిటీ సభ్యులతో విడివిడిగా మాట్లాడిన స్క్రీనింగ్​ కమిటీ చైర్మన్​ మురళీధరన్​.. రెండో రోజు డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలను తీసుకున్నారు. మూడో రోజు స్క్రీనింగ్​ కమిటీ నేరుగా సమావేశమైంది. సీడబ్ల్యూసీ సమావేశాలున్న నేపథ్యంలో దానిపై ఫోకస్​ పెట్టేలా కమిటీ మరోసారి మీటింగ్​ పెట్టనుంది.