
చాలారకాల వంటల్లో రుచి కోసం ఇంగువ వాడతారు. అయితే రుచికే కాదు, ఎసిడిటీ, కడుపునొప్పి, ఉబ్బరం, మలబద్ధకం, పేగుల్లో సమస్యలు పోవడానికి కూడా ఉపయోగపడుతుంది. రోజూ ఒక గ్లాస్ నీళ్లల్లో చిటికెడు ఇంగువ కలిపి తాగినా చాలా హెల్త్ బెనిపిట్స్ ఉన్నాయి అంటున్నారు డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ డాక్టర్. అనురాధ అరిసెట్టి.
- జీర్ణ క్రియకు ఉపయోగపడే ఎంజైమ్‌ల పనితీరును మెరుగుపరుస్తుంది. దాంతో ఆహారం బాగా అరుగుతుంది. ఇంగువలో ఉన్న కార్మినేటివ్ గుణాల వల్ల ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్ పోతాయి.
- మలబద్ధకం, పేగుల్లో సమస్యలు పోవడానికి ఇంగువలో ఉన్న లాగ్జేటిక్ గుణాలు సాయపడతాయి. పొట్టలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది. ఇందులో ఉన్న ఆల్కలైన్ స్వభావం యాసిడ్ రిఫ్లక్స్‌ను పోగొడుతుంది. గ్యాస్, అజీర్తి వల్ల కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. ఇంగువలో ఉన్న యాంటిస్పాస్మోడిక్, యాంటి ఇన్‌ఫ్లమేటరి లక్షణాలు జీర్ణ సమస్యల్ని దూరం చేస్తాయి.
- ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్లను తగ్గించి ఆస్తమా లాంటివి రాకుండా చేస్తాయి.
- ఇంగువ ఒత్తిడిని తగ్గిస్తుంది. దాంతో గుండె సంబంధ సమస్యలు రావు. దగ్గు, జలుబు, జ్వరం లాంటి సీజనల్ వ్యాధులకు యాంటీవైరల్‌గా పనిచేస్తుంది. అంతేకాకుండా మాడును తేమగా ఉంచుతుంది కూడా. ఇంగువలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. జీవక్రియలు సరిగా జరిగేలా చేస్తుంది. దాంతో బరువు తగ్గుతారు కూడా.