
ఆసిఫాబాద్/ఆదిలాబాద్/బెల్లంపల్లి/కాగజ్ నగర్, వెలుగు: ఆషాఢ మాస బోనాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. వేకువ జాము నుంచే బోనాలతో అమ్మవారి ఆలయాలకు క్యూ కట్టారు. అమ్మవారికి ఇష్టమైన గారెలు, అప్పాలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆదిలాబాద్లో జరిగిన వేడుకల్లో ఎస్పీ దంపతులు అశోక్ రోడ్ పోచమ్మ ఆలయం, మహాలక్ష్మి వాడ మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బెల్లంపల్లి 13వ వార్డులో మాజీ కౌన్సిలర్ బండి ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఊరేగింపులో ఎమ్మెల్యే గడ్డం వినోద్ పాల్గొన్నారు. బోనం నెత్తిన పెట్టుకొని భక్తులతో కలిసి బంగారు మైసమ్మ ఆలయంలో అమ్మవారికి సమర్పించారు.
ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. కాగజ్ నగర్ పట్టణంలోని సర్ సిల్క్ కాలనీలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. శివసత్తుల నృత్యాలు, విన్యాసాలతో ఆకట్టుకున్నారు. బోనాల జాతర కమిటీ అధ్యక్షుడు తుమ్మ రమేశ్ దంపతులు అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే హరీశ్ బాబు, మాజీ ఎమ్మెల్యే కోనప్ప, జడ్పీ మాజీ చైర్మన్ కోనేరు కృష్ణారావు సహా పలువురు ప్రత్యేక పూజలు చేసి బోనం సమర్పించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని రాజంపేట కాలనీ వాసులు పోచమ్మ తల్లి అమ్మవారికి సామూహిక మొక్కలు చెల్లించారు. పాడి పంటలు పండాలని, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని వేడుకుని మొక్కులు చెల్లించారు.