బోనం ఎందుకు చేస్తరు.. దాని ప్రాముఖ్యతేంటి?

బోనం ఎందుకు చేస్తరు.. దాని ప్రాముఖ్యతేంటి?

బోనం తీసుడంటెనే ఆకాశమంత పండుగ. ఆడపడుచులకు కొండంత సంబురం, హైదరాబాద్‌‌ అంతా సందడి! ప్రతి గల్లీలో జాతర! బోనాల పండుగ వచ్చిందంటే చాలు పట్నంల నెల రోజులు దావత్‌‌ ఉంటది. ఇరుకు ఇండ్లల్ల ఉన్నా గంపెడంత ప్రేమతో దగ్గరోళ్లను పిలిచి, నిండు మనసుతోని పెద్ద పండుగ చేస్తరు. ఉట్టి రోజులల్ల ఉత్తన్నం తిన్నా.. తల్లికి బోనమిచ్చినాక యాటలు కోసి, బగారన్నం వండుతరు. వచ్చిన చుట్టాలకు కడుపునిండా తిండి పెట్టి, హైదరాబాద్‌‌ అందాలను చూపెట్టి క్షేమంగ ఊరి బస్సు ఎక్కిస్తరు. హైదరాబాద్‌‌ వాళ్లకు పెద్ద పండుగైనా... పోయినేడు కరోనా వల్ల కాస్త చిన్నగనే చేసుకున్నరు! మరి ఈసారి? 

ఆషాఢ మాసంలో హైదరాబాద్‌‌లో ఉండే సందడే వేరు. ఏ గల్లీలో చూసినా జనాలే కనిపిస్తుంటారు. పోతురాజుల ఆటలు, ఘటాల ఊరేగింపులు.. చూస్తుంటే మనసు పులకరించిపోతుంది. కానీ.. పోయినేడు కరోనా వల్ల ఎలాంటి ఆర్భాటాలు లేకుండా పండుగ చేసుకున్నారు. ఈ సారి మాత్రం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా రూల్స్‌‌ పాటిస్తూనే పెద్ద ఎత్తున పండుగ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఈ రోజు గోల్కొండ జగదాంబ అమ్మవారి ఆలయంలో మొదలైన ఉత్సవాలు ఆగస్టు 1న ముగుస్తాయి. ఈ మూడు వారాలు హైదారాబాద్‌‌ డప్పు చప్పుళ్లతో మారుమోగుతుంది. 

ఎప్పుడు మొదలయ్యాయి? 
బోనాలు సమర్పించే సంస్కృతి తెలంగాణలో ఎప్పటినుంచో ఉంది. అయితే.. హైదరాబాద్‌‌లో 18వ శతాబ్దం నుంచి దీన్ని పెద్ద ఉత్సవంగా సామూహికంగా చేస్తున్నారు. 1813లో జంట నగరాల్లో మహమ్మారి వచ్చి చాలామందిని పొట్టనపెట్టుకుంది. అయితే.. ఇక్కడ వ్యాధి విజృంభించడానికి ముందే ఒక సైనిక బెటాలియన్‌‌ మన దగ్గరనుంచి మధ్యప్రదేశ్‌‌లోని ఉజ్జయినికి వెళ్లింది. ఆ బెటాలియన్‌‌లో పనిచేసే సురిటి అప్పయ్య.. వ్యాధి గురించి తెలుసుకుని.. ఉజ్జయినిలో ఉన్న మహంకాళి అమ్మవారిని వేడుకున్నాడు. ఆయన తిరిగి వచ్చేసరికి వ్యాధి తగ్గిపోయింది. దాంతో 1815లో  ఆలయం కట్టించి, కలపతో చేసిన అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటినుంచే హైదరాబాద్‌‌లో బోనాల పండుగ మొదలైందని చెప్తుంటారు.

ఆషాఢంలోనే ఎందుకు? 
ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లైన ఆడపిల్లలు తల్లిగారింటికి వెళ్తుంటారు. అలాగే అమ్మవారు కూడా పుట్టింటికి వస్తుందని నమ్మకం. అందుకే పుట్టింటికి వచ్చిన దేవతకు ఇష్టమైన భోజనం పెడుతుంటారు. దాన్నే బోనం అని పిలుస్తున్నాం. ఈ పండుగకు ఆడపిల్లలను పుట్టింటికి తీసుకొస్తారు. కొన్ని ప్రాంతాల్లో పండుగను పెద్ద పండుగ అని కూడా పిలుస్తుంటారు. 

బోనం అంటే? 
ఆషాఢ మాసంలో తెలంగాణలోని చాలా గ్రామాల్లో బోనాల పండుగ చేసుకుంటారు. అంటే గ్రామదేవతలు అమ్మవార్లను పూజించి, వాళ్లకు ఇష్టమైన భోజనాన్ని నైవేద్యంగా పెడతారు. అంటే ఇది అమ్మవారికి భోజనం పెట్టే పండుగ. బోనం అంటే భోజనం అని అర్థం. కొత్త కుండలో అన్నం వండి, అమ్మవారికి భక్తితో సమర్పిస్తారు. బోనంలో అన్నంతోపాటు పాలు,పెరుగు, బెల్లం ఉంటాయి. బోనం కుండలను వేప రెమ్మలతో పసుపు, కుంకుమ, బియ్యప్పిండి ముగ్గులతో అందంగా అలంకరిస్తారు. దానిపై ఒక దీపం కూడా పెడతారు. 

పోతురాజు స్పెషల్‌‌ ఎట్రాక్షన్‌‌
పోతురాజుని అమ్మవారి తమ్ముడిగా చెప్తుంటారు. హైదరాబాద్‌‌లో కొందరు పోతురాజు వేషం వేసుకుని, ముందుండి భక్తులను నడిపిస్తుంటారు. అయితే.. కిందటేడాది కరోనా వల్ల చాలా తక్కువమంది పోతురాజులను పిలిపించుకున్నారు. కానీ.. ఈ ఏడాది మాత్రం రూల్స్‌ తక్కువగా ఉండడంతో పోతురాజులకు మళ్లీ కాస్త డిమాండ్‌‌ పెరిగింది. పోతురాజు వంటినిండా పసుపు పూసుకుని, కాళ్లకు గజ్జెలు, పెద్ద బొట్టుతో, చేతిలో కొరడా(ఈరకోల) పట్టుకుని భయంకరంగా ఉంటాడు. పోతురాజును రక్షకుడిగా కొలుస్తారు. ఈరకోలతో దెబ్బలు తిన్నవాళ్లకు మంచి జరుగుతుందని, వ్యాధులు తగ్గుతాయని నమ్ముతారు. 

గావు పట్టడం 
ఉగ్రరూపంలో ఉండే అమ్మవారు రక్తాన్ని చూసి శాంతిస్తుందని నమ్ముతారు. అందుకే పోతురాజులు అమ్మవారి ముందు మేక పీకను నోటితో కొరికి బలిస్తారు. అయితే.. ఈ ఆచారాన్ని ఇప్పుడు చాలా ప్రాంతాల్లో పాటించడంలేదు. మూగ జీవాలను అలా హింసించి చంపడం ఇష్టంలేని వాళ్లు వాటికి బదులుగా గుమ్మడికాయ, నిమ్మకాయలతో గావు పట్టిస్తున్నారు. 

బోనాల విందులు 
అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత.. ఇంటికొచ్చి నాన్‌‌వెజ్‌‌ వండుకుని తింటారు. ఎవరి స్థాయికి, బలగానికి తగ్గట్టు వాళ్లు దావత్‌‌ ఇస్తుంటారు. కొందరు మేకలు కోస్తే, ఇంకొందరు కోళ్లు కోస్తుంటారు. దాదాపు అన్ని ఇళ్లలో విందులో మందు తప్పనిసరిగా ఉంటుంది. 

ఘటం 
రంగం తర్వాత ఈ ఉత్సవం జరుగుతుంది. ఒక రాగి కలశాన్ని అమ్మవారిగా భావించి, అలంకరిస్తారు. దాన్నే ఘటం అని పిలుస్తారు. ముఖ్యంగా హరిబౌలిలోని అక్కన్న, మాదన్న ఆలయం నుంచి వచ్చే ఘటాన్ని ఏనుగు అంబారీపై ఊరేగిస్తారు. పక్కన గుర్రాల మీద అక్కన్న, మాదన్నల బొమ్మలను ఉంచుతారు. తర్వాత నయాపూల్‌‌లో నిమజ్జనంతో ఘటం కార్యక్రమం ముగుస్తుంది.
 

తొట్టెలు 
బోనాల పండుగ సందర్భంగా దేవతకు తొట్టెలను సమర్పిస్తారు. రంగురంగుల కాగితాలతో తయారు చేసే ఈ తొట్టెలను అమ్మవారికి సమర్పిస్తే, ఆమె అందులో ఊయల ఊగుతుందని నమ్ముతారు. సంతానం లేనివాళ్లు అమ్మవారికి తొట్టెలు సమర్పిస్తే సంతానం కలుగుతుందనేది నమ్మకం. 

ఆచారాలు 
తెలంగాణ పల్లెల్లో దాదాపు వెయ్యేళ్ల నుంచి బోనాల పండుగ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఈ పండుగలో కొన్ని ఆచారాలు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. ఉదాహరణకు అమ్మవారికి ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన నైవేద్యం పెడతారు. హైదరాబాద్‌‌లో ఉండే కొన్ని ఆచారాలు పల్లెటూళ్లలో ఉండవు. 

ఎలా చేసుకుంటున్నారు? 
ఈ సారి బోనాలు ఘనంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు హైదరాబాద్‌‌ వాసులు. వారం ముందు నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కరోనా నుంచి కాపాడుకునేందుకు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే వచ్చిన చుట్టాలకు ఇచ్చేందుకు శానిటైజర్లు, మాస్కులు ముందుగానే కొని పెట్టుకున్నారు.  

ట్రాన్స్ విమెన్
బోనాల పండుగలో ట్రాన్స్‌‌ విమెన్‌‌కి ఈ మధ్య ప్రయారిటీ బాగా పెరిగింది. కొన్నేళ్ల నుంచి ట్రాన్స్‌‌ విమెన్‌‌ చేత బోనాలు ఎత్తిస్తున్నారు.ఈ ఆచారం ఎప్పటినుంచో ఉన్నా.. తెలంగాణ వచ్చిన తర్వాత పెరిగింది. ఇప్పుడు పండుగలో ట్రాన్స్ విమెన్‌‌ ఒక భాగమైంది. చాలామంది ట్రాన్స్‌‌ విమెన్‌‌ శివసత్తులుగా మారారు. ఉత్సవాలప్పుడు బోనాలు ఎత్తుకోవడానికి ఉత్సవ కమిటీల వాళ్లు ట్రాన్స్‌‌ విమెన్‌‌ను అడుగుతున్నారు. అయితే.. ఈ సంస్కృతి ఇప్పుడిప్పుడే తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు వ్యాపిస్తోంది. 

శక్తిరూపాలకు బంగారు బోనం
అమ్మవారికి బోనంతో పాటు చీర, గాజులు కూడా ఇస్తారు. చాలాచోట్ల రాగి బిందె లేదా మట్టి కుండలో బోనం సమర్పిస్తారు. కానీ ఈసారి సప్త మాతృక (ఏడుగురు అమ్మలు)లకు బంగారు పూత పోసిన బిందెలో బోనం, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. భక్తుల కొంగుబంగారంగా పేరొందిన 
ఈ శక్తిరూపాల ప్రత్యేకతలివి...

గోల్కొండ జగదాంబ
బోనాల ఉత్సవాల్లో తొలి బోనం గోల్కొండ జగదాంబ అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఆషాఢ మాసం మొదటి ఆదివారం జగదాంబ తల్లికి బోనం అందిన తర్వాతే రాష్ట్రమంతటా బోనాల పండుగ మొదలవుతుంది. హైదరాబాద్​లోని పురాతన ఆలయం ఇది. కాకతీయుల కాలం నుంచి జోగులాంబ అమ్మవారు పూజలు అందుకుంటున్నారని చరిత్ర చెబుతోంది.  

బల్కంపేట ఎల్లమ్మ
మహిమగల తల్లి బల్కంపేట ఎల్లమ్మను కాళీ మాత అవతారంగా పిలుస్తారు కూడా. ప్రతి ఏడాది బోనాల సందర్భంగా అమ్మవారికి పెళ్లి చేయడం ఈ గుడిలోనే కనిపిస్తుంది. అమ్మవారి విగ్రహం పది అడుగుల లోతులో ఉంటుంది. ఇక్కడి బావిలోని నీళ్లు అన్నిరకాల వ్యాధులను నయం చేస్తాయని భక్తుల నమ్మకం. ఈ గుడికి దక్షిణంలో పోచమ్మ ఆలయం​ ఉంటుంది. పోచమ్మ తల్లి ఈ గుడికి రక్షణగా ఉందని చెబుతారు కొందరు. బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్​ని ద్రవిడ శిల్పకళతో పదిహేనో శతాబ్దంలో నిర్మించారు. 

జూబ్లిహిల్స్​ పెద్దమ్మ తల్లి
సప్తమాతృకల్లో ఒకరైన లక్ష్మీదేవి ఈ గుడిలో సింహవాహినిగా పూజలు అందుకుంటోంది. ఈ అమ్మవారికి ‘సంతాన లక్ష్మి’ అనే పేరు కూడా ఉంది. అమ్మలకు అమ్మగా పిలిచే పెద్దమ్మ తల్లి ఒకప్పుడు గ్రామ దేవతగా ప్రసిద్ధి. ఈ గుడిలోని ధ్వజస్తంభం దగ్గర రూపాయి నాణేన్ని నిలబెడితే కోరికలు నెరవేరుతాయంటారు. బోనాల పండుగ, దసరా నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి.

విజయవాడ కనకదుర్గమ్మ
శక్తిరూపమైన కనకదుర్గకు మనవాళ్లు ప్రతి ఏడాది బోనం సమర్పిస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారికి భాగ్య నగర్​ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల కమిటీ వాళ్లు బంగారు బోనం, పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 

సికింద్రాబాద్​ ఉజ్జయినీ మహంకాళి
దాదాపు రెండొందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని సూరటి అప్పయ్య అనే భక్తుడు నిర్మించాడు. మధ్యప్రదేశ్​లోని ఉజ్జయిని మహంకాళీకి ప్రతిరూపమే సికింద్రాబాద్​ మహంకాళి. మొదట్లో కర్రలతో చేసిన మహంకాళి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రతి పౌర్ణమికి ఇక్కడ ‘చండీ హోమం’ నిర్వహిస్తారు.  మహంకాళి బోనాల జాతరలో రంగం ఘట్టం చాలా గొప్పగా జరుగుతుంది.    

చార్మినార్​ భాగ్యలక్ష్మి
ఇక్కడి అమ్మవారిని లక్ష్మీ దేవిగా కొలుస్తారు. చారిత్రక కట్టడం చార్మినార్​ దక్షిణ భాగంలో పవిత్రమైన రాయిని వందల ఏళ్ల క్రితమే ఏర్పాటు చేశారని, ఆ రాయి ఉన్న చోటే ఇప్పడున్న భాగ్యలక్ష్మి గుడిని కట్టించారని చెబుతారు. 

లాల్​దర్వాజా సింహవాహిని
బోనాల పండుగలో చివరి బోనం లాల్​దర్వాజాలోని సింహవాహిని అమ్మవారికి సమర్పిస్తారు. దాంతో బోనాల పండుగ ముగుస్తుంది. ఇక్కడ మహంకాళి అమ్మవారిని సింహవాహినిగా ఆరాధిస్తారు. మూసీ నది వరదల టైంలో అప్పటి నిజాం రాజు మీర్​ ఉస్మాన్​ ఆలీ ఖాన్​ ఈ అమ్మవారికి చీర, బంగారు గాజులు సమర్పించారట. 

పండక్కి 15కోట్లు
కిందటేడాది పండుగ సాదాసీదాగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. పైగా ‘రంగం’లో అమ్మవారు కూడా ఈ సారి నిరాశ చెందానని చెప్పారు. ఈ ఏడు మాత్రం ఉత్సవాలు ఘనంగా చేస్తామని గవర్నమెంట్ చెప్తోంది. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు కూడా చేస్తోంది. కొవిడ్‌‌ రూల్స్‌‌ పాటిస్తూనే ఉత్సవాలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆలయాల డెకరేషన్‌‌, పూజలు చేసేందుకు గవర్నమెంట్‌‌ 15 కోట్ల రూపాయలు కేటాయించింది. బోనాల పండుగ సందర్భంగా189 దేవాలయాల్లో ఆర్టిస్ట్‌‌లతో కల్చరల్‌‌ ప్రోగ్రామ్స్‌‌ ప్లాన్‌‌ చేశారు. 26 ముఖ్యమైన ఆలయాల్లో అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టుబట్టలు సమర్పిస్తున్నారు

బోనాలకొస్తే  బోలెడు చూడొచ్చు

బిర్లా మందిర్‌‌‌‌

హైదరాబాద్‌‌లో చాలా ఫేమస్‌‌. ఇక్కడ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్నాడు.  రవీంద్రభారతి దగ్గర్లో ఉంటుంది. నౌబత్‌‌ పహడ్‌‌ అనే ఎత్తైన కొండ మీద పూర్తిగా పాలరాతితో ఈ టెంపుల్‌‌ని కట్టించారు. నిర్మాణ పనులు 1966లో మొదలై, 1976 లో పూర్తయ్యాయి. ఈ టెంపుల్‌‌ పక్కనే బిర్లా సైన్స్ సిటీ, ప్లాని​టోరియం ఉన్నాయి. ఆలయం నుంచి చూస్తే హుస్సేన్ సాగర్, బుద్ధ విగ్రహం, అసెంబ్లీ, రవీంద్ర భారతి, లాల్ బహుదూర్ స్టేడియం, లుంబినీ పార్క్ కనిపిస్తాయి. 11 అడుగుల గ్రానైట్‌‌తో గర్భగుడిలోని స్వామివారి విగ్రహం చెక్కారు. ఇక్కడికి ప్రతిరోజూ ఎక్కడెక్కడినుంచో టూరిస్ట్‌‌లు, భక్తులు వస్తుంటారు.

శ్యామ్‌‌ టెంపుల్‌‌
ఈ టెంపుల్‌‌ కాచిగూడలో ఉంది. ఈ టెంపుల్‌‌ని శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి, శ్రీ అనంత సరస్వతి స్వామి 1996లో ప్రారంభించారు. దీన్ని ముప్పై వేల చదరపు అడుగుల్లో కట్టారు. ఈ ఆలయంలో మూడు అంతస్తులు ఉన్నాయి. ఆలయ ఆవరణలో శ్రీ లక్ష్మీ నారాయణ, రాధాకృష్ణుల ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ దేవుడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా పూలు తీసుకుని వస్తారు. తొలి ఏకాదశి రోజున ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయి.

ఆంజనేయస్వామి దేవాలయం
ఇది కర్మన్‌‌ఘాట్‌‌లో ఉంది.  దీన్ని 12వ శతాబ్దంలో కట్టించారు. హైదరాబాద్‌‌లో చూడదగిన చారిత్రక ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. అప్పట్లో ఓ కాకతీయ సామంత రాజు వేటాడుతూ ఈ ప్రాంతానికి వచ్చాడు. ఒక చెట్టు కింద సేద తీరుతుండగా ఆ చెట్టు నుంచి రామ నామస్మరణ వినిపించింది. అదే రోజు రాత్రి ఆ రాజు కలలో రాముడు కనిపించి హనుమంతుడికి గుడి కట్టమన్నాడట.  

పూరీ జగన్నాథ్‌‌ టెంపుల్‌‌ 
జగన్నాథుడు అంటే జగాన్ని ఏలేవాడు అని అర్థం. ఈ ఆలయం ఒడిశాలోని పూరిలో ఉంది.  2009లో అలాంటి ఆలయాన్నే హైదరాబాద్‌‌లో కూడా కట్టించారు. అది బంజారాహిల్స్‌‌లోని రోడ్ నెం.12లో ఉంది. ఇక్కడికి ప్రతిరోజూ భక్తులు వస్తుంటారు. ఈ ఆలయం పూర్తిగా పూరిలోని ఆలయాన్ని పోలి ఉంటుంది. దీన్ని 3000 గజాల స్థలంలో కట్టారు. ఈ టెంపుల్‌‌ శిఖరం ఇక్కడ స్పెషల్‌‌ ఎట్రాక్షన్‌‌. దాదాపు 70 అడుగుల ఎత్తు ఉంటుంది. రెడ్‌‌ కలర్‌‌‌‌లో ఉన్న ఈ టెంపుల్‌‌ని శాండ్‌‌ స్టోన్‌‌తో కట్టారు. దీని నిర్మాణానికి వాడిన రాయిని ఒడిశా నుంచి తీసుకొచ్చారు. 60 మంది శిల్పులు ఆ రాళ్లను చెక్కారు. ఈ టెంపుల్‌‌లో లక్ష్మీదేవి, శివుడు, గణేషుడు, హనుమాన్, నవగ్రహాల విగ్రహాలు కూడా ఉన్నాయి. గర్భగుడిలో జగన్నాథస్వామి తన సన్నిహితులైన భలభద్రుడు, సుభద్రాదేవిలతో కలసి కొలువయ్యాడు. 

అష్టలక్ష్మీ ఆలయం 
ఇది కొత్తపేటలో ఉంది. దీన్ని దాదాపు ఐదు సంవత్సరాల పాటు కట్టారు. 1996లో నిర్మాణం పూర్తైంది. కంచి కామకోటి పీఠం వాళ్లు కట్టించారు. ఈ ఆలయంలో ఆదిలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, సంతానలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, విజయలక్ష్మి, వరలక్ష్మి అమ్మవార్ల విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడికి ప్రతిరోజూ భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడి వస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు.