అతడు మరో సెహ్వాగ్‌లా కనిపిస్తున్నాడు: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్

అతడు మరో సెహ్వాగ్‌లా కనిపిస్తున్నాడు: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్

వీరేంద్ర సెహ్వాగ్.. ఈ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది అతని ఆట తీరు. టెస్టులు, వన్డేలు, టీ20లు అన్న తేడా లేకుండా.. ఫార్మాట్ ఏదైనా దూకుడుగా ఆడటమే వీరూ స్పెషాలిటీ. అతని గురుంచి ఒక్కమాటలో చెప్పాలంటే.. విధ్వంసానికి అతనొక బ్రాండ్ అంబాసిడర్. భారత్‌ను క్రికెట్ బ్రాండ్‌గా మార్చిందే.. అతను. 

టీమిండియా ఓపెనర్‌గా ఎన్నో రికార్డులు బద్ధలు కొట్టిన సెహ్వాగ్.. టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచరీలు చేసిన ఏకైక భారత బ్యాటర్. వన్డేల్లో సచిన్ తర్వాత డబుల్ సెంచరీ బాదిన రెండో భారత క్రికెటర్. డబుల్ సెంచరీ చేయడానికే ఆపసోపాలు పడే క్రికెటర్ల నడుమ.. సిక్సర్‌తో 300 మార్క్ అందుకున్న ధైర్యవంతుడు వీరూ. ఇలా అతని గొప్పతనం గురుంచి చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకమే రాయచ్చు. ఆ లక్షణాలు ఓ యువ క్రికెటర్ లో కనిపిస్తున్నాయని చెప్పుకొచ్చారు.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్. 

జాక్ క్రాలీలో అదే దూకుడు

అలిస్టర్ కుక్ చెప్పినదాంట్లో వాస్తవం లేకపోలేదు. ఇంగ్లండ్ టాపార్డర్ బ్యాటర్ జాక్ క్రాలీలో అచ్చం అదే దూకుడు కనిపిస్తోంది. ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీకి తరలించాలన్న తపన, బౌలర్లపై పైచేయి సాధించాలనే కసి అతనిని సెహ్వాగ్‌కు దగ్గర చేస్తున్నాయి. వీరూ అంతటి పేరు, అన్ని రికార్డులు చేస్తాడో.. చేయడో కానీ అతని ఆట తీరు మాత్రం.. అభిమానులకు సెహ్వాగ్‌ విధ్వంసాన్ని గుర్తుచేస్తోంది.

యాషెస్ సిరీస్ సందర్బంగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. క్రాలీలో కొన్ని షేడ్స్ సెహ్వాగ్‌ను గుర్తుచేస్తున్నాయని తెలిపారు.