అశ్వాపురంలో గంజాయి పట్టివేత

అశ్వాపురంలో గంజాయి పట్టివేత

అశ్వాపురం, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం పోలీసులు మంగళవారం గంజాయి పట్టుకున్నారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గొల్లగూడెం గ్రామం వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ కారులో 138 కిలోల గంజాయి ప్యాకెట్లు దొరికాయి. ఏపీలోని చింతూరు నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నట్లు కారులోని ఇద్దరు నిందితులు తెలిపారు. రూ.34 లక్షల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. 

గంజాయి అమ్ముతుండగా.. 

ఖమ్మం టౌన్ : ఖమ్మం నగరంలోని రాపర్తి నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద మంగళవారం నలుగురు వ్యక్తులు గంజాయి అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నట్లు  టౌన్ ఏసీపీ రమణమూర్తి తెలిపారు. ఏసీపీ ఆఫీస్ లో టూ టౌన్ సీఐ బాలకృష్ణతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. దానవాయిగూడెంకు చెందిన శీలం రవి,పెండ్రా వరుణ్, బూర్హాన్ పురం కు చెందిన శ్రావణ్, మేకలబండా పార్కుకు చెందిన డీ.సాయి రాఘవేంద్ర గంజాయి అమ్మతుంటారు.

శీలం రవి, పెండ్రా వరుణ్ కలిసి వారం రోజుల కింద భద్రాచలం సమీపంలోని సీలేరు కు వెళ్లి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అరకేజీ గంజాయి కొనుగోలు చేశారు. వారు మిగతావరితో కలిసి గంజాయి తాగడంతోపాటు, గంజాయిని పొట్లాలుగా చేసి విక్రయిస్తుండగా పట్టుకున్నారు. పట్టుబడిన నలుగురు వ్యక్తుల వద్ద నుంచి రూ.10 వేలు విలువ చేసే 400 గ్రాముల ఎండు గంజాయి, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేసినట్లు ఏసీపీ తెలిపారు. 

అక్రమ మద్యం..

లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు నిర్వహించిన దాడుల్లో పలుచోట్ల అక్రమ మద్యం పట్టుబడింది. ఖమ్మం నగరపాలక సంస్థ రామన్నపేట వద్ద రూ. 19,628, దానవాయిగూడెం వద్ద రూ.18,469, గోపాలపురం వద్ద రూ. 4,681 విలువైన అక్రమ మద్యం పట్టుకొని సీజ్ చేశారు.