హర్యానాలో ఏఎస్ఐ ఆత్మహత్య..డెత్ నోట్ లో పూరన్ పై ఆరోపణలు

హర్యానాలో ఏఎస్ఐ ఆత్మహత్య..డెత్ నోట్ లో పూరన్ పై ఆరోపణలు
  • 3 పేజీల నోట్, వీడియో స్వాధీనం
  • పూరన్ అత్యంత అవినీతిపరుడు
  • సూసైడ్​ నోట్​లో ఏఎస్ఐ తీవ్ర ఆరోపణలు

చండీగఢ్: హర్యానాలోని రోహ్​తక్ సైబర్ సెల్​లో ఏఎస్ఐగా పనిచేస్తున్న సందీప్ కుమార్ మంగళవారం సర్వీస్ రివాల్వర్​తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్​కు ముందు రికార్డ్ చేసిన 6 నిమిషాల వీడియోతో పాటు 3 పేజీల సూసైడ్ నోట్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సీనియర్ ఐపీఎస్ అధికారి వై.పూరన్ కుమార్​పై సూసైడ్ లెటర్, వీడియోలో సంచలన ఆరోపణలు చేశాడు. 

ట్రాన్స్​ఫర్ కోసం మహిళా పోలీసులు రిక్వెస్ట్ పెట్టుకుంటే.. వాళ్లను పూరన్ లైంగికంగా వేధించేవాడని పేర్కొన్నాడు. తాను చేసిన అవినీతి, అక్రమాలు ఎక్కడ బయటపడ్తాయనే భయంతోనే పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాడు. కుల వివక్ష కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని సూసైడ్ లేఖలో సందీప్ పేర్కొన్నాడు. 

ఈ వ్యవహారంలో నిజాలు వెలుగులోకి రావడం కోసమే తన జీవితాన్ని త్యాగం చేస్తున్నట్లు చెప్పాడు. లాధౌత్ – ధామర్ రోడ్​లోని అతని ఇంటి నుంచి డెడ్​బాడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, వీడియో, సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. దీంతో అక్టోబర్ 7న ఆత్మహత్య చేసుకున్న ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ కేసు మరో మలుపు తిరిగింది.