రూటు మార్చిన గంభీర్.. కోహ్లీ గొప్పోడు అంటూ పొగడ్తలు

రూటు మార్చిన గంభీర్.. కోహ్లీ గొప్పోడు అంటూ పొగడ్తలు

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరెత్తితేనే మండిపడే భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.. ఉన్నట్టుండి రూటు మార్చారు. ఆసియాకప్ టోర్నీ చరిత్రలోనే పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఆడిన 183 పరుగుల ఇన్నింగ్స్ అత్యుత్తమైనదని అభిప్రాయపడ్డారు. 

వీరిద్దరి మధ్య ఐపీఎల్ 2014 సీజన్‌లో తొలిసారి గొడవ జరగా.. ఆనాటి నుంచి అవకాశం వచ్చినప్పుడల్లా కోహ్లీపై గంభీర్ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించేదాకా ఈ విమర్శలను కొనసాగించారు. అనంతరం కోహ్లీ కెప్టెన్సీ పోయాక కాస్త నెమ్మదించినా.. ఐపీఎల్ 2023 సీజన్‌‌లో మరోసారి గొడవ జరిగాక అతని ప్రస్తావన తేవడమే మానేశారు. అలాంటిది ఉన్నట్టుండి కోహ్లీపై ప్రేమ కురిపించారు.

ALSO READ :ముద్దు పెడితే తప్పేంటీ.. సమర్థించుకున్న డైరెక్టర్

ఆసియాకప్ 2023 ప్రారంభానికి ముందు ఓ చానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న గంభీర్.. కోహ్లీపై పొగడ్తలు కురిపించారు. ఆసియా కప్‌లో విరాట్ కోహ్లీ ఆడిన 183 పరుగుల ఇన్నింగ్స్ అత్యుత్తమమైనదని చెప్పుకొచ్చారు. "పాకిస్థాన్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో 330 పరుగుల లక్ష్యచేధనలో కోహ్లీ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడారు. ఆ మ్యాచ్‌లో నేను డకౌటయ్యాను. తొలి ఓవర్‌లోనే వికెట్ పడటంతో మ్యాచ్ గెలవడం కష్టమనుకున్నా. కానీ అంత ఒత్తిడిలోనూ కోహ్లీ రాణించారు. 183 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. నా వరకూ ఆసియా కప్‌లో అదే బెస్ట్ ఇన్నింగ్స్.." అని గంభీర్ వెల్లడించారు.

2012 ఆసియా కప్‌

బంగ్లాదేశ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ మహమ్మద్ హఫీజ్(105), నాజిర్  జెంషడ్(112) సెంచరీలు చేయడంతో నిర్ణీత ఓవర్లలో 329 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం లక్ష్యచేధనలో కోహ్లీ 148 బంతుల్లో 22 ఫోర్లు, సిక్సర్‌తో 183 పరుగులు చేశారు. ఇప్పటికీ ఆసియా కప్ చరిత్రలో అదే అత్యధిక వ్యక్తిగత స్కోరు.