ఇండియా- పాక్ మ్యాచ్‌కు రాజకీయ రంగు.. హద్దుమీరిన పీసీబీ మాజీ ఛైర్మన్

 ఇండియా- పాక్ మ్యాచ్‌కు రాజకీయ రంగు.. హద్దుమీరిన పీసీబీ మాజీ ఛైర్మన్

ఆసియా కప్ 2023లో భాగంగా ఇండియా - పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన టీమిండియా 266 పరుగులు చేయగా.. పాక్‌ బ్యాటర్లు అసలు మైదానంలోకే రానివ్వకుండానే వర్షం ముంచెత్తింది. దీంతో చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు ఫలితం తేలకుండానే ముగిసింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే ఈ మ్యాచ్ రాజకీయ రంగు పులుముకుంది. 

ఈ మ్యాచ్ వాష్ అవుట్ అయిన కొన్ని గంటల్లోనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ ఛైర్మన్ నజం సేథీ ప్రస్తుత ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)అధ్యక్షడు జై షాపై విరుచుకుపడ్డారు. నజం సేథీ గతంలో ట్విట్టర్ వేదికగా చేసిన ఒక పోస్ట్‌లో.. ఆసియా కప్‌లోని మిగిలిన మ్యాచ్‌లను శ్రీలంకకు బదులుగా యూఏఈలో ఆడాలని ఏసీసీని కోరినట్లు చెప్పాడు. కానీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ అతని సలహాలను పట్టించుకోలేదు. యూఏఈ వాతావరణం చాలా వేడిగా ఉంటుందని, ఆటగాళ్లు బాగా అలిసిపోతారంటూ సాకులు చెప్పారు. 

జై షా రాజకీయాలు చేశాడు..!

పాకిస్తాన్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు భారత్ నిరాకరించిన అనంతరం.. ఆసియా కప్‌కు సహ-హోస్ట్‌గా యూఏఈని ఎంపిక చేసేవిషయంలో ఏసీసీ క్రికెట్ బాడీ రాజకీయాలు ఆడిందని నజం సేథీ ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. టోర్నమెంట్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇచ్చేలా వారు చేసిన ఈ చర్యలను క్షమించరానిది అని పేర్కొన్నారు. 

"క్రికెట్‌లో అతి గొప్ప పోటీ ఉండే ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ రద్దవ్వడం నిరుత్సాహ పరిచింది. కానీ ఇది నేను ముందుగా ఊహించిందే. పీసీబీ ఛైర్మన్ గా నేను యూఏఈ ఆడాలని ఏసీసీని కోరాను. కానీ శ్రీలంకకు వసతి కల్పించడానికి అనేక కొంటి సాకులు చెప్పారు.. దుబాయ్‌లో చాలా వేడిగా ఉంటుందని చెప్పారు. కానీ 2022 ఆసియా కప్ జరిగిన సెప్టెంబరు మాసంలో, 2014 ఐపీఎల్ జరిగిన ఏప్రిల్ నెలలో అంతే వేడిగా ఉంది. కానీ అప్పుడు వారికి అనిపించలేదు. క్రీడపై రాజకీయాలు అనేవి క్షమించరానిది.. !" అని పీసీబీ ఛైర్మన్.. జై షా టార్గెట్ గా విమర్శలు గుప్పించారు.