ఇండియా - పాక్ మ్యాచ్ రద్దు.. సూపర్ -4కు అర్హత సాధించిన పాకిస్తాన్

ఇండియా - పాక్ మ్యాచ్ రద్దు.. సూపర్ -4కు అర్హత సాధించిన పాకిస్తాన్

ఆసియా కప్ 2023లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ వర్షార్పణం అయ్యింది. వరుణుడు ఎంతకీ శాంతించకపోగా.. మ్యాచ్ కొనసాగించే అవకాశం లేకపోవడంతో ఫీల్డ్ అంపైర్లు.. మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. ఇప్పటికే నేపాల్ పై విజయం సాధించి ఉండటంతో పాకిస్తాన్ జట్టు సూపర్-4కు అర్హత సాధించింది. 

మ్యాచ్ ఆరంభం నుంచి పలుమార్లు అంతరాయం కలిగించిన వర్షం.. భారత ఇన్నింగ్స్ ముగిశాక మరోసారి ఎంట్రీ ఇచ్చింది. ఆపై ఎంతకూ తగ్గకపోగా.. వర్షపు నీటితో మైదానం చెరువును తలపించింది. హైవోల్టేజ్ మ్యాచ్ కావడంతో మైదాన్ సిబ్బంది అన్ని విధాలా ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. వరుణుడు మ్యాచ్ జరగనివ్వమని మొండికేయడంతో.. అంపైర్లకు రద్దు చేయడం తప్ప మరో మార్గం కనిపించలేదు. ఇరు జట్ల కెప్టెన్లతో చర్చించిన అంపైర్లు.. మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో అభిమానులు.. నిరాశతో వెనుదిరిగారు.

సూపర్-4కు అర్హత సాధించిన పాక్

ఇప్పటికే నేపాల్ పై విజయం సాధించి ఉన్నందున పాకిస్తాన్ సూపర్-4కు అర్హత సాధించింది. సోమవారం(సెప్టెంబర్ 4)న నేపాల్ తో జరిగే మ్యాచ్ లో టీమిండియా విజయం సాధిస్తే.. సూపర్-4కు చేరుతుంది. ఈ మ్యాచ్ కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది.

కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 266 పరుగులు చేసిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ 11, విరాట్ కోహ్లీ 4, శ్రేయస్ అయ్యర్ 14, శుభ్ మన్ గిల్ 10లు విఫలమైనా.. ఇషాన్ కిషాన్(82), హార్దిక్ పాండ్యా(87)లు టీమిండియా ఇన్నింగ్స్ చక్కదిద్దారు. పాక్ బౌలర్లలోషాహీన్ ఆఫ్రిది 4, హారిస్ రౌఫ్ 3, నసీం షా 3 వికెట్లు తీసుకున్నారు.