ఆ ఒక్క తప్పు వల్లే బతికారు.. లేదంటే భారత్ 200లోపే ఆలౌట్ అయ్యేది: షోయబ్ అక్తర్

ఆ ఒక్క తప్పు వల్లే బతికారు.. లేదంటే భారత్ 200లోపే ఆలౌట్ అయ్యేది: షోయబ్ అక్తర్

ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ ముగిసి 24 గంటలు గడిచినా.. దీనిపై విశేషణలు, ఆరోపణలు మాత్రం తగ్గడం లేదు. తాను చెప్పినట్లు  ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) వినకపోవడం వల్లే మ్యాచ్ రద్దయ్యిందని ఇప్పటికే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ ఛైర్మన్ నజం సేథీ వ్యాఖ్యానించారు. తాజాగా ఆ జట్టు మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్.. తన యూట్యూబ్ ఛానల్ ముందు కూర్చొని మరో కొత్త వాదన మొదలుపెట్టాడు.     

పాకిస్తాన్  పేసర్లపై ప్రశంసలు కురిపించిన ఈ మాజీ మాజీ పేసర్.. షాహీన్ అఫ్రిది ప్రస్తుత ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడని కొనియాడాడు. షాహీన్‌ను ఎదుర్కోవడానికి రోహిత్ శర్మ వద్ద ఎలాంటి క్లూ లేదని చెప్పుకొచ్చాడు. అయితే, పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ఒక పొరపాటు చేశాడని.. అందువల్లే భారత్ 266 పరుగులు చేసి కోలుకుందని తెలిపాడు. అలా కాకుండా బాబర్ ఆ ఒక్క పొరపాటు చేయకపోయుంటే.. 170 నుంచి 200 పరుగుల లోపే భారత్ ఆలౌట్ అయ్యేదని జ్యోతిష్యం చెప్పాడు.


ఈ మ్యాచ్‌లో ఎవరిది పైచేయి అన్న విషయమై తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన అక్తర్.. భారత జట్టును 200 పరుగుల లోపే కట్టడి చేయాల్సి ఉండాల్సింది అని పేర్కొన్నాడు. "మొదట్లోనే నాలుగు వికెట్లు తీసినప్పుడు వారిని అన్ని పరుగులు చేయనివ్వాల్సింది కాదు. 40వ ఓవర్లలోపే వారిని ఆలౌట్ చేసి ఉండాలి. అలా చేసుంటే భారత క్రికెటర్ల నైతిక స్థైర్యం పడిపోయేది..  170 నుంచి 200కి పరిమితం అయ్యేవారు.. (अगर पाकिस्तान थोड़ा और आक्रामक रूप से आता ऊपर, भारत 170 से नीचे भी आउट हो सकता था, 200 से नीचे भी आउट हो सकता था। बड़ा गंदा मनोबल गिरता इंडिया का) .." అని అక్తర్ తెలిపాడు.

బాబర్ చేసిన పొరపాటు ఏంటంటే..?

"నాలుగు వికెట్లు పేసర్లకు పడినప్పుడు.. మధ్యలో స్పిన్నర్లచే 15-17 ఓవర్లు వేపించడం నేను సరైనది కాదు. ప్రత్యర్థి జట్టుపై అదే దాడి ఎప్పుడూ కొనసాగుతూనే ఉండాలి. మీకు వికెట్లు కావాలి.. ఆ పరిస్థితిలో మీరు డిఫెండ్ చేయడం లేదు కదా! స్పిన్ బౌలర్ల స్పెల్‌ల మధ్యలో పేసర్లతో రెండు ఓవర్ల స్పెల్‌ వేపించాల్సి ఉండేది.. ఇది బాబర్ చేసిన పొరపాటు అని నేను అనుకుంటున్నా.." అని అక్తర్ చెప్పుకొచ్చాడు.

అక్తర్ విశ్లేషణపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 170 నుంచి 200 పరుగుల లోపే భారత్ ఆలౌట్ అయ్యేదని అతడన్న మాటలు వెనక్కు తీసుకోవాలని బుద్ధి చెప్తున్నారు.