రిట్ పిటిషన్ కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు.. వినేశ్ ఫొగాట్​, బజరంగ్​ పునియాకు గ్రీన్ సిగ్నల్

రిట్ పిటిషన్ కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు.. వినేశ్ ఫొగాట్​, బజరంగ్​ పునియాకు గ్రీన్ సిగ్నల్

భారత స్టార్​ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్​, బజరంగ్ పునియా సెలక్షన్​ ట్రయల్స్​లో పాల్గొనకుండానే ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశం లభించిన సంగతి తెలిసిందే. చైనాలోని హాంగ్జౌ వేదికగా జరగనున్న ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు వీరిద్దరూ నేరుగా వెళ్లనున్నట్లు భారత ఒలింపిక్ సంఘం అడ్​హక్ కమిటీ తెలిపింది. అయితే ఈ మినహాయింపును వ్యతిరేకిస్తూ అండర్ 20 ప్రపంచ ఛాంపియన్ ఆంటిమ్ పంఘల్, అండర్ 23 ఆసియా ఛాంపియన్ సుజీత్ కల్కల్ ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 

ఏడాది పాటు ఏ అంతర్జాతీయ ఈవెంట్‌లోనూ పాల్గొనని రెజ్లర్లకు సెలక్షన్​ ట్రయల్స్ నుండి మినహాయింపు ఇవ్వడం అన్యాయమని వారు రిట్ పిటిషన్ లో పొందపరిచారు. దీనిపై న్యాయపరమైన విచారణ కావాలని, ఆసియా క్రీడలకు ఎంపిక ప్రక్రియ న్యాయబద్ధంగా జరగాలని వారు కోర్టును కోరారు. అయితే ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం అందుకు నిరాకరించటం గమనార్హం. ఈ విషయంపై జోక్యం చేసుకోలేమని జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ బెంచ్ తీర్పిచ్చినట్లు పీటీఐ వెల్లడించింది.

మరోవైపు రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌కు జాతీయ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ(నాడా) ఇటీవల నోటీసులు జారీ చేసింది. డోపింగ్‌ నిరోధక నిబంధనలను పాటించనందుకు గానూ ఆమెకు ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది. దీనిపై స్పందించేందుకు నాడా.. ఆమెకు రెండు వారాల గడువిచ్చింది.