గంజాయి సాగు చేస్తే పథకాలు బంద్.. అమలు చేయాలని ప్రభుత్వానికి ఎస్పీ సిఫార్సు

గంజాయి సాగు చేస్తే పథకాలు బంద్.. అమలు చేయాలని ప్రభుత్వానికి ఎస్పీ సిఫార్సు
  • అమలు చేయాలని ప్రభుత్వానికి ఎస్పీ సిఫార్సు
  • ఏజెన్సీలో విచ్చలవిడిగా సాగు
  • కేసులు పెడుతున్నా ఆగని వైనం

ఆసిఫాబాద్, వెలుగు: డ్రగ్స్​ను కట్టడించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా దందా మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా గంజాయి పండించినా, అమ్మినా చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఏజెన్సీ కేంద్రాలుగా పండిస్తూనే ఉన్నారు. అంతర పంటగా విచ్చలవిడిగా సాగు చేస్తున్నారు. కేసులు పెట్టినా మారడం లేదు. గంజాయి రవాణా చేస్తూ తనిఖీల్లో దొరికిపోతున్న ఘటనలు నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నారు. 

ఎలాంటి చర్యలు చేపట్టినా పూర్తిస్థాయిలో ఫలితం లేకపోతుండడంతో మరింత కఠినంగా వ్యవహరించాలని పోలీసులు భావిస్తున్నారు. గంజాయి సాగు చేస్తూ పట్టుబడితే కేసుల నమోదుతో పాటు రైతు భరోసా తదితర పథకాలు నిలిపివేయాలని ఆసిఫాబాద్ ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. సంక్షేమ పథకాలు నిలిపివేస్తేనైనా గంజాయి దందా ఆగుతుందని పోలీసులు భావిస్తున్నారు. 

గిరిజనుల భూముల్లో వ్యాపారుల సాగు

ఆసిఫాబాద్​జిల్లాలో గంజాయి దందా విచ్చలవిడిగా సాగుతోంది. కొందరు స్మగ్లర్లు అటవీ ప్రాంతాలకు దగ్గర ఉన్న గిరిజనుల భూములను కౌలుకు తీసుకుని గంజాయి పండిస్తున్నారు. పత్తి, మిర్చి, జొన్న, బంతి తోటలు వేస్తూ గుట్టుచప్పుడుగా గంజాయిని అంతర పంటగా సాగుచేస్తున్నారు. ఆసిఫాబాద్, కెరమెరి, జైనుర్, సిర్పూర్ యు, తిర్యాణి, వాంకిడి, కాగజ్ నగర్ పట్టణంలో ఇండ్లలోనూ పండిస్తున్నారు. తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని ఈ దందా చేస్తున్నారు. పంట చేతికొచ్చిన తర్వాత ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, హైదరాబాద్, మహరాష్ట్రకు తరలించి రూ.కోట్లలో సొమ్ము చేసుకుంటున్నారు.

జిల్లాలో ఇప్పటివరకు 51 కేసులు

ఆసిఫాబాద్ జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు పోలీసులు 51 కేసులు నమోదు చేసి, 95 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. రూ.3,63 లక్షల విలువలు చేసే 14.767 కిలోల డ్రై గంజాయి, రూ.47.20 లక్షల విలువైన 472 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు.
 
 కెరమెరి మండలం ఇందాపూర్​లో పత్తి పంటలో గంజాయి మొక్కలు సాగు చేస్తున్న వడై పోశెట్టి అనే వ్యక్తిపై సెప్టెంబర్ 23న పోలీసులు కేసు నమోదు చేశారు. పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేసి మొత్తం 130 గంజాయి మొక్కలను గుర్తించారు. మొక్కలను ఎస్సై మధుకర్ ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
  
ఈనెల 5న సిర్పూర్ (యు) మండలం కోహినూర్ (కె) గ్రామంలో వ్యవసాయ భూమిలో గంజాయి మొక్కలు సాగు చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 10 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.జైనూర్ మండలం డబ్బోలి గ్రామ పంచాయతీ లోని శేకుగూడ శివారులో గంజాయి  సాగు చేస్తున్న రైతు మెస్రం సోమును సెప్టెంబర్​ 28న టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

10 మొక్కలు స్వాధీనం చేసుకున్నారు.

కెరమెరి మండలం పార్డిలో ఈ ఏడాది ఏప్రిల్ 22న గంజాయి విక్రయిస్తున్న మడావి శ్యామ్ రావును టాస్క్​ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అతడి ఇంట్లో తనిఖీలు చేయగా రూ.25 వేల విలువైన 750 గ్రాముల డ్రై గంజాయి పట్టుబడింది.మహారాష్ట్రలోని ముల్చేర గ్రామానికి చెందిన అంతర్రాష్ట్ర గంజాయి వ్యాపారి శేఖర్ పొద్దార్‌ను ఆగస్టు 12న ఈస్ గాం పోలీసులు అరెస్ట్ చేశారు. కాగజ్‌నగర్ రూరల్, ఈస్​గాం పోలీస్ పరిధిలో అనేక గంజాయి కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 

గంజాయి సాగు చేస్తే రైతు భరోసా బంద్

గంజాయి పండించే వారికి రైతు భరోసా పథకం నిలిపివేయాలని సంబంధిత అధికారులకు సిఫార్సు చేశాం. జిల్లాలో గంజాయి, డ్రగ్స్​ను పూర్తిగా నిర్మూలించే దిశగా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. గంజాయి పండించినా, అమ్మినా, తాగినా, వ్యాపారం చేసినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. 

గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. అవేర్నెస్ కల్పిస్తున్నాం. ప్రజలు, ముఖ్యంగా యువత మత్తుకు దూరంగా ఉండాలి. గంజాయి, డ్రగ్స్ సరఫరా, వినియోగంపై సమాచారం తెలిసిన వారు 8712670551, డయల్ 100కు తెలియజేయాలి. – కాంతిలాల్ పాటిల్, ఎస్పీ, ఆసిఫాబాద్