లక్సెట్టిపేట మార్కెట్  చైర్మన్ గిరీ కోసం ఆశావాహుల ఎదురుచూపు

లక్సెట్టిపేట మార్కెట్  చైర్మన్ గిరీ కోసం ఆశావాహుల ఎదురుచూపు
  • గత నెల ముగిసిన పాలకవర్గం పదవీకాలం 

లక్సెట్టిపేట, వెలుగు: లక్సెట్టిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం పదవీకాలం గత నెలలో ముగియడంతో కొత్త చైర్మన్ కోసం ఆశావాహుల్లో ఆశలు చిగురించాయి. లక్సెట్టిపేట, దండేపల్లి మండలాలకు చెందిన పలువురు లీడర్లు చైర్మన్ పీఠం కోసం పావులు కదుపుతున్నారు. చైర్మన్ పదవి ఒకసారి లక్సెట్టిపేటకు ఇస్తే మరోసారి దండేపల్లికి ఇచ్చే సంప్రదాయం ఇన్నేళ్లుగా కొనసాగుతోంది. గత రెండు పర్యాయాలు కొన్ని అనివార్య కారణాల వల్ల లక్సెట్టిపేటకు దక్కింది. దీంతో ఈసారి దండేపల్లి మండలానికి కేటాయించాలని లీడర్లు పట్టుబడుతున్నట్టు సమాచారం. లక్సెట్టిపేటకు చైర్మన్ పదవి ఇస్తే దండేపల్లికి వైస్ చైర్మన్ పదవి, అలాగే దండేపల్లికి చైర్మన్ పదవి ఇస్తే, లక్సెట్టిపేటకు వైస్ చైర్మన్ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి అదే సంప్రదాయం కొనసాగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లక్సెట్టిపేటకు రెండు పర్యాయాలు చైర్మన్ పీఠం దక్కడంతో ఈసారి దండేపల్లి నాయకులు చైర్మన్ పదవి తమకే వస్తుందని నమ్మకంతో ఉన్నప్పటికీ చివరి క్షణంలో  రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈసారి కూడా లక్సెట్టిపేటకు చైర్మన్ పదవి ఇచ్చి దండేపల్లి మండలం నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆకుల రాజేందర్​కు వైస్ చైర్మన్ పదవి కట్టబెడతారని వాదన వినిపిస్తోంది. ఒకవేళ దండేపల్లి మండలానికి చైర్మన్ పదవి ఇస్తే వైస్ చైర్మన్ పదవి ఎవరికి ఇస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. దండేపల్లి మండలంలో బీఆర్​ఎస్​ పార్టీ పట్టుకోల్పోతుండడంతో ఈసారి ఎమ్మెల్యే దివాకర్​రావు మండలంలో పూర్తిస్థాయిలో పట్టు సాధించడానికి, అలాగే లక్సెట్టిపేటలో కూడా తమదైన ముద్ర వేసుకోవడానికి రెండు మండలాల నుంచి అనువైన నాయకులకు పదవులు కట్టబెడతారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  

ఆశావహులు వీరే...  

మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఈసారి ఎస్సీ జనరల్ అయింది. లక్సెట్టిపేట మండలంలోని ఇటిక్యాలకు చెందిన అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు దొంతు నర్సయ్య, అదే గ్రామ మాజీ సర్పంచ్ తొగరు కాంతయ్య, గుల్లకోటకు చెందిన అవనూరి సత్తయ్య చైర్మన్ పీఠం కోసం పైరవీలు సాగిస్తున్నారు. అలాగే దండేపల్లి మండలం నుంచి మాజీ ఎంపీపీ భర్త గోళ్ల రాజమల్లు, కన్నెపల్లి మాజీ సర్పంచ్ మగ్గిడి శ్రీనివాస్, గూడెం గ్రామానికి చెందిన దమ్మ సృజన్, బాపు ఎవరికి వారు ధీమాతో తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.