డబ్బుల కోసం భార్యను చంపిండు...మంచిర్యాల జిల్లా జైపూర్‌‌‌‌ మండలంలో దారుణం

డబ్బుల కోసం భార్యను చంపిండు...మంచిర్యాల జిల్లా జైపూర్‌‌‌‌ మండలంలో దారుణం

జైపూర్, వెలుగు : మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి డబ్బుల కోసం భార్యను హత్య చేశాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని నర్వ గ్రామంలో ఆదివారం జరిగింది. ఎస్సై శ్రీధర్‌‌‌‌ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన గోదారి రాజమణి (48) అంగన్‌‌‌‌వాడీ టీచర్‌‌‌‌గా పనిచేస్తుండగా.. ఆమె భర్త రాజయ్య సింగరేణి కార్మికుడిగా పనిచేసి నాలుగేండ్ల కింద రిటైర్‌‌‌‌ అయ్యాడు. 

మద్యానికి బానిసైన రాజయ్య తన పెన్షన్‌‌‌‌ డబ్బులను ఖర్చు చేసుకోవడంతో పాటు రాజమణి జీతం డబ్బులను సైతం అడిగేవాడు. ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇదే విషయంలో ఆదివారం తెల్లవారుజామున సైతం ఇద్దరూ గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన రాజయ్య కర్రతో రాజమణి తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. 

గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్‌‌‌‌ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతురాలి కూతురు పూజిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.