వారికి టికెట్  ఇద్దామా? ..అభ్యర్థులపై పీసీసీ చీఫ్​ రేవంత్​ సర్వే!

వారికి టికెట్  ఇద్దామా? ..అభ్యర్థులపై పీసీసీ చీఫ్​ రేవంత్​ సర్వే!

హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందుకు కాంగ్రెస్​ పార్టీ కూడా మినహాయింపేమీ కాదు. ఎక్కడ మీటింగ్​ పెట్టినా, ఎక్కడికెళ్లినా ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సేనని పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి సహా ఆ పార్టీ నేతలంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే అన్ని నియోజకవర్గాల్లో ఆశావహులు ఎక్కువ సంఖ్యలో పోటీలో ఉన్నారు. ఎవరికి వారు తమకే టికెట్  వస్తుందని ఆశిస్తున్నారు. కొందరు నేతలు బహిరంగంగా ప్రకటనలూ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టికెట్​ ఎవరికివ్వాలనే దానిపై ఇప్పటికే రేవంత్​ కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తున్నది. టికెట్​ ఆశిస్తున్న వారిపై అన్ని నియోజకవర్గాల్లో ఆయన సొంతంగా సర్వేలు చేయిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సునీల్​ కనుగోలు టీం.. కాంగ్రెస్​ కోసం పనిచేస్తున్నా, అభ్యర్థులపై రేవంత్  పర్సనల్​గా సర్వే చేయిస్తున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 

బలమైన అభ్యర్థుల గురించి ఆయన సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తున్నది. నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురు వ్యక్తులను నియమించి అభ్యర్థుల స్థితిగతులపై ఆరా తీయిస్తున్నారని సమాచారం. రేవంత్  నియమించిన వ్యక్తులు.. టికెట్​ ఆశిస్తున్న వాళ్ల దగ్గరకు వెళ్లి మీకు టికెట్​ ఎందుకివ్వాలి? గతంలో పోటీచేసిన సందర్భాలు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? లేదా? వంటి విషయాలను అడిగి తెలుసుకుంటున్నట్లు సమాచారం. టికెట్​ ఇస్తే ఎన్నికల ఖర్చు పెట్టుకోగలరా?  రెబల్​ అభ్యర్థులు ఎవరైనా ఉన్నారా? వంటి వివరాలు కూడా ఆరాతీస్తున్నారని తెలుస్తోంది. 

డీకే శివకుమార్​ స్ఫూర్తితోనే

కర్నాటక పీసీసీ చీఫ్  డీకే శివకుమార్​ స్ఫూర్తితోనే రేవంత్​ కూడా సర్వేలు చేయిస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. డీకే డిజైన్​బాక్స్​ అనే సొంత సంస్థ ద్వారా రాష్ట్రంలో పార్టీ తీరుపై సర్వే చేయించుకుంటున్నారు. అలాగే రేవంత్​ కూడా తన సొంతంగా సర్వేలు చేయించుకుంటూ అభ్యర్థుల గెలుపోటములు, కాంగ్రెస్​ పార్టీ ప్రభావాన్ని అంచనా వేసుకుంటున్నారు. మరోవైపు వచ్చే నెలలో కాంగ్రెస్​ తరఫున కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు రేవంత్​ అక్కడకు వెళ్లనున్నారు. అక్కడ కాంగ్రెస్​ గెలిస్తే.. ఆ ప్రభావం తెలంగాణలోనూ ఉంటుందని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడి సరిహద్దు జిల్లాల్లో రేవంత్​ ప్రచారం చేస్తే.. అక్కడున్న తెలుగు వారి ఓట్లు కాంగ్రెస్​కు పడతాయన్న ఆలోచనలో ఆ రాష్ట్ర నేతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రజాభిప్రాయ సేకరణ కూడా..

నేతలను నేరుగా సర్వే చేయడంతో పాటు వారికి ప్రజల్లో ఉన్న ఆదరణ గురించి కూడా రేవంత్​  తన సర్వేల ద్వారా తెలుసుకుంటున్నారని కాంగ్రెస్​ వర్గాలు చెప్పాయి. టికెట్​ ఆశిస్తున్న అభ్యర్థులపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని తెప్పించుకుంటున్నారని హైదరాబాద్​లోని ఓ నియోజకవర్గం నుంచి టికెట్​ ఆశిస్తున్న ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు తెలిపారు. కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపించినా.. మళ్లీ పార్టీ మారతారన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని ప్రచారం జరుగుతున్నది. ఇకపై అలా జరగకుండా ఉండేందుకు రేవంత్​ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే పార్టీ మారిన నేతలపై కోర్టులో కేసు కూడా వేశారు. పదవికి రాజీనామా చేయకుండా వేరే పార్టీలో చేరిన వారిపై లీగల్​ ఫైట్​ చేస్తున్నారు.