రోశయ్య ప్రసంగాలు కొత్త ఎమ్మెల్యేలకు పుస్తకం లాంటివి : స్పీకర్ గడ్డం ప్రసాద్

రోశయ్య ప్రసంగాలు కొత్త ఎమ్మెల్యేలకు పుస్తకం లాంటివి : స్పీకర్ గడ్డం ప్రసాద్
  • ఆర్థిక మంత్రిగా ఆయన సేవలు భేష్: స్పీకర్ గడ్డం ప్రసాద్

బషీర్​బాగ్, వెలుగు: కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు మాజీ సీఎం రోశయ్య ప్రసంగాలు.. ఒక పుస్తకం లాంటివని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. రోశయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం సంతోషంగా ఉందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం భాష సాంస్కృతిక శాఖ, కొణిజేటి రోశయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రోశయ్య 92వ జయంతి సభ హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించారు. 

ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడారు. రోశయ్య విగ్రహావిష్కరణ.. ఆయన గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేస్తుందన్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రిగా అత్యధికంగా 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత బహుశా రోశయ్యకే దక్కుతుందని తెలిపారు. అనంతరం ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావును అతిథులు సన్మానించారు. ఈ కార్యక్రమానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.