కొవిషీల్డ్​తో బ్లడ్​క్లాట్ .. యూకే కోర్టులో అంగీకరించిన ఆస్ట్రాజెనికా

కొవిషీల్డ్​తో బ్లడ్​క్లాట్ .. యూకే కోర్టులో అంగీకరించిన ఆస్ట్రాజెనికా

లండన్​: యూకేకు చెందిన ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనికా తయారు చేసిన కొవిడ్​–19 టీకా (కొవిషీల్డ్​)తో కొన్ని సైడ్​ ఎఫెక్ట్స్​ ఉన్నాయని ఆ కంపెనీ అంగీకరించింది. తమ టీకాతో అరుదైన సందర్భాల్లో బ్లడ్​ క్లాట్​ (రక్తం గడ్డకట్టడం), ప్లేట్​లెట్​ కౌంట్​ పడిపోయేందుకు కారణమవుతున్నదని యూకే కోర్టుకు తెలిపింది. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్​ అనేక సందర్భాల్లో మరణానికి, తీవ్రగాయాలకు కారణమైందని 51 మంది బాధితులు కోర్టును ఆశ్రయించారు. కంపెనీపై క్లాస్​ యాక్షన్​ దావా వేశారు. ఇందులో టీకా వల్ల మరణించిన 12 మంది కుటుంబ సభ్యులున్నారు. వారు డెత్​ సర్టిఫికెట్​, చికిత్సకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించారు. కంపెనీ నుంచి నష్టపరిహారం కోరారు. . 

మొదట వ్యతిరేకించిన ఆస్ట్రాజెనికా

ప్రారంభంలో ఆస్ట్రాజెనికా కంపెనీ ఈ క్లెయిమ్​లను వ్యతిరేకించింది. తమ టీకాపై విస్తృతమైన క్లినికల్​ ట్రయల్స్​ నిర్వహించామని, ఇది సురక్షితమని వాదించింది. అయితే, కొవిషీల్డ్ అరుదైన సందర్భాల్లో.. టీటీఎస్​(థ్రాంబోసిస్ విత్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్) రక్తం గడ్డకట్టడం, బ్లడ్ ప్లేట్‌లెట్ కౌంట్‌పడిపోవడానికి కారణమవుతున్నదని అంగీకరించింది. 

కాగా, కొవిషీల్డ్​పై దాఖలైన ఫిర్యాదులన్నింటినీ కలపాలని బాధితులు కోరడంతో లండన్​ హైకోర్టులో ఈ కేసుపై విచారణ  ఈ ఏడాది చివరలో చేపట్టనున్నారు. కరోనా వైరస్​విజృంభిస్తున్న సమయంలో యూకేకు చెందిన ఆస్ట్రాజెనికా కంపెనీ..  ప్రఖ్యాత ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ సహకారంతో కొవిడ్​–19 టీకాను తయారుచేసింది. ఈ వ్యాక్సిన్​ను భారత్​లోని పుణెకు చెందిన సీరమ్​ ఇన్​స్టిట్యూట్​ఆఫ్​ ఇండియా (ఎస్ఐఐ) కొవిషీల్డ్​ పేరుతో ఉత్పత్తి చేసింది.