అశ్వారావుపేట: విద్య, వైద్యం అందించడమే లక్ష్యం

అశ్వారావుపేట: విద్య, వైద్యం అందించడమే లక్ష్యం

అశ్వారావుపేట, వెలుగు: నియోజకవర్గ వ్యాప్తంగా విద్య, వైద్యం, మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నారన్నారు. 3 వేల మంది గిరిజన యువతి, యువకులకు వృత్తి నైపుణ్యాలపై శిక్షణ తరగతులను స్థానిక గిరిజన భవన్ లో ఏర్పాటు చేశామని చెప్పారు. మూడు నెలల్లో 100 పడకల ఆస్పత్రి ప్రారంభించబోతున్నామని తెలిపారు. దీనికి అనుసంధానంగా మెడికల్ కాలేజీ శాంక్షన్ కోసం ప్రతిపాదనలు పంపామని, నర్సింగ్ కాలేజ్ శాంక్షన్ అయిందని వివరించారు. హార్టికల్చర్ కాలేజ్ నూతన భవనాలను కట్టబోతున్నామని, ఈ ఏడాది కాలేజీ నిర్వహణకు హెచ్ఆర్ఎస్ భవనాలను కేటాయించినట్లు చెప్పారు. 

అచ్చుతాపురం అటవీ రిసెప్ట్ సెంటర్ 35 ఏండ్ల తర్వాత తిరిగి ప్రారంభించామన్నారు. అర్బన్ పార్క్ 120 ఎకరాల్లో ఏర్పాటు చేయబోతున్నామని ఇప్పటికే శంకుస్థాపన చేశామన్నారు. ఈనెల 18, 19 తేదీల్లో ఎకో పార్క్ ఉన్నతాధికారులు రాబోతున్నారని వారితో చర్చలు జరిపి పార్కు రూపకల్పనలను చేయబోతున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో చేపట్టనున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు. ప్రెస్​మీట్​లో ఆత్మ కమిటీ చైర్మన్ సుంకపల్లి వీరభద్రరావు, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు, తుమ్మ రాంబాబు, చిన్నంశెట్టి సత్యనారాయణ, తాడేపల్లి రవి, విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.