అహ్మదాబాద్: వైద్య వృత్తిలో కొనసాగుతూ ఆ వృత్తికే కళంకం తెచ్చేలా ఒక యువ వైద్యురాలు ప్రవర్తించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గుజరాత్లోని అహ్మదాబాద్ సోలా సివిల్ హాస్పిటల్లో ఈ ఘటన జరిగింది. అక్టోబర్ 26న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. అసలేం జరిగిందంటే.. అక్టోబర్ 26న ఆషిక్ హరీబాయ్ చౌడ అనే వ్యక్తి తన కూతురు అనారోగ్యంతో బాధపడుతుండటంతో అహ్మదాబాద్ సోలా సివిల్ హాస్పిటల్కు తీసుకొచ్చాడు.
ఆ సమయంలో డ్యూటీలో ఉన్న ఒక యువ వైద్యురాలు అతని కూతురికి చికిత్స చేసేందుకు నిరాకరించింది. ఎందుకని అడిగితే.. తనతో అమర్యాదగా ప్రవర్తించావని అతనిపై చిందులేసింది. కోపంతో ఊగిపోతూ అతనిపై దాడి చేసింది. చెంపదెబ్బ కొట్టింది. అడ్డుకోబోయిన సెక్యూరిటీ గార్డును ఇది నీకు సంబంధం లేని విషయం అని తీసి పడేసింది. నీ కూతురికి వైద్యం చేయనంటే చేయనని సదరు లేడీ డాక్టర్ తెగేసి చెప్పింది.
ఆమెతో ఏం తప్పుగా ప్రవర్తించానో చెప్పాలని హరీబాయ్ అడిగినా ఆ వైద్యురాలు కస్సుబుస్సులాడిందే తప్ప ఏం తప్పుగా అతను ప్రవర్తించాడో చెప్పలేదు. ఈ ఘటనను అక్కడున్న కొందరు వీడియో తీసి ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేయడంతో నెట్టింట తీవ్ర చర్చ నడుస్తోంది. కొందరు ఆ యువ వైద్యురాలిని తప్పుబడుతుంటే.. మరికొందరు కేవలం ఒకరి వెర్షన్ చూసి ఆమెదే తప్పని డిసైడ్ చేయడం కరెక్ట్ కాదని వాదిస్తున్నారు.
ఆ వీడియో చూస్తుంటే.. రియాక్షన్ వీడియోలా ఉందని.. అతను ఆమెతో ఎలా ప్రవర్తించాడో తెలియకుండా ఆమెదే తప్పు అని నిర్ధారించడం సమంజసం కాదని కొందరు నెటిజన్లు స్పందించారు. ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ కావడంతో అహ్మదాబాద్ పోలీసులు ఈ ఘటనపై స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు అందితే విచారణ జరుపుతామని తెలిపారు.
वायरल वीडियो अहमदाबाद के सोला सिविल अस्पताल का बताया जा रहा है यहां एक महिला डॉक्टर ने अपनी बेटी के इलाज के लिए व्यक्ति पर हाथ उठा दिया और इलाज करने से मना कर दिया। डॉक्टर के रवैये और चेहरे के हावभाव से घमंड साफ झलकता है। pic.twitter.com/ksc6Z98hs2
— Ilyas (@Ilyas_SK_31) October 27, 2025
