ట్రాక్​ మారుతుంటే ఢీ కొట్టింది

ట్రాక్​ మారుతుంటే ఢీ కొట్టింది
  • ఢాకాలో ఘోర రైలు ప్రమాదం
  • 16 మంది మృతి.. 60 మందికి గాయాలు

ఢాకా: సెంట్రల్​ బంగ్లాదేశ్​లోని బ్రహ్మంబారియ జిల్లాలో మంగళవారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీ కొనడంతో కొన్ని బోగీలు  నుజ్జునుజ్జయ్యాయి. అందులో చిక్కుకుని 16 మంది చనిపోగా.. మరో 60 మంది గాయపడ్డారు. కొందరి కండీషన్​ సీరియస్​గా ఉండడంతో మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు చెప్పారు. రైలు డ్రైవర్లు సిగ్నల్స్​ను పట్టించుకోకుండా ముందుకెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తేల్చారు. ఈ యాక్సిడెంట్​ నేపథ్యంలో ఢాకా–ఛట్టోగ్రామ్, ఢాకా–నోఖాలి, ఛట్టోగ్రామ్–సిల్హెట్​ మధ్య నడిచే పలు రైళ్లను రద్దు చేశారు. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం వివరాలను రైల్వే అధికార ప్రతినిధి వెల్లడించారు.. మండోభాగ్​ స్టేషన్‌లో ఉదయన్​ ఎక్స్ ప్రెస్​ ట్రాక్​ మారుతుండగా.. ఢాకా నుంచి వస్తున్న టర్నా నిషిత ఎక్స్ ప్రెస్​ వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. దీంతో టర్నా నిషిత రైలుతో పాటు ఉదయన్​ ఎక్స్​ప్రెస్​ ఇంజన్, నాలుగు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇందులో చిక్కుకున్న ప్రయాణికులను రక్షించేందుకు రెస్క్యూ టీంలు తీవ్రంగా శ్రమించాయి. శిథిలాల్లో చిక్కుకున్న 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలైన మరో నలుగురు హాస్పిటల్‌కు తరలిస్తుండగా చనిపోయారు. ఈ యాక్సిడెంట్​లో గాయపడ్డ 60 మందిని దగ్గరలోని ఆస్పత్రులకు తరలించి, ట్రీట్​మెంట్​ ఇప్పిస్తున్నట్లు అధికారులు వివరించారు. బంగ్లాదేశ్​ రైల్వే మినిస్టర్​ నూరుల్​ ఇస్లాం సుజన్, రైల్వే సీనియర్​ అధికారులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. సిగ్నల్స్​ గమనించకపోవడమే ఈ ప్రమాదానికి కారణం అన్నారు.

డ్రైవర్లు, కండక్టర్ల సస్పెన్షన్

ఈ ప్రమాదానికి కారణమైన టర్నా నిషితా ట్రైన్​ డ్రైవర్లు, కండక్టర్లను ఇమ్మీడియెట్​గా సస్పెండ్​ చేసినట్లు రైల్వే ఉన్నతాధికారులు చెప్పారు. ప్రమాదానికి కారణాలు తెలుసుకోవడానికి వేర్వేరుగా నాలుగు కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించారు. ఇక, బ్రహ్మంబారియ జిల్లా యంత్రాంగం సెపరేట్​గా ఓ విచారణ కమిటీని నియమించింది.

ప్రెసిడెంట్ హమీద్‌, ప్రధాని షేక్‌ హసీనా సంతాపం

బంగ్లా ప్రెసిడెంట్​ అబ్దుల్​ హమీద్, ప్రధాని షేక్​ హసీనా, పార్లమెంటరీ స్పీకర్​ షిరిన్​ షర్మిన్​ చౌదరి ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. లోకోమోటివ్​ డ్రైవర్లకు సరైన శిక్షణ ఇవ్వాలని రైల్వే ఉన్నతాధికారులకు ప్రధాని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

 

At least 16 dead after two packed trains are ripped apart in crash