
- మృతుల్లో 10 మంది పిల్లలు, 17 మంది మహిళలు
- 46 మందికి గాయాలు.. 20 మంది పరిస్థితి సీరియస్
- ఆరు గంటలు ఆలస్యంగార్యాలీకి వచ్చిన విజయ్
- పర్మిషన్ 10 వేల మందికి.. గుమిగూడింది 50 వేలు
- గంటల తరబడి ఎండలోనే జనం.. సాయంత్రం రద్దీతో ఊపిరాడని పరిస్థితి
- దీనికితోడు తొక్కిసలాట జరగడంతో దారుణం
- సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి.. సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు
- ఘటనపై విచారణకు రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు
- విజయ్‌ని అరెస్టు చేయాలని డీఎంకే డిమాండ్
కరూర్: తమిళనాడులో ఘోరం జరిగింది. టీవీకే పార్టీ చీఫ్, సినీ నటుడు విజయ్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 38 మంది మృతి చెందారు. మరో 46 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించినవారిలో 10 మంది పిల్లలు, 17 మంది మహిళలు, 11 మంది పురుషులు ఉన్నారు. గాయపడినవారిలో 20 మంది పరిస్థితి సీరియస్ గా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళగ వెట్రి కళగం(టీవీకే) చీఫ్ విజయ్ రాష్ట్రవ్యాప్తంగా వరుసగా ఎన్నికల ప్రచార ర్యాలీలు నిర్వహిస్తున్నారు. శనివారం రాష్ట్రంలోని కరూర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీకి వేలాది మంది జనం రావడంతో తీవ్ర తొక్కిసలాటకు దారి తీసింది. తొక్కిసలాటలో గాయపడినవారిని కరూర్ జనరల్ హాస్పిటల్ కు తరలించారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువుల రోదనలతో హాస్పిటల్ పరిసరాల్లో విషాదం నెలకొంది.
సీఎం ఎంకే స్టాలిన్ ఆదేశాల మేరకు రాష్ట్ర హెల్త్ మినిస్టర్ ఎం. సుబ్రమణ్యన్ హుటాహుటిన కరూర్ కు చేరుకున్నారు. జిల్లా నేత, మాజీ మంత్రి వి. సెంథిల్ బాలాజీతో కలిసి హాస్పిటల్లో బాధితులను పరామర్శించారు. తాను కూడా శనివారం రాత్రే కరూర్‌కు చేరుకుని, పరిస్థితిని సమీక్షిస్తానని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు.
తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని ఆయన ప్రకటించారు. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ.లక్ష చొప్పున పరిహారం అందిస్తామన్నారు. కాగా, ఈ తొక్కిసలాట ఘటనపై విచారణ కోసం హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ అరుణ జగదీశన్ నేతృత్వంలో వన్ మెంబర్ కమిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
ర్యాలీ 6 గంటలు ఆలస్యం కావడంతో..
ర్యాలీ శనివారం మధ్యాహ్నం ప్రారంభం కావాల్సి ఉండగా, విజయ్ 6 గంటలు ఆలస్యంగా సాయంత్రం వచ్చారు. దీంతో గంటగంటకూ జనం రద్దీ పెరిగింది. సాయంత్రం విజయ్ వచ్చి ర్యాలీ ప్రారంభించే సమయానికే దాదాపు 30 వేల మంది జనం పోగయ్యారు. అయితే, మధ్యాహ్నం నుంచి జనం ఎండ వేడిలోనే ఉండటంతోపాటు రద్దీ పెరిగి ఊపిరాడని పరిస్థితి నెలకొంది. మరోవైపు విజయ్ తన క్యాంపెయిన్ బస్ పై నిలబడి మాట్లాడుతుండగా.. ఆయనను దగ్గర నుంచి చూసేందుకని జనం క్రమంగా బస్ వైపుగా రావడం ప్రారంభించారు.
ఈ సందర్భంగా కొందరు కిందపడిపోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. జనం ఎటువైపు వీలైతే అటువైపు పరిగెత్తేందుకు ప్రయత్నించడంతో తీవ్ర తొక్కిసలాటకు దారి తీసింది. దీంతో పిల్లలు, మహిళలు సహా అనేక మంది కిందపడిపోయారు. జనం ఎక్కువగా ఉండటంతో అంబులెన్స్‌లు వచ్చేందుకు సైతం దారి దొరకలేదు.
దీంతో గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జీ కూడా చేశారు. ఈ సందర్భంగా అంబులెన్స్‌లకు దారి ఇవ్వాలంటూ బస్ పైనుంచి విజయ్ సూచించడం వీడియోల్లో కనిపించింది. అలాగే తీవ్ర వేడితో ఊపిరాడక కొందరు స్పృహ తప్పి పడిపోవడంతో విజయ్ వాటర్ బాటిల్స్ విసిరేయడం కూడా కనిపించింది. కాగా, ఈ గందరగోళంలో 9 ఏండ్ల బాలిక మిస్ అయినట్టుగా అధికారులు తెలిపారు.
10 వేల మంది వస్తారని పర్మిషన్..
విజయ్ ర్యాలీకి 10 వేల మంది వరకూ వస్తారని అంచనా వేస్తున్నట్టుగా పర్మిషన్ కోసం పోలీసులకు ఇచ్చిన లెటర్లో పేర్కొన్నారు. కానీ 50 వేల మంది వరకూ వచ్చారని.. వారంతా 1.20 లక్షల చదరపు అడుగుల ప్రాంతంలోనే గుమిగూడటంతో ఈ ఘోరం జరిగినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ ఘటన తర్వాత ర్యాలీని ఆపేసిన విజయ్ తిరుచ్చి ఎయిర్ పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి ఫ్లైట్‌లో చెన్నైకి వెళ్లారు. ఎయిర్ పోర్టు వద్ద ఆయన మీడియాకు మొఖం చాటేశారు. కాగా, ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కేంద్ర హోం శాఖ ఆదేశించింది.
రెండు వారాల కింద తిరుచ్చిలోనూ..
విజయ్ ఈ నెల13న తిరుచ్చిలో నిర్వహించిన తొలి ర్యాలీ కూడా వివాదాస్పదం అయింది. తిరుచ్చి ర్యాలీ సందర్భంగా ఎయిర్ పోర్టు నుంచి సభా వేదిక వద్దకు విజయ్ కాన్వాయ్ కి ముందు, వెనక పార్టీ కార్యకర్తలు, జనం భారీగా పోగయ్యారు. దీంతో 20 నిమిషాల ప్రయాణం 6 గంటలు పట్టింది. దీనివల్ల ట్రాఫిక్ జామ్ తో సిటీ అంతా స్తంభించిపోయింది. దీంతో విజయ్ ర్యాలీలకు పోలీసులు 23 కండిషన్లు పెట్టారు. ఈ కండిషన్లను హైకోర్టులో టీవీకే సవాల్ చేయగా.. పబ్లిక్ సేఫ్టీకి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది. దీంతో ర్యాలీల్లో పాటించాల్సిన సేఫ్టీ, గైడ్ లైన్స్ పై కార్యకర్తలకు పార్టీ ఈ నెల 20న దిశానిర్దేశం చేసింది.
పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు విజయ్ ని ర్యాలీల్లో కలుసుకోవడం, రిసీవ్ చేసుకోవడం వంటివి చేయొద్దని, విజయ్ వెహికల్ ను లేదా కాన్వాయ్ ను ఫాలో కావద్దని చెప్పింది. అలాగే గర్భిణులు, పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు ర్యాలీలకు రావద్దని.. ఇంట్లో ఉండి లైవ్ లోనే చూడాలని కోరింది. కానీ ఇంతలోనే విజయ్ ర్యాలీలో ఈ ఘోరం జరిగిపోయింది. విజయ్ సైతం విజ్ఞప్తి చేసినా.. మహిళలు, గర్భిణులు, పిల్లలు, వృద్ధుల వంటి వారు లెక్కచేయకుండా ర్యాలీకి వచ్చారు. కొందరు మహిళలు చంటిపిల్లలను సైతం ఎత్తుకుని వచ్చారు. చివరకు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు.
విజయ్ను అరెస్ట్ చేయాలి: డీఎంకే డిమాండ్
టీవీకే పార్టీ నిర్లక్ష్యం వల్లే ఇంతమంది ప్రాణాలు కోల్పోయారని డీఎంకే పార్టీ ఆరోపించింది. ఈ ఘటనకు బాధ్యుడిగా విజయ్‌పై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. ర్యాలీకి విజయ్ కావాలనే ఆలస్యంగా వచ్చారని, రద్దీ పెరిగేంత వరకూ ఉద్దేశపూర్వకంగానే మధ్యాహ్నం నుంచీ గంటల తరబడి వెయిట్ చేయించారని డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ అన్నాదురై ఆరోపించారు. ర్యాలీలో రూల్స్‌ను కూడా విజయ్ ఫాలో కాలేదన్నారు. ‘‘తల్లిదండ్రులు తమ పిల్లలను ఎత్తుకుని ర్యాలీకి వచ్చారు. చనిపోయిన పిల్లల తల్లిదండ్రుల రోదనలు చూస్తుంటే హృదయం ద్రవిస్తోంది. ఈ దారుణానికి విజయ్ దే బాధ్యత. ఆయనను అరెస్ట్ చేయాలి” అని డిమాండ్ చేశారు.