కాంగ్రెస్ లేకుండా కూటమి అసాధ్యం : లాలూ

కాంగ్రెస్ లేకుండా కూటమి అసాధ్యం : లాలూ

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ భేటీ అయ్యారు. వీరి భేటీ సుదీర్ఘంగా సాగింది. వచ్చే సార్వత్రిక ఎన్నికలు, బీహార్ రాజకీయ పరిణామాలపై ఈసందర్భంగా ప్రధాన చర్చ జరిగినట్లు తెలుస్తోంది.  ఇటీవల నితీశ్ కుమార్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు గుడ్ బై చెప్పి.. లాలూ ప్రసాద్ యాదవ్ కు చెందిన ఆర్జేడీ పార్టీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈనేపథ్యంలో జరిగిన తాజా భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

సోనియా గాంధీతో సమావేశం అనంతరం నితీశ్,లాలూ ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ ఇద్దరం సోనియా గాంధీతో చర్చలు జరిపాం. అందరం కలిసికట్టుగా దేశాభివృద్ధికి పాటుపడాలి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలపై ప్రస్తుతం దృష్టిపెట్టానని, ఆ తర్వాత మాట్లాడతానని సోనియా మాతో చెప్పారు’’ అని వివరించారు.

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘ బీజేపీని పారదోలి దేశాన్ని రక్షించాలి. బీహార్‌లో  మాదిరిగా బీజేపీని తొలగించి మనమందరం ఏకతాటిపైకి రావాలి. ఇదే అంశంపై సోనియా గాంధీతో చర్చలు జరిపాం. 10-12 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసిన తర్వాత మళ్లీ కలవండని ఆమె కోరారు. బీజేపీపై పోరులో మేం ముందు వరుసలో ఉంటాం. కాంగ్రెస్ లేకుండా జాతీయ స్థాయిలో సంకీర్ణం అనేది సాధ్యం కాదు’’ అని చెప్పారు.