ఏటీఎంను కట్ ​చేసి రూ. 27 లక్షలు చోరీ

ఏటీఎంను కట్ ​చేసి రూ. 27 లక్షలు చోరీ
  •    మరో ఏటీఎంలోనూ దొంగతనానికి యత్నం 
  •     అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనిగా అనుమానం
  •     గోదావరిఖనిలో ఘటన

గోదావరిఖని,వెలుగు: పెద్దపల్లి జిల్లా రామ గుండం పారిశ్రామిక ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి రెండు ఏటీఎంలలో దొంగలు పడ్డారు. ఓ ఏటీఎంలో డబ్బు చోరీకి యత్నించి విఫలం కాగా, మరో ఏటీఎంలోని మెషీన్​ను గ్యాస్​ కట్టర్​తో కట్​చేసి రూ.27.75 లక్షలను ఎత్తుకెళ్లారు. దొంగల కోసం టీమ్​లుగా ఏర్పడిన పోలీసులు గాలిస్తున్నారు. గోదావరిఖని గంగానగర్​లోని ఎస్బీఐ ఏటీఎంలోకి శుక్రవారం అర్ధరాత్రి చొరబడిన దొంగలు మెషీన్​ను పగలగొట్టారు. అప్పుడే పోలీస్​సైరన్​మోగడంతో పరారయ్యారు.

గౌతమీనగర్​హన్​మాన్​టెంపుల్​సమీపంలోని ఎస్​బీఐకే చెందిన ఏటీఎంలోకి తెల్లవారుజామున1.30 గంటలకు ఓ దొంగ చొరబడి సీసీ కెమెరాపై స్ప్రే చేశాడు. తర్వాత మరికొందరు ప్రవేశించి ఏటీఎం షట్టర్​ను మూసివేశారు. తర్వాత గ్యాస్​ కట్టర్​తో మెషీన్​ను కట్​చేసి తొలగించారు. అందులో ఉన్న రూ.27,75,400 నగదుతో పరారయ్యారు.

చోరీ తర్వాత రోడ్లపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించగా ఓ కారు గోదావరినది బ్రిడ్జిపై నుంచి మంచిర్యాల వైపుకు వెళ్లినట్టు గుర్తించారు. ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనిగా భావిస్తున్నారు. గోదావరిఖని ఏసీపీ తులా శ్రీనివాసరావు నేతృత్వంలో ఇన్స్​పెక్టర్లతో మూడు టీమ్​లను ఏర్పాటు చేశారు. రెండు ఏటీఎంలలో చొరబడిన దొంగల టీమ్​ ఒక్కటేనా లేక వేర్వేరా అన్నది తేలాల్సి ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్​ తెలిపారు.