ప్లాన్ ప్రకారమే దాడి: ఈటల

ప్లాన్ ప్రకారమే దాడి: ఈటల
  • నాకేం జరిగినా సీఎం కేసీఆర్​దే బాధ్యత
  • దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిక 

హైదరాబాద్, వెలుగు: తన హత్యకు కుట్ర జరుగుతోందని, స్కెచ్ ప్రకారమే మునుగోడులో తనపై దాడి జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. తనకు  ఒక్క రక్తపు బొట్టు కారినా సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని అన్నారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘బిడ్డా.. నన్ను చంపుతావా? చంపి బతికి బట్టకడ్తవా? నాపై దాడి జరిగితే కేంద్రంలో అధికారంలో ఉన్న మా పార్టీ చూస్తూ ఊరుకుంటుందా?” అని కేసీఆర్ కు ఈటల వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ ప్రోత్సాహంతోనే బీజేపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. హుజూరాబాద్​లో అవసరం లేకున్నా, అనేక మందికి గన్ లైసెన్సులు ఇచ్చారన్నారు. ‘‘హుజూరాబాద్​లో టీఆర్ఎస్ ఓటమితో నాపై కేసీఆర్ పగ పట్టారు. అందుకే దాడులు చేయిస్తున్నారు. నా భార్య జమున తన సొంతూరు ప్రచారానికి వెళ్తే అడ్డుకునే ప్రయత్నం చేశారు. అసభ్య పదజాలంతో దూషించారు. టీఆర్ఎస్ దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోం” అని హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తలు కేసీఆర్ ఆడిస్తే ఆడే తోలు బొమ్మలు కాదని, చెంచాగాళ్లకు బీజేపీ భయపడదని అన్నారు. 

సొంత రాష్ట్రంలో రక్షణ లేదు.. 

ప్లాన్ ప్రకారమే తన కాన్వాయ్ పై దాడి జరిగిందని, గతంలోనూ ఇలాగే దాడి చేసేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారని ఈటల మండిపడ్డారు. ‘‘పలివెలలో  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారాన్ని సైతం అడ్డుకున్నారు. పోలీసులు ఏం చేస్తున్నట్టు? మా పార్టీ కార్యకర్తలపై రాళ్లు రువ్వారు. కర్రలతో కొట్టారు. నా గన్ మెన్లు లేకపోతే నా తల పగిలేది. నా పీఆర్వో, గన్ మెన్​లకు గాయాలయ్యాయి” అని చెప్పారు. ‘‘రాష్ట్ర ఉద్యమంలో  అర్ధరాత్రి కూడా ఒక్కరమే బయట తిరిగేవాళ్లం. నయీం ముఠా బెదిరించినా భయపడలేదు. కేసీఆర్ హయాంలో బయటకు పోతే ఇంటికి తిరిగి వస్తామన్న నమ్మకం లేకుండా పోయింది” అని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి డీఎస్పీని కొట్టారని, పోలీసుల విలువలు కాపాడడంలో డీజీపీ విఫలమయ్యారని మండిపడ్డారు.