
- లోపలికి చొరబడి 40 మంది దుండగుల విధ్వంసం
- 15 మంది పోలీసులకు గాయాలు
- 9 మంది అరెస్టు
- కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తు.. ఐదుగురు డాక్టర్లకు సమన్లు
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లో ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్యకు గురైన ఆర్జీ కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీపై కొంతమంది దుండగులు దాడి చేశారు. నిరసనకారుల ముసుగులో వచ్చి ఆస్పత్రిలో విధ్వంసం సృష్టించారు. డాక్టర్ పై రేప్ అండ్ మర్డర్ కు నిరసనగా బుధవారం అర్ధరాత్రి దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. ఈ క్రమంలో కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ వద్దకు పెద్ద ఎత్తున జనం చేరుకున్నారు. ఆ టైమ్ లో కొంతమంది దుండగులు నిరసనకారుల ముసుగులో అక్కడికి వచ్చారు.
అర్ధరాత్రి ఆందోళన ప్రారంభం కాగా.. 40 మంది దుండగులు ఆస్పత్రిలోకి దూసుకెళ్లారు. వెహికల్స్, వార్డులు, రూమ్స్, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. పోలీస్ ఔట్ పోస్టుపైనా దాడి చేశారు. పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. గుంపును కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. దుండగుల దాడిలో 15 మంది పోలీసులకు గాయాలయ్యాయి. కాగా, ఆస్పత్రిపై దాడికి పాల్పడినోళ్ల ఫొటోలను పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రజలు ఇచ్చిన సమాచారంతో 9 మందిని అరెస్టు చేశారు.
క్రైమ్ జరిగిన సెమినార్ హాల్ ను కూడా దుండగులు ధ్వంసం చేశారని ప్రచారం జరగ్గా, అదంతా అబద్ధమని పోలీసులు తెలిపారు. కాగా, బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ గురువారం ఆస్పత్రిని సందర్శించారు. జూనియర్ డాక్టర్లతో మాట్లాడారు. ‘‘దీనిపై మనందరం పోరాడుదాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని భరోసా ఇచ్చారు. కాగా, ఆస్పత్రిపై దాడి వెనుక ప్రతిపక్ష పార్టీల హస్తం ఉందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. అలాగే ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్నది. ఐదుగురు డాక్టర్లు, హాస్పిటల్ స్టాఫ్ కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. విచారణకు రావాలని ఆదేశించింది.
గోల్డ్ మెడల్ లక్ష్యంగా పెట్టుకుని..
రేప్, హత్యకు గురైన మహిళా డాక్టర్.. ఎండీ కోర్సులో గోల్డ్ మెడల్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆమె తండ్రి తెలిపారు. ‘‘నా బిడ్డకు చదువు అంటే చాలా ఇష్టం. రోజుకు 10–12 గంటలు చదివేది. ఎండీ కోర్సులో గోల్డ్ మెడల్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఘటన జరిగిన రోజు డ్యూటీకి వచ్చే ముందే డైరీలో ఇది రాసుకుంది” అని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, డిమాండ్ల సాధన కోసం మళ్లీ సమ్మె చేస్తామని ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఫోర్డా) ప్రకటించింది. ఆస్పత్రిపై జరిగిన దాడి ఘటనతో షాక్ కు గురయ్యామని పేర్కొంది.