ఐఆర్​సీటీసీ పేరుతో నకిలీ యాప్.. అప్రమత్తంగా లేకపోతే అంతే సంగతులు

ఐఆర్​సీటీసీ పేరుతో నకిలీ యాప్.. అప్రమత్తంగా లేకపోతే అంతే సంగతులు

 

న్యూఢిల్లీ: తమ సంస్థ పేరుతో సైబర్  క్రిమినల్స్ ​నకిలీ మొబైల్​యాప్​ను తయారు చేసి మోసాలకు పాల్పడుతున్నారని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరి జం కార్పొరేషన్ (ఐఆర్​సీటీసీ) హెచ్చరించింది. ఈ మొబైల్ యాప్ ప్రచారం గురించి అత్యవసర హెచ్చరికను జారీ చేసింది. మోసగాళ్లు పెద్ద ఎత్తున ఫిషింగ్ లింక్‌‌‌‌లను సర్క్యులేట్ చేస్తున్నారని, నకిలీ 'ఐఆర్​సీటీసీ రైల్ కనెక్ట్' మొబైల్ యాప్‌‌‌‌ను డౌన్‌‌‌‌లోడ్ చేసుకోవడానికి లింకులను పంపుతున్నారని తెలిపింది. ఈ స్కామర్ల లక్ష్యం సాధారణ జనాన్ని మోసగించడమేనని  ఐఆర్​సీటీసీ స్పష్టం చేసింది. 

ఆన్‌‌‌‌లైన్ టికెటింగ్,  ఇతర  రైల్వే సంబంధిత సేవలను అందించే ఐఆర్​సీటీసీ... యాప్​ విషయంలో జాగ్రత్తగా,  అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అండ్రా యిడ్​ వినియోగదారుల కోసం గూగుల్​ప్లే  స్టోర్​లో,  ఐఓఎస్​ వినియోగదారుల కోసం యాపిల్​యాప్​  స్టోర్లో అందుబాటులో ఉన్న అధికారిక ఐఆర్​సీటీసీ రైల్ కనెక్ట్ మొబైల్ యాప్‌‌‌‌లను మాత్రమే డౌన్‌‌‌‌లోడ్ చేసుకోవాలి. లింకుల ద్వారా నకిలీ యాప్​ను డౌన్​లోడ్​ చేసుకుంటే మోసాల బారిన పడే అవకాశాలు ఉంటాయి. ఏదైనా సమాచారం కావాలన్నా, ప్రశ్నలు అడగాలన్నా ఐఆర్​సీటీసీ అధికారిక వెబ్‌‌‌‌సైట్ https://irctc.co.inలో ఇచ్చిన అధికారిక నంబర్‌‌‌‌ల ద్వారా మాత్రమే ఐఆర్​సీటీసీ కస్టమర్ కేర్‌‌‌‌తో మాట్లాడాలి. 

సున్నితమైన సమాచారం చోరీ...
ఈ మోసపూరిత మొబైల్ యాప్ స్కామ్ యూజర్​కు తెలియకుండానే సున్నితమైన, వ్యక్తిగత సమాచారాన్ని మొబైల్​ నుంచి చోరీ చేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా ఆర్థిక మోసాల బారిన పడొచ్చని అంటున్నారు.  ఈ యాప్​ను వాడితే  లాగిన్ ఐడీ, పాస్​వర్డ్​, పేమెంట్​ సమాచారం  వ్యక్తిగత డేటా వంటి ముఖ్యమైన వివరాలు సైబర్ ​క్రిమినల్స్​ చేతుల్లోకి వెళ్లే ప్రమాదం పొంచి ఉంది. ఈ వివరాలతో మోసగాళ్లు నేరాలు చేసే అవకాశం ఉంటుంది. ‘‘ కొంతమంది మోసగాళ్ళు భారీ స్థాయిలో ఫిషింగ్ లింక్‌‌‌‌లను పంపుతున్నారు.   జనాన్ని మోసం చేయడానికి నకిలీ ‘ఐఆర్​సీటీసీ రైల్ కనెక్ట్’ మొబైల్ యాప్‌‌‌‌ను డౌన్‌‌‌‌లోడ్ చేయాలని కోరుతున్నారు.


ఈ నకిలీ మొబైల్ యాప్​ను డౌన్​లోడ్​ చేసుకుంటే ప్రమాదంలో పడతారు. ఇలాంటి మోసగాళ్ల బారిన పడవద్దు.  గూగుల్​ప్లే స్టోర్​ లేదా యాపిల్ ​యాప్​స్టోర్​ నుండి మాత్రమే ఐఆర్​సీటీసీ  అధికారిక రైల్​కనెక్ట్​ మొబైల్ యాప్‌‌‌‌లను డౌన్​లోడ్ ​చేసుకోవాలి. మరిన్ని వివరాలకు మా అధికారిక వెబ్‌‌‌‌సైట్ https://irctc.co.inలోని నంబర్లకు కాల్ చేయాలి. యాప్​ విషయంలో అప్రమత్తంగా ఉండండి! సురక్షితంగా ఉండండి!" అని ఐఆర్​సీటీసీ ట్వీట్ చేసింది. గుర్తు తెలియని వ్యక్తులు పంపిన లింక్స్​పై క్లిక్​ చేయవద్దని సూచించింది.  ఇంటర్నెట్‌‌‌‌ని బ్రౌజ్ చేస్తున్నప్పుడు  జాగ్రత్తగా ఉండటం ముఖ్యమని స్పష్టం చేసింది. 


కొన్ని నెలల క్రితం కూడా నకిలీ ఐఆర్​సీటీసీ వెబ్​సైట్​, యాప్​ ద్వారా మోసాలు జరిగాయని ఈ సంస్థ పేర్కొంది. నకిలీ మొబైల్​యాప్​ లింక్స్​ను వాట్సాప్​, టెలిగ్రాంల ద్వారా సర్క్యులేట్​చేస్తున్నారని హెచ్చరించింది.