AUS vs WI: ఆస్ట్రేలియా జట్టులో కరోనా కలకలం.. ఇద్దరికి కోవిడ్ పాజిటివ్ 

AUS vs WI: ఆస్ట్రేలియా జట్టులో కరోనా కలకలం.. ఇద్దరికి కోవిడ్ పాజిటివ్ 

మూడేళ్ల క్రితం ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా (Covid-19) మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్తరూపు సంతరించుకుంటూ సబ్‌వేరియంట్‌ రూపంలో వేగంగా విస్తరిస్తోంది. నాలుగు గోడల మధ్య ఉంటూ.. మైదానాలకు పరిమితమయ్యే క్రికెటర్లను సైతం ఈ మహమ్మారి వదలడం లేదు. క్రికెట్ ఆడే దేశాలలో ఎవరో ఒకరు.. ఎక్కడో ఓ చోట దీని బారిన పడుతూనే ఉన్నారు. 

వారం రోజుల క్రితం న్యూజిలాండ్ జట్టులో కరోనా కలకలం సృష్టించింది. పాకిస్తాన్‌తో టీ2 సిరీస్ జరుగుతుండగానే ఆ జట్టు ఆటగాళ్లు మిచెల్ సాంట్నర్(Mitchell Santner), డెవాన్ కాన్వే(Devon Conway) కోవిడ్ బారిన పడ్డారు. వెంట‌నే అప్రమ‌త్తమైన కివీస్ మేనేజ్మెంట్ వీరిని ఐసోలేష‌న్‌లో ఉంచి.. మిగిలిన ఆటగాళ్లకు వ్యాపించకుండా జాగ్రత్త పడింది. ఇది జరిగిన నాలుగు రోజులకే ఆస్ట్రేలియా జట్టులో కరోనా కలకలం రేపింది. ఇప్పటికే ఆ జట్టు బ్యాటర్ ట్రావిస్ హెడ్ కరోనా బారిన పడగా.. బుధవారం(జనవరి 24) జరిపిన వైద్య పరీక్షల్లో మరో ఇద్దరికి కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. 

జనవరి 25 నుంచి ఆస్ట్రేలియా- వెస్టిండీస్ జట్ల మధ్య బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా పింక్-బాల్ టెస్టు ప్రారంభం కానుంది. ఈ  మ్యాచ్‌కు ముందు జరిపిన వైద్య పరీక్షల్లో ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్(Andrew McDonald), ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్(Cameron Green) కోవిడ్-19 కరోనా బారిన పడ్డారు. దీంతో వీరిద్దరిని ఐసోలేష‌న్‌లో ఉంచారు. వీరికి తదుపరి 24 గంటల్లో మరోసారి పరీక్షలు నిర్వహించనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటన చేసింది.