ఉత్కంఠపోరులో ఆఫ్ఘాన్పై ఆసీస్ విక్టరీ

ఉత్కంఠపోరులో ఆఫ్ఘాన్పై ఆసీస్ విక్టరీ

చావోరేవో మ్యాచ్లో ఆసీస్ ఎట్టకేలకు విజృంభించింది. టీ20 వరల్డ్ కప్లో సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో  విజయం సాధించింది. అఫ్ఘనిస్తాన్ తో ఉత్కంఠబరితంగా జరిగిన మ్యాచ్లో 4 పరుగుల తేడాతో గెలిచి..సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. 

మ్యాక్స్ దంచిండు..
ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 168 పరుగులు చేసింది. గ్లేన్ మ్యాక్స్‌వెల్ 32 బంతుల్లో 6 ఫోర్లతో 54 నాటౌట్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. మిచెల్ మార్ష్ 30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45 పరుగులు, వార్నర్ 18 బంతుల్లో 5 ఫోర్లతో 25 పరుగులతో రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 3 వికెట్లు పడగొట్టగా...ఫజల్లాక్ ఫరూఖీ 2 వికెట్లు తీశాడు. ముజీబ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ తలో వికెట్  దక్కించుకున్నారు. 

దగ్గర దాకా వచ్చి...
ఆ తర్వాత 169 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన  అఫ్గానిస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 164 పరుగులే చేసి ఓడిపోయింది. రషీద్ ఖాన్‌కు తోడుగా గుల్బాదిన్ నైబ్ 23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39 రన్స్, రెహ్మానుల్లా గుర్బాజ్17 బంతుల్లో 2ఫోర్లు, 2 సిక్స్‌లతో 30 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హజెల్ వుడ్, ఆడమ్ జంపా తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు. కేన్ రిచర్డ్‌స్ ఓ వికెట్ పడగొట్టాడు.

వణికించిన ఆఫ్ఘాన్..
ఈ మ్యాచ్లో అఫ్ఘనిస్తాన్ పోరాడి ఓడింది. విజయానికి చేరువగా వచ్చి పరాజయం చవిచూసింది. చివరి ఓవర్‌లో అఫ్గాన్ విజయానికి 22 పరుగులు అవసరమవ్వగా.. స్టోయినిస్ వేసిన వైడ్ బంతికి రసూలీ రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత బంతికి పరుగులు రాలేదు. సెకండ్ బాల్ కు రషీద్ ఫోర్ కొట్టడంతో...సమీకరణం 4 బంతుల్లో 17 పరుగులుగా మారింది. మూడో బంతికి పరుగులు రాలేదు. అయితే .నాలుగో బంతిని సిక్సర్‌గా కొట్టాడు.  ఐదో బంతికి రెండే పరుగులు తీయడంతో...ఆసీస్ విజయం ఖాయమైంది. చివరి బంతికి రషీద్ ఫోర్ కొట్టినా ఫలితం లేకపోయింది.