
బర్మింగ్‌హామ్: టెస్టు క్రికెట్లోని అసలైన మజా చూపెట్టిన యాషెస్ సిరీస్ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా థ్రిల్లింగ్విక్టరీ సాధించింది. ఛేజింగ్‌లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (73 బాల్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44 నాటౌట్), ఉస్మాన్ ఖవాజ (197 బాల్స్‌లో 7 ఫోర్లతో 65) రాణించడంతో.. మంగళవారం ముగిసిన టెస్టులో ఆసీస్ రెండు వికెట్ల తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్‌పై నెగ్గింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0 లీడ్‌లో నిలిచింది. 281 రన్స్ ఛేదించే క్రమంలో 107/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆఖరి రోజు బరిలోకి దిగిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 92.3 ఓవర్లలో 282/8 స్కోరు చేసి గెలిచింది. ఖవాజకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్ట్ వచ్చే నెల 2 నుంచి లార్డ్స్‌లో జరుగుతుంది.
వాన అడ్డుకున్నా..
ఆఖరి రోజు ఆటకు భారీ వర్షం అడ్డుగా నిలిచినా.. ఆసీస్ విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయింది. ఉదయం భారీ వాన వల్ల తొలి సెషన్ రద్దయింది.లంచ్ తర్వాత వాన ఆగడంతో అంపైర్లు 67 ఓవర్ల ఆటకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఓవర్‌నైట్ బ్యాటర్లు ఖవాజ, బోలాండ్ (20) క్రీజులోకి వచ్చారు. పిచ్ మందకొడిగా ఉండటంతో స్టార్టింగ్‌లో ఇంగ్లిష్ బౌలర్లు ప్రభావం చూపెట్టారు. ఓ ఎండ్‌లో ఖవాజ డిఫెన్స్‌కు ప్రాధాన్యమిచ్చినా, డే ఎనిమిదో ఓవర్‌లో బ్రాడ్ (3/64).. బోలాండ్‌ను ఔట్ చేశాడు. ఈ దశలో ట్రావిస్ హెడ్ (16) నిలకడగా ఆడాడు. ఇంగ్లిష్ పేస్–స్పిన్ కాంబినేషన్‌ను దీటుగా ఎదుర్కొంటూ ఖవాజాకు మంచి సహకారం అందించాడు. అయితే ఈ జోడీని విడగొట్టడానికి కెప్టెన్ స్టోక్స్.. పేస్–స్పిన్ కాంబినేషన్‌ను బరిలోకి దించాడు.
స్పిన్నర్ మొయిన్ అలీ (1/57) రన్స్‌ను కట్టడి చేయడంతో పాటు 45వ ఓవర్‌లో హెడ్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఫలితంగా ఐదో వికెట్‌కు 22 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయ్యింది. ఈ దశలో కామెరూన్ గ్రీన్ (28) ఫర్వాలేదనిపించాడు. ఎక్కువగా డిఫెన్స్ ఆడుతూనే వీలైనప్పుడల్లా సింగిల్స్‌తో ముందుకెళ్లాడు. ఖవాజ కూడా హాఫ్ సెంచరీతో క్రీజులో పాతుకుపోయాడు. ఇక ఫర్వాలేదనుకుంటున్న టైమ్‌లో రాబిన్సన్ (2/43) వైడ్ యాంగిల్‌లో వేసిన లెంగ్త్ బాల్ గ్రీన్ వికెట్లను ఎగరగొట్టింది. దీంతో ఆరో వికెట్‌కు 49 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. మరో ఆరు ఓవర్ల తర్వాత స్టోక్స్ వేసిన లో లెంగ్త్ బాల్‌కు ఖవాజ క్లీన్ బౌల్డ్ కావడంతో ఆసీస్ 209/7తో ఎదురీత మొదలుపెట్టింది. ఇక కంగారూలు గెలవాలంటే 72 రన్స్ అవసరమైన దశలో క్రీజులోకి వచ్చిన కమిన్స్, అలెక్స్ క్యారీ (20)తో కలిసి పోరాటం మొదలుపెట్టాడు. ఇంగ్లండ్ బౌలర్లు యార్కర్లు, బౌన్సర్లతో భయపెట్టినా కమిన్స్ నిలకడగా రన్స్ రాబట్టాడు. చివర్లో రూట్ (1/43).. క్యారీని ఔట్ చేసినా, స్పిన్నర్ నేథన్ లైయన్ (16 నాటౌట్)తో కలిసి కమిన్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తొమ్మిదో వికెట్‌కు 55 రన్స్ జత చేసి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. కీలక టైమ్‌లో క్యాచ్‌లు చేజార్చి, ఫీల్డింగ్‌లో తడబడ్డ ఇంగ్లండ్ చేజేతులా ఓడింది.