AUS vs SA: సిరీస్ గెలిచినా చిత్తుగా ఓడారు.. సౌతాఫ్రికా వన్డే చరిత్రలో అతి పెద్ద ఓటమి

AUS vs SA: సిరీస్ గెలిచినా చిత్తుగా ఓడారు.. సౌతాఫ్రికా వన్డే చరిత్రలో అతి పెద్ద ఓటమి

ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో సౌతాఫ్రికా ఘోరంగా ఓడిపోయింది. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా చివరి వన్డేలో 276 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఆదివారం (ఆగస్టు 24) మెకే వేదికగా గ్రేట్ బారియర్ రీఫ్ అరీనాలో ముగిసిన ఈ మ్యాచ్ లో ఓడిపోయిన సౌతాఫ్రికా తమ వన్డే కెరీర్ లో అతి పెద్ద ఓటమిని చవిచూసింది. వన్డే క్రికెట్ చరిత్రలో ఇది రెండో అతి పెద్ద ఓటమి. ఈ సిరీస్ లో తొలి రెండు వన్డేల్లో గెలిచిన సౌతాఫ్రికా 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ట్రావిస్ హెడ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. కేశవ్ మహరాజ్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి. 

432 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 24.5 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌట్ అయింది. లక్ష్యం భారీగా ఉండడంతో మొదటి నుంచి వేగంగా ఆడాలని చూసిన సౌతాఫ్రికా 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి మ్యాచ్ పై ఆశలు వదిలేసుకుంది. ఈ సమయంలో బ్రెవిస్, జార్జి కాసేపు మెరుపు మెరిపించారు. వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో బుత్ కావడంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సమయం పట్టలేదు. 49 పరుగులు చేసిన బ్రెవిస్ టాప్ స్కోరర్ కాగా.. మిగిలిన వారందరూ విఫలమయ్యారు. కూపర్ కొన్నోల్లీ 5 వికెట్లు తీసి సఫారీలను తన స్పిన్ మాయాజాలంతో చిత్తు చేశాడు. జేవియర్ బార్ట్‌లెట్, అబాట్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. 

అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన  ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఏకంగా 431 పరుగులు చేసింది. జట్టులో ఏకంగా ముగ్గురు సెంచరీలు కొట్టడం విశేషం. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (140), మిచెల్ మార్ష్(100) సెంచరీలతో విజృంభిస్తే.. ఆ  తర్వాత కెమరూన్ గ్రీన్ (118) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. హెడ్ 103 బంతుల్లోనే 17 ఫోర్లు, 5 సిక్సర్లతో 140 పరుగులు చేశాడు. మరోవైపు మార్ష్ 106 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 100 పరుగులు చేశాడు. పవర్ హిట్టింగ్ తో దుమ్ములేపిన గ్రీన్ కేవలం 47 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్యారీ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. వీరిద్దరూ మూడో వికెట్ కు అజేయంగా 164 పరుగులు జోడించడం విశేషం.