తండ్రి అంత్యక్రియలలో అతని హెల్మెట్ ధరించి పాల్గొన్న చిన్నారి

తండ్రి అంత్యక్రియలలో అతని హెల్మెట్ ధరించి పాల్గొన్న చిన్నారి

తండ్రి అంత్యక్రియలలో అతని హెల్మెట్ మరియు అతని డ్రెస్‌పై ఉండే గౌరవ పతాకాన్ని ధరించి 19 నెలల చిన్నారి పాల్గొంది. ఆ దృశ్యం అందరినీ కంటతడి పెట్టేలా చేసింది. మరణించిన ఫైర్ అధికారి సేవలను గుర్తించిన ప్రభుత్వం అతని హెల్మెట్ మరియు గౌరవ పతాకాన్ని అతని కూతురుకు బహుకరించారు. వాటిని ధరించి ఆ పాప తండ్రి అంత్యక్రియలలో పాల్గొంది.

కొన్ని రోజులుగా ఆస్ట్రేలియాలో బుష్‌ఫైర్‌ అడవులను కాల్చుతుంది. ఆ మంటల్లో వేలకొద్ది వన్యప్రాణులు తమ ప్రాణాలను కొల్పోతున్నాయి. ఎంతోమంది ప్రజలు తమ ఇళ్లు కాలిపోయి రోడ్డున పడ్డారు. ఆ మంటలను అదుపుచేయడానికి ఆస్ట్రేలియా అగ్నిమాపక దళం తీవ్ర ప్రయత్నం చేస్తోంది. ఆ మంటలను ఆపే క్రమంలో ఆండ్రూ ఓడ్వైర్ మరియు అతని సహోద్యోగి జెఫ్రీ కీటన్ డిసెంబర్ 19న మరణించారు. వారు ప్రయాణిస్తున్న ఫైర్ ఇంజిన్‌పై కాలుతున్న ఒక భారీ వృక్షం పడింది. ఆ మంటల్లో వారు చనిపోయారు.

36 ఏళ్ల ఓడ్వైర్ న్యూ సౌత్ వేల్స్ రూరల్ ఫైర్ సర్వీస్‌లో సీనియర్ వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. అతని మృతి పట్ల ఆస్ట్రేలియా అగ్నిమాపక సిబ్బంది నివాళులు అర్పించారు. సిడ్నీలో జరుగుతున్న ఓడ్వైర్ అంత్యక్రియలకు ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ కూడా హాజరయ్యారు.

ఆండ్రూ ఓడ్వైర్ ధైర్యసాహసాలు మరియు సేవలను గుర్తించి.. సేవా పతకంతో పాటూ అతని హెల్మెట్‌ను కూడా ఆయన కుమార్తె షార్లెట్‌కు అగ్నిమాపక సేవా కమిషనర్ షేన్ ఫిట్జ్‌సిమ్మన్స్ అందజేశారు. ఆ సందర్భంగా ఫిట్జ్‌సిమ్మన్స్.. ‘బేబీ షార్లెట్ నువ్వో విషయం తెలుసుకోవాలి. మీ నాన్న ఒక ప్రత్యేకమైన వ్యక్తి, నిస్వార్థపరుడు, మరియు అతనో హీరో. అందుకే అతను మన మధ్య లేడు’ అని షార్లెట్‌తో అన్నారు. షార్లెట్ తండ్రి అంత్యక్రియలలో హెల్మెట్ మరియు పతకాన్ని ధరించింది. అది చూసి అక్కడున్న వాళ్లు చాలామంది కంటతడి పెట్టారు. ఆస్ట్రేలియా పీఎం స్కాట్ మోరిసన్.. ఓడ్వైర్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆస్ట్రేలియాలో నెలరోజులుగా కొనసాగుతున్న బుష్‌ఫైర్ సంక్షోభం వల్ల పలు ఇళ్లు ధ్వంసమవడంతో పాటు వేలకొద్ది వన్యప్రాణులు చనిపోయాయి. ఈ బుష్‌ఫైర్ వల్ల ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 26కి చేరుకుంది.

Australian firefighter's daughter wearing father's helmet during his funeral