IPL 2024: వీళ్ళు దేశానికే ఆడతారా! ఐపీఎల్‌లో ఆసీస్ ఆటగాళ్ళ ఫ్లాప్ షో

IPL 2024: వీళ్ళు దేశానికే ఆడతారా! ఐపీఎల్‌లో ఆసీస్ ఆటగాళ్ళ ఫ్లాప్ షో

ఐపీఎల్ ప్రారంభమైందంటే చాలు అందరి కళ్ళు విదేశీ ఆటగాళ్లపైనే ఉంటాయి. ఆడే నలుగురు విదేశీ ఆటగాళ్లే మ్యాచ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తారు. ముఖ్యంగా ఆసీస్ ఆటగాళ్లపై ఫ్రాంచైజీలతో పాటు ఫ్యాన్స్ ఆశలు పెట్టుకుంటారు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఆస్ట్రేలియా ప్లేయర్లు నిండా ముంచేస్తున్నారు. ఒకరిద్దర మినహాయిస్తే దాదాపు ప్రతి ఒక్కరూ విఫలమవుతున్నారు. వీరిలో ప్రధానంగా ఎవరెవరున్నారో ఇప్పుడు చూద్దాం.

 
మ్యాక్స్ వెల్:

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ మ్యాక్స్ వెల్ కు అసలు కలిసి రావడం లేదు. బ్యాటింగ్ ఇలా వచ్చి అలా వెళ్తున్నాడు. పట్టుమని పది బంతులు ఆడకుండా కనీసం రెండంకెల స్కోర్ చేయకుండానే పెవిలియన్ కు చేరుతున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ విధ్వంసకర వీరుడు..దారుణంగా విఫలమవుతున్నాడు. మొత్తం 6 ఇన్నింగ్స్ ల్లో మొత్తం 32 పరుగులు చేసి ఘోరంగా విఫలమయ్యాడు. ఆరు ఇన్నింగ్స్ లలో మ్యాక్స్ వెల్ కు ఇది మూడో డకౌట్. 

మిచెల్ స్టార్క్:

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్ మిచెల్ స్టార్క్. అతనిపై ఎన్నో ఆశలతో కోల్‌కతా నైట్ రైడర్స్ గత వేలంలో ఏకంగా రూ.24.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. కానీ ఆ టీమ్ ఆడిన 4 మ్యాచ్ లలో స్టార్క్ కేవలం రెండే వికెట్లు తీసుకున్నాడు. తొలి రెండు మ్యాచ్ ల్లో 8 ఓవర్లలో వికెట్లేమీ తీయకుండా ఏకంగా 100 పరుగులు సమర్పించుకున్నాడు. అంతేకాదు భారీగా పరుగులు ఇస్తూ ఏకంగా 11 ఎకానమీ రేటు నమోదు చేస్తున్నాడు. ఆ టీమ్ మొదటి మూడు మ్యాచ్ లలో గెలిచినా స్టార్క్ ప్రభావం మాత్రం అసలు ఏమీ లేదు. భారీగా ఆశలు పెట్టుకున్న స్టార్క్ ఫ్లాప్ షో చేస్తూ కేకేఆర్ జట్టుకు భారంగా మారాడు.

మిచెల్ మార్ష్:

మార్ష్ ఇప్పటివరకు ఐపీఎల్ లో ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. నాలుగు మ్యాచ్ ల్లో 71 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన ఈ ఆసీస్ వీరుడు ఘోరంగా విఫలమవుతున్నాడు. బ్యాటింగ్ లో ఓపెనర్ గా వస్తూ నాలుగు మెరుపులతో సరిపెట్టుంటున్నాడు. బౌలింగ్ లో కూడా తేలిపోతున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ గా గొప్ప రికార్డ్ ఉన్న మార్ష్.. ఐపీఎల్ మాత్రం విఫలమవుతున్నాడు. 

వార్నర్:

ఐపీఎల్ అంటే రెచ్చిపోయే వార్నర్ ప్రస్తుత సీజన్ లో రాణించలేకపోతున్నాడు. తొలి రెండు మ్యాచ్ ల్లో పర్వాలేదనిపించినా..ఆ తర్వాత మూడు మ్యాచ్ ల్లో విఫలమయ్యాడు. క్రీజ్ లో కుదురుకోవటానికే సమయం ఎక్కువగా తీసుకుంటున్నాడు. ఒకప్పటి మెరుపులు వార్నర్ లో చూడలేకపోతున్నాం. రిటైర్మెంట్ దశలో ఉన్న ఈ ఆసీస్ విధ్వంసకర ఓపెనర్..కంబ్యాక్ ఇవ్వడం కష్టంగానే కనిపిస్తుంది. 

వీరితో పాటు కమ్మిన్స్, హెడ్ లాంటి స్టార్ ఆటగాళ్లు పెద్దగా రాణించింది ఏమీ లేదు. దేశం తరపున ఎంతో అంకిత భావంతో ఆడే వీరు ఐపీఎల్ ను మాత్రం తేలికగా తీసుకుంటున్నారని నెటిజన్స్ ఇప్పటికే మండిపడుతున్నారు. మరి వీరు ఇప్పటికైనా కోట్లు పెట్టి కొనుకున్న వీళ్ళు తమ ధరకు న్యాయం చేస్తారో లేదో చూడాలి.